- Home
- Entertainment
- Movie Reviews
- శివ మూవీ రివ్యూ, నాగార్జున ట్రెండ్ సెట్టింగ్ సినిమా రీ రిలీజ్ లో ఆ మ్యాజిక్ రిపీట్ చేసిందా?
శివ మూవీ రివ్యూ, నాగార్జున ట్రెండ్ సెట్టింగ్ సినిమా రీ రిలీజ్ లో ఆ మ్యాజిక్ రిపీట్ చేసిందా?
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన `శివ` మూవీని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా సినిమాని ప్రదర్శించారు. మరి అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఎలా అనిపించిందంటే?

`శివ` మూవీ రీ రిలీజ్ రివ్యూ
నాగార్జున కెరీర్‌ని టర్న్ తిప్పిన చిత్రం `శివ`. ఆయన కెరీర్‌నే కాదు, తెలుగు సినిమాలోనూ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. సినిమా తీసే విధానమే మార్చేసింది. మూసధోరణులను బ్రేక్ చేస్తూ, సినిమా ఎలా అయినా తీయోచ్చనే కొత్తనిర్వచనం ఇచ్చింది. ఈ సినిమాతోనే బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయాడు నాగ్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడిగానూ నిరూపించుకున్నారు. ఇందులో ఆయన రియలిస్టిక్ యాక్టింగ్, యాక్షన్ ఆడియెన్స్ చేత చప్పట్లు కొట్టించాయి. ఈ సినిమాతో రామ్ గోపాల్‌వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక్కదెబ్బతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో అమల హీరోయిన్‌గా నటించింది. నాగ్, అమల మొదటిసారి కలిసి నటించిన మూవీ. ఈచిత్రంతోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు. 1989 అక్టోబర్ 5 ఈ సినిమా విడుదలైంది. సంచలనం విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియో స్థాపించి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు 36ఏళ్ల తర్వాత `శివ`ని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 4కే లోకి మార్చి, డాల్బీ ఆట్మాస్ సౌండ్ యాడ్ చేసి, కొత్త సినిమా తరహాలో ఎడిటింగ్ చేశారు. ఈ మూవీపై వర్మ దాదాపు ఆరు నెలలు కూర్చున్నారట. ఎట్టకేలకు ఈ నెల 14న సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే మీడియాకి స్పెషల్ ప్రీమియర్ ద్వారా ప్రదర్శించారు. మరి సినిమా అప్పటి మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ చేసిందా? ఇప్పటి ఆడియెన్స్ కి నచ్చుతుందా? థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`శివ` మూవీ కథ ఏంటంటే
అన్నయ్య శరత్(మరళీ మోహన్) ఉద్యోగ రీత్య హైదరాబాద్‌కి షిఫ్ట్ కావడంతో ఆయనతోపాటు శివ(నాగార్జున) కూడా స్థానికంగా ఉన్న వీఏఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరతాడు. ఆ కాలేజీలో స్టూడెంట్ జేడీ(జేడీ చక్రవర్తి) గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతుంటాయి. సిటీలో పెద్ద గుండా అయిన భవానీ(రఘువరన్) అండ చూసుకుని రెచ్చిపోతుంటాడు. తనని ఎదురించిన వారిని భవానీ గ్యాంగ్‌తో కొట్టిస్తుంటాడు. దీంతో జేడీ గ్యాంగ్‌కి కాలేజీ ప్రిన్సిపల్‌తో సహా స్టూడెంట్స్ కూడా భయపడుతుంటారు. ఇది చూసిన శివ ఎదురించాలని ప్రయత్నించిన ఫ్రెండ్స్ (శుభ లేఖ సుధాకర్, రామ్ జగన్, జితేంద్ర) ఆపుతుంటారు. ఓ సారి ఆశా(అమల)ని జేడీ టచ్ చేస్తాడు. దీంతో అతనిపై తిరగబడతాడు శివ. చితక్కొడతాడు. ఈ విషయం భవానీ మనుషులకు జేడీ చెప్పడంతో ఆ గ్యాంగ్ దిగుతుంది. ముందు వార్నింగ్ ఇస్తారు. శివ వాళ్లకి తిరిగి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత శివ గ్యాంగ్‌ని కొట్టాలని ప్లాన్ చేస్తారు. రివర్స్ ఎటాక్ అవుతుంది. నడి సెంటర్‌లో భవానీ మనుషులను కొడతాడు శివ. దీంతో భవానీ ప్రభావం తగ్గిపోతుంది. ఈ విషయం భవానీకి తెలుస్తుంది. మొదట ఆయన శివతో కలవాలనుకుంటాడు. కానీ శివ రిజెక్ట్ చేయడంతోపాటు వార్నింగ్ ఇస్తాడు. దీంతో శివని లేపేయమని తన మనుషులకు చెబుతాడు భవానీ. ఆ తర్వాత భవానీని శివ ఎదుర్కోవడమే ఈ సినిమా కథ.
