రివ్యూ: శ్రీవిష్ణు 'రాజ రాజ చోర'
శ్రీవిష్ణు దొంగగా కనిపించబోతున్న ఈ సినిమా పై భారీ గా అంచనాలు కల్పించారు. సినిమా మొదటి నుండి ఉన్న అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
'బ్రోచేవారెవరురా'తో హిట్ కొట్టిన శ్రీవిష్ణుకు తిప్పరా మీసం వంటి కథలు తనకు వర్కవుట్ కావని బాగా అర్దమైనట్లుంది. కొద్ది ఫన్, ఇంకొంచెం డ్రామా తో కలిపి సినిమా చేస్తే నిలబడిపోతామని తెలిసిపోయింది. అందులోనూ కొత్తతరం దర్శకులు,కొత్త కాన్సెప్టులు బాగుంటున్నాయి. వారితో జర్నీ చేస్తే తన కెరీర్ జర్నీ కూడా బాగుంటుందని నమ్మి కొత్తవాళ్లతో ముందుకు వెళ్తున్నాడు. ఆ విషయంలో శ్రీవిష్ణుని అభినందించాల్సిందే. అతని నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందా..ఈ సినిమా కథేంటి..ఫన్ సీన్స్ పండాయా...మన మనస్సుని ఈ చోరుడు దోచాడా టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి వంటి విషయాలతో రివ్యూ లోకి వెళ్దాం.
కథేంటి
భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ జెరాక్స్ షాపులో పనిచేస్తూంటాడు. అలాగే అవసరానికో అబద్దం టైప్ లో లైఫ్ ని లీడ్ చేసేసే రకం. భాస్కర్‌కు విద్య( సునైన)తో పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడు. అతను తన భార్య లా చదువుకుంటూంటే డబ్బు ఎడ్జెస్ట్ మెంట్స్ కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూంటాడు. అంతేకాదు అందరితో తాను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుని లైఫ్ లీడ్ చేస్తూంటాడు. ఆ క్రమంలోనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో లవ్ ఎఫైర్ మొదలెడతాడు. అతని అసలు జీవితం తెలియని సంజన పెళ్లి చేసుకుందామనుకుంటుంది. అపార్టమెంట్ లో ఓ ప్లాట్ కొనుక్కుందామని డబ్బులు పోగేస్తూంటుంది. ఆమెతో సెటిల్ అవుదామని భాస్కర్ కూడా ఫిక్స్ అవుతాడు.
ఈలోగా ఓ పెద్ద దొంగతనం చేసి ఆ జీవితానికి స్వస్ది చెప్దామనుకుంటాడు. అయితే ఆ క్రమంలో పోలీస్ ఆఫీసర్ విలియమ్ రెడ్డి (రవిబాబు) కు దొరికిపోతాడు. ఈ క్రమంలో అతను ఆడుతున్న లైఫ్ గేమ్ ఎండ్ కు వస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్ ఇంజనీర్ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజనకు తెలిసిపోతుంది. అలాగే తన భర్త దొంగ అని, వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని భార్యకు తెలిసిపోతుంది. ఓ ప్రక్క దొంగగా పోలీసులకి పట్టుబడ్డాడు. ఇప్పుడు భాస్కర్ జీవితం ఏ టర్న్ తీసుకుంటుంది ? చివరకి ఏం జరిగింది అనేదే మిగతా కథ
విశ్లేషణః అబద్దాలతో బంధాలు నిలబడవు అనే పాయింట్ చుట్టూ అల్లిన ఈ కథలో డ్రామా,ఎమోషన్ బోలెడంత ఉంది. డైరక్టర్ లో సెన్సార్ హ్యూమర్ కావాల్సినంత ఉంది. అయితే అది తెరపైకి ఎంత వరకూ వచ్చింది. జనాలను ఎంతవరకూ పట్టుకున్నది అనేదే అసలైన టాస్క్. డైరక్టర్ తను అనుకున్న పాయింట్ ని నీట్ గా ప్రెజెంట్ చేసాడనటంలో సందేహం లేదు. కామెడీని,ఎమోషన్ ని బాలెన్స్ చేసాడు. ఇంటర్వెల్ అదిరిపోయింది. ఎక్సపెక్టేషన్స్ పెంచేసింది.
అయితే ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఆ స్దాయిని రీచ్ కాలేకపోయింది. చాలా డల్ గా సెకండాఫ్ మొదలైంది. మిడిల్ పోర్షన్స్ మొత్తం చాలా లాగ్ ఉంది. అవి బోర్ కొట్టేస్తాయి. ఏదో క్లైమాక్స్ లో చెప్పాలని మిగతా సీన్స్ ని లాగాలనే ప్రయత్నం విసిగిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా చోట్ల ఎంగేజింగ్ గా ఉన్నా..ఓవరాల్ గా అన్ని సీన్స్ ని కలపటంలో నైపుణ్యం కరువయ్యింది. అలాగే ఫస్టాఫ్ లో క్యారక్టర్స్ పరిచయం,నేపధ్యం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్ లోకి రావటానికి ఇంటర్వెల్ దాకా టైమ్ తీసుకున్నాడు.
