`ది బర్త్ డే బాయ్` మూవీ రివ్యూ, రేటింగ్
యదార్థ సంఘటనలతో రూపొందిన సినిమా `ది బర్త్ డే బాయ్`. రవికృష్ణ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
రియలిస్టిక్ కంటెంట్‌తో తెరకెక్కించిన సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. రియల్ ఎమోషన్స్ లో ఉండే డ్రామా మిగిలిన అన్నింటిని డామినేట్ చేస్తుంటుంది. అలా ఒక రియల్ ఇన్సిడెంట్ తో రూపొందించిన చిత్రం `ది బర్త్ డే బాయ్`. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విస్కి దర్శకత్వం వహించారు. ఐ భరత్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
తెలుగు స్టేట్స్ కి చెందిన ఐదుగురు కుర్రాళ్లు బాలు(మణి), అర్జున్(వెంకీ), వెంకట్(రాజా అశోక్), సాయి(అరుణ్), సత్తి(రాహుల్) అమెరికాలో స్టడీస్ చేస్తుంటారు. వారిలో బాలు అనే కుర్రాడి బర్త్ డే రోజు అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. బర్త్ డే కావడంతో బాగా తాగుతారు. తాగిన మైకంలో బాలుపై శృంతి మించి అల్లరి చేస్తారు. అతి ఆనందం ప్రమాదాలకు కారణమవుతుందంటారు. అలానే ఇందులోనూ బాలుని అందరు కలిసి ఎత్తుకుని ఆటపట్టిస్తుంటారు. ఈ క్రమంలో పట్టుకుని విసిరేయడంతో బలంగా కింద పడి చనిపోతాడు. దీంతో అందరు షాక్. ఏం చేయాలో తెలియని అయోమయం. భయంతో వణికిపోతుంటారు. ఆ టెన్షన్‌లో అర్జున్ ఫ్రెండ్ లాయర్ అయిన భరత్(రవి కృష్ణ)ని పిలుస్తారు. ఆయన సారథ్యంలో బాడీని మాయం చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, ఇండియా నుంచి బాలు పేరెంట్స్ (రాజీవ్ కనకాల, ప్రమోదిని) అమెరికా వస్తారు. దీంతో వారిలో మరింత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తన ఫ్రెండ్ ని చూపించాల్సి వచ్చినప్పుడు వాళ్లు ఏం చేశారు? బాలుని మాయం చేశారా? లేదా? బాలు మరణంలోని ట్విస్ట్ ఏంటి? చివరికి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`ది బర్త్ డే బాయ్` మూవీ యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు విస్కీ రూపొందించారు. తన జీవితంలోని ఘటనే ఇది. తన ఫ్రెండ్‌కే ఇలా జరిగింది. అప్పట్నుంచి మదనపడిన దర్శకుడు.. ఎట్టకేలకు దీన్ని సినిమా చేయాలని, అసలు విషయాన్ని బహిర్గతం చేయాలనే ఉద్దేశ్యంతో `ది బర్త్ డే బాయ్` సినిమాని తెరకెక్కించారు. ఓ రకంగా ఇది తన పెయిన్‌లోనుంచి పుట్టిన మూవీ అని చెప్పొచ్చు. అందుకే సినిమాని కూడా అంతే సహజంగా, అంతే రియలిస్టిక్‌గా తెరకెక్కించాడు. ఓ వైపు ఫన్, అంతలోనే సీనియర్, దానిలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ ని మేళవించి థ్రిల్లర్‌గా తెరకెక్కించిన తీరు బాగుంది. కొత్త దర్శకుడు ఇలాంటి పాయింట్‌ని డీల్ చేయడం అభినందించదగ్గ విషయమే.
సినిమా.. బాలు బర్త్ డే పార్టీ చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. స్టూడెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఓ పాటలో చూపిస్తూ ఆడియెన్స్ లోనూ ఆ జోష్ నింపారు. కానీ అంతలోనే ఊహించని ఘటనతో షాక్ కి గురి చేశారు. సినిమాలో ఫ్రెండ్స్ షాక్ అయినట్టుగానే ఆడియెన్స్ కూడా ఫీలయ్యేలా ఆ ఇంట్రడక్షన్ రాయడం హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. బాలు తమ వల్లే చనిపోయాడని, ఆ ఫ్రెండ్స్ టెన్షన్ పడ్డ తీరు, లాయర్ ఫ్రెండ్ క్రియేట్ చేసే టెన్షన్, రవికృష్ణ పాత్ర భయ పెట్టిన తీరు ఆద్యంతం ఉత్కంఠకి గురి చేస్తుంది. ఆ అయోమయంలో బాడీని మాయం చేయాలనుకోవడం, అంతలోనే ఇండియా నుంచి అతని పేరెంట్స్ అమెరికా రావడం, వాళ్లని మ్యానేజ్ చేయడం, విషయం దాచిపెట్టడం ఈ క్రమంలో పుట్టే డ్రామా గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. ఉత్కంఠకి గురి చేస్తుంది. ఉత్కంఠభరితంగానే కాదు, పేరెంట్స్ లోని ఎమోషన్స్ ని ఆవిష్కరిస్తూ సినిమాని నడపించిన తీరు చాలా బాగుంది. ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉంటుంది. అదే సమయంలో హృదయాన్ని బరువెక్కిస్తుంది.