`శివ` మూవీ రీ రిలీజ్ ఎలా అనిపించింది ?
శివ సినిమా సక్సెస్ కి కారణం సౌండింగ్. ఈ సినిమాకి ఉపయోగించిన సౌండ్ గతంలో ఎప్పుడూ వాడలేదు. ఆ సౌండింగ్ స్టయిలే వేరు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా, రియలిస్టిక్‌గా పెట్టి, డైలాగ్ డెలివరీని హైలైట్ చేయడం, అంతేకాదు ఊరికే అరవడం కాకుండా నేచురల్‌గా డైలాగ్స్ రావడం, యాక్షన్ చేసినా వచ్చే సౌండ్ రియల్‌గా ఉండటం, కొన్ని చోట్ల ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా, సీన్లు, హవభావాలు, సైలెన్సే మాట్లాడటం ఇందులో స్పెషాలిటీ. ఇది అప్పట్లో తెలుగు సినిమాలోనే కొత్త. అది ఆడియెన్స్ కి మతిపోయేలా చేసింది. సౌండింగ్‌లో అదే మ్యాజిక్ ఇప్పటికీ వర్కౌట్ అయ్యేలా ఉండటం హైలైట్. మూవీని కొంత ట్రిమ్ చేశారు. అనవసరమైన ల్యాగ్ సీన్లని కట్ చేశారు. `ఎన్నియాలో`, `కిస్ మీ` పాటలను లేపేశారు. స్క్రీన్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. ఎక్కడా పాత సినిమా చూసిన ఫీలింగ్ రాలేదు. అదే సమయంలో సినిమాలోని ఇంటెన్సిటీలో ఏమాత్రం తేడా లేదు. తెరపై చూస్తున్నప్పుడు ఓ కొత్త మూవీనే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అప్పుడు థియేటర్లో ఈ చిత్రాన్ని చూడలేదు కాబట్టి. సినిమా ప్రారంభమైన కాసేపటికే మనం మూవీలోకి దూరిన ఫీలింగ్ కలిగింది. వాళ్ల పక్కన ఉండి ఇదంతా చూస్తున్నట్టుగా అనిపించింది. అదే ఈ సినిమాలో హైలైట్‌గా చెప్పొచ్చు. డైలాగ్ డెలివరీగానీ, యాక్షన్ గానీ చాలా నేచురల్‌గా ఉంది. అది ఎంతగా అంటే, హీరో వెంట విలన్లు పడుతుంటే, పరిగెత్తే సమయంలో హీరో ఫీలయ్యే ఆయాసం మనం ఫీలవుతున్నట్టుగా ఉండటం. ఆ టెన్షన్ ఆడియెన్స్ కి క్యారీ అయ్యేలా చేసింది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒక రోలర్ కోస్టర్‌లా సాగింది. అయితే ప్రారంభంలో కాస్త స్లోగా సాగినా, ఆ తర్వాత ఆ ఫీల్ మర్చిపోయేలా చేసింది. సినిమాలో ఇన్‌వాల్వ్ చేసింది. గతంలో ఈ చిత్రాన్ని చూసినా మళ్లీ కొత్తగా చూస్తున్నట్టుగానే ఉంది. సైకిల్ చైన్ తెంపడం, భవానీ మనుషులకు వార్నింగ్ ఇవ్వడం, భావనీ.. శివ శివ శివ అని అరవడం, పాప సెంటిమెంట్ ఇలా అన్నీ ఆడియెన్స్ ని ఎంగేజ్ చేశాయి. ఛేజింగ్ సీన్లు టెన్షన్‌కి గురిచేశాయి. ఓవరాల్‌గా `శివ` మరోసారి థియేటర్లో మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు రీ రిలీజ్ టైమ్‌లో అంతగా మెప్పించలేకపోతున్నాయి. కానీ శివ ఇప్పటి యూత్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లని సింగిల్ థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అయితే ఇది ఇప్పుడు ఎంత వరకు కమర్షియల్‌గా ఆడుతుందనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం.