Raja Raja Chora
ఇంటర్వెల్ ఫలానా అని మొదటే ఫిక్సై వాటి చుట్టూ సీన్స్ అల్లుతూ స్క్రిప్టు చేసినట్లున్నారు. దాంతో ఫస్టాఫ్ లో ఫన్ తో సీన్స్ రన్ అయినా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు కాంప్లిక్ట్స్ లోకి ఎంత తర్వగా వస్తే అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనే విషయం మర్చిపోయారు. ఓవరాల్ గా అబద్దాలు అనేవి ఆ క్షణానికి పనికొచ్చినా..అన్ని సమయాల్లోనూ అన్ని విధాలుగా కాపాడలేవు అని చెప్దామనే డైరక్టర్ తాపత్రయం నెరవేరినట్లు అనిపించదు.
Raja Raja Chora
అయితే ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే ఈ కథలో ఎక్కువ క్యారక్టర్స్ ని లాక్కు రాకుండా ఉన్న వాటితోనే ఎమోషన్, కామెడీ, లవ్ ట్రాక్ ఇలా అన్నింటిని లాగేసాడు. భార్యకు, ప్రేయసికి అబద్దాలు చెప్పే భాస్కర్ క్యారెక్టర్ ప్రారంభంలోనే మన అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది. అలాగే ఇంటర్వెల్ సీన్స్ కి ముందు భాస్కర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదనే విషయం రివీల్ అయ్యినప్పుడూ... రాజు దొంగగా శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. ఆ ట్విస్ట్ లే కథని నిలబెట్టాయి. ఫస్టాఫ్ లో సెటప్ చేసిన సమస్య..సెకండాఫ్ లో వివరణలతో రిసాల్వ్ చేయాల్సి రావటంతో స్లో అయ్యిందనేది వాస్తవం.
Raja Raja Chora
నటీనటులు..మిగతా విభాగాలు
‘ఈ పాత్రతో మీ ముందుకు రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం’ అన్నారు శ్రీవిష్ణు ఈ చిత్రం ప్రమోషన్ లో..చాలా వరకూ ఆ మాట మీద నిలబడే ప్రయత్నం చేసాడు. ఈ డిఫరెంట్ కథను ఎన్నుకోవటమే సగం సక్సెస్. రెగ్యులర్ గా మన సినిమాల్లో హీరో అంటే చాలా మంచివాడు అన్నట్లుగా క్యారక్టరైజేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ అతన్ని ఓ మామూలు మనిషిగా, బలహీనలు ఉండే వ్యక్తిగా చూపించారు. అందులో శ్రీవిష్ణు ఒదిగిపోయాడు.
Raja Raja Chora
ఇక పోలీస్ అధికారి విలియమ్ రెడ్డి పాత్రలో రవిబాబు ఒదిగిపోయారు. కొత్తగా ఉంది క్యారక్టరైజేషన్. స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా కనపడ్డాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ పంచ్ లు వేసి నవ్వించింది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
Raja Raja Chora
డైరక్టర్ కొన్ని సీన్స్ లో మరీ ఎక్కువ ఇంటిలిజెన్స్ చూపారేమో అనిపిస్తుంది. రైటింగ్ స్టైల్ బాగుంది. ఆ స్దాయి తగ్గ డైరక్షన్ అయితే కనపడదు. టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్స్ లో ఉంది.ముఖ్యంగా వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అయితే పాటలు సోసో. వేద రమణ్ శంకరన్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమా హైలెట్స్ లో ఒకటి. డైలాగులు బాగున్నాయి. ఎడిటర్ విప్లవ్ లాగ్ తగ్గించి సినిమాని పరుగెత్తించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Raja Raja Chora
Rating: 2.5
ఫైనల్ థాట్: కొత్త డైరక్టర్స్,కొత్త ఆలోచనలుని ప్రోత్సహించకపోతే కొత్త అనేది రావటం కష్టమైపోతుంది
ఎవరెవరు..
నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు;
సంగీతం: వివేక్ సాగర్;
సినిమాటోగ్రఫీ: వేద రమణ్ శంకరన్;
ఎడిటింగ్: విప్లవ్;
నిర్మాత: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్;
దర్శకత్వం: హసిత్ గోలి;
విడుదల: 19-08-2021