అయితే పాయింట్ చిన్నది కావడం, దాని చుట్టే కథ తిప్పడంతో ఒకదశలో కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. స్లో నరేషన్ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అంశం. కానీ ఆ మర్డర్ కేసుని డీల్ చేసే విధానం, లాయర్ ఇన్వెస్టిగేట్ చేసే తీరు కట్టిపడేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లో మరింత థ్రిల్ చేస్తాయి, షాక్‌కి గురి చేస్తాయి. ఫైనల్‌గా క్లైమాక్స్ ని డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. కొత్త దర్శకుడిలో ఇలాంటి పరిణతి ఊహించడం కష్టం. కానీ సర్‌ప్రైజ్ చేశాడు. అంతిమంగా వచ్చే ట్విస్ట్ ఒకటి మరింత సర్‌ప్రైజ్ చేస్తుంది. కొంత లాజిక్‌లెస్, మరికొంత బోరింగ్ సీన్లు, ఇంకొంత రొటీన్ డ్రామ సీన్లు మైనస్‌గా మారినా, ఓవరాల్‌గా మాత్రం ఆద్యంతం థ్రిల్‌చేస్తుంది. ఇదొక హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇటీవల ఓటీటీలో ఇలాంటి సినిమాలే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలో ఇది కూడా బాగా మెప్పించే మూవీ అవుతుంది. థియేటర్ ఆడియెన్స్ కి ఓ కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది.
నటీనటులు..
సినిమాలో సీరియల్ నటుడు రవికృష్ణ, రాజీవ్ కనకాల, ప్రమోదిని తెలిసిన ఆర్టిస్టులు. వాళ్లు ఎప్పటిలాగే మెప్పించారు. ఎమోషనల్ సీన్లలో రాజీవ్ కనకాల హృదయాన్ని బరువెక్కించారు. రవికృష్ణ పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. తను మరోసారి తన నటనతో మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మిగిలిన వాళ్లంతా కొత్త కుర్రాళ్లు. వాళ్లపై ఎలాంటి అంచనాలుండవు, కానీ సహజంగా చేసి మెప్పించారు. మణి, వెంకీ, రాజా అశోక్, అరుణ్, రాహుల్ నటన చూస్తుంటే రియల్ ఇన్సిడెంట్స్ ని చూస్తున్న ఫీలింగ్ ని కలుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నీకల్‌గాః
సినిమాకి ప్రశాంత్ శ్రీనివాస్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. బిజీఎం మెయిన్ హైలైట్. అదే సినిమాని నడిపించింది. ఉత్కంఠ భరిత సీన్లలో ఆర్‌ఆర్ వాహ్ అనిపిస్తుంది. సంకీర్త్ రాహుల్ కెమెరావర్క్ బాగుంది. చాలా సీన్లని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశాడు. క్రియేటివిటీని చూపించారు. బొమ్మ బొరుసా బ్యానర్‌పై భరత్ సినిమాని చాలా రిచ్‌గా తీశారు. రాజీపడలేదని తెలుస్తుంది. ఇక దర్శకుడు విస్కీ రియలిస్టిక్ సన్నివేశాలను, అంతే రియల్‌గా తెరకెక్కించాడు. తనలో ఉన్న ఎమోషన్స్ ని, బాధని వెండితెరప దించేశాడు. పాత్రలను డిజైన్‌చేసిన తీరు, వాటి ప్రవర్తన, బాలు పేరెంట్స్ పాత్రల తీరుతెన్నులను చాలా సహజంగా తీసి హృదయాన్ని కదిలించారు. ఇక ఇందులోని ట్విస్ట్ లతో ఆయన సర్‌ప్రైజ్ చేశాడని చెప్పొచ్చు. ఓవరాల్‌గా సినిమా థ్రిల్ చేసే ఎమోషనల్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః ఎమోషనల్‌గా థ్రిల్ చేసే బర్త్ డే బాయ్స్..
రేటింగ్‌ః 2.75
నటీనటులు: రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు
దర్శకత్వం: విస్కి
నిర్మాత: ఐ.భరత్,
డీఓపీ : సంకీర్త్ రాహుల్,
సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్,
ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్ వంశీ.జి,
ఎడిటర్: నరేష్ ఆడుపా,
బ్యానర్: బొమ్మ బొరుసా పతాకం