`శివ`లో ఆర్టిస్టుల యాక్టింగ్ ఎలా ఉంది?
శివ పాత్రలో నాగార్జున జీవించారు. సినిమా ప్రారంభమైన కాసేపట్లోనే మనకు నాగ్ కనిపించడు, శివ పాత్రనే కనిపిస్తుంది. సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఆషాగా అమల చాలా ఈజ్‌తో, ఎనర్జిటిక్‌గా చేసింది. ఉన్నంతసేపు అందరి చూపు తనవైపే తిప్పుకుంది. శుభలేఖ సుధాకర్ ఇరగదీశాడు. జేడీ చక్రవర్తి అదరగొట్టాడు. ఇక రఘువరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చించేశాడు. ఆషా అన్నయ్య ఎస్‌ఐగా సాయిచంద్ సైతం మెప్పించాడు. భవానీ రైట్ హ్యాండ్ నానాజీగా తనికెళ్ల భరణి అదరగొట్టాడు. ఎమ్మెల్యేగా మాచిరాజుగా కోటశ్రీనివాసరావు కనిపించింది కాసేపే అయినా విలనిజంతో ఆకట్టుకున్నాడు. శివ అన్నయ్య శరత్‌గా మురళీ మోహన్ పాత్రకి యాప్ట్ గా నిలిచారు. మిగిలిన అందరు నటులు రియలిస్టిక్‌గా చేసి మెప్పించారు.
`శివ`లో టెక్నీషియన్లు పనితీర ఎలా ఉంది?
ఇది టెక్నీకల్‌గా బ్రిలియంట్ ఫిల్మ్. ఇళయరాజా పాటలు మరోసారి తెరపై మ్యాజిక్ చేశాయి. బొటనీ పాట ఇప్పటి ఆడియెన్స్ కూడా డాన్సులు వేసేలా ఉందని చెప్పొచ్చు. అలాగే ఆనందో బ్రహ్మా పాట సైతం ఉర్రూతలూగించింది. బీజీఎం ఇందులో హైలైట్‌గా నిలిచింది. సౌండ్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా చెప్పొచ్చు. ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా వర్క్ మరో అసెట్. పరిగెత్తే సీన్లని చూపించిన తీరు మాత్రం వాహ్ అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంది. సినిమాలోని ఇంటెన్సిటీని కెమెరా క్యాప్చర్ చేసిన తీరు హైలైట్‌గా చెప్పొచ్చు. వర్మ లేటెస్ట్ ఎడిటింగ్ కూడా అదిరిపోయింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడా రాజీపడలేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకిది తొలి సినిమానే అయినా, ఎక్కడా ఆ తేడా కనిపించదు. ఆయన టేకింగ్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే ఇలా ప్రతిది సూపర్‌గా కుదిరాయి. అయితే ఇందులో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. కానీ అదే ఈ మూవీ ప్రత్యేకత కావడం విశేషం. సినిమా హిట్ అయితే, జనాలకు నచ్చితే లాజిక్స్ ని ఎవరూ పట్టించుకోరు. ఈ మూవీ విషయంలో అదే జరిగింది.
ఫైనల్ నోట్
ఈ సినిమాని అప్పటి తరం ఆడియెన్స్ చూస్తే మరోసారి ఆ మెమోరీస్ ని గుర్తు చేసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి తరం సైతం థియేటర్లలో కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఫీలవుతారని మాత్రం చెప్పొచ్చు.