`షరతులు వర్తిస్తాయి` మూవీ రివ్యూ, రేటింగ్..
చైతన్య రావు హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తున్నాడు. తాజాగా `షరతులు వర్తిస్తాయి` అనే సినిమాతో వచ్చారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`30 వెడ్స్ 21` వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన చైతన్య రావు.. ఆ తర్వాత హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఓటీటీలో ఆయనకు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలతోనే మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన `షరతులు వర్తిస్తాయి` సినిమాతో వచ్చాడు. ఇందులో భూమి శెట్టి ఆయనకు జోడీగా నటించింది. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ స్టూడియోస్ పతాకంపై ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(మార్చి 15)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
చిరంజీవి (చైతన్య రావు) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఉద్యోగి. గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. ఆయనకు తండ్రి లేడు, అమ్మ, తమ్ముడు చెల్లి ఉన్నారు. కుటుంబ బాధ్యత, భారం మొత్తం తనపైనే ఉంటుంది. ఫ్యామిలీ, ఉద్యోగం, ఫ్రెండ్స్, లవర్ ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్‌ని స్మూత్‌గా డీల్ చేస్తుంటాడు. తనకు వచ్చిన శాలరీల్లో తమ్ముడు చెల్లి ఫీజులు, ఇంట్లో ఖర్చులకు వాడుతూ, మిగిలినది బ్యాంక్‌లో సేవ్ చేస్తుంటాడు. ఆయనకు విజయ(భూమిరెడ్డి) అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇంట్లో బాధ్యతల నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తుంటాడు చిరంజీవి. కానీ వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుంది. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొన్ని రోజులకే ఆఫీసు పనిమీద పది రోజులు ఫీల్డ్ వర్క్ కి వెళ్లాల్సి వస్తుంది. అప్పటికే వీరి కాలనీలో చైన్ సిస్టమ్ బిజినెస్ వస్తుంది. డబ్బులు కట్టి, తనతోపాటు నలుగురిని అందులో చేర్పిస్తే నాలుగు లక్షలు వస్తాయని నచ్చి చెప్పి ఊర్లో అందరి చేత డబ్బులు కట్టించుకుంటారు. దాన్ని బస్తీ పెద్ద శంకర అన్న కూడా ఎంకరేజ్ చేస్తాడు, జనాలకు తాను హామీ ఇస్తాడు. ముందు నుంచి చిరంజీవి ఈ ఈజీ మనీ బిజినెస్‌ని వ్యతిరేకిస్తుంటాడు. ఫ్రెండ్స్ ఎంత చెప్పినా అందులో జాయిన్ అయ్యేందుకు నిరాకరిస్తాడు. ఇక చిరంజీవి ఫీల్డ్ వర్క్ కి వెళ్లడంతో అతను సేవ్ చేసిన డబ్బులను భార్య, అమ్మ కలిసి ఈ బిజినెస్‌లో పెడతారు. తీరా వాడు కంపెనీ బోర్డ్ తిప్పేసి పారిపోతారు. ఈ విషయంలో తెలిసి అమ్మ, భార్య ఆసుపత్రి పాలవుతారు. మరి వారిని ఎలా సేవ్ చేసుకున్నాడు. ఈ మోసం వెనుకున్న వ్యక్తి ఎవరు? జనాన్ని మోసం చేసిన వారి గుట్టు ఎలా రట్టు చేశాడు?. ఈ క్రమంలో చిరంజీవి వేసిన స్కెచ్ ఏంటి? అనేది సినిమా మిగిలిన కథ.
విశ్లేషణః
మిడిల్ క్లాస్ జీవితాలను ఆవిష్కరించిన మూవీ `షరతులు వర్తిస్తాయి`. మెయిన్‌గా చైన్ సిస్టమ్ బిజినెస్ ల వల్ల జరిగే మోసాలను ఈ మూవీలో కళ్లకి కట్టినట్టు చూపించారు. ఈజీ మనీ ఆశ చూపి జనాలను ఎలా మోసం చేస్తారు, దీని వల్ల ఆయా ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతాయనేది ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. లైటర్ వేలోనూ మంచి సందేశాన్ని అందించేలా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇలాంటి బిజినెస్‌లు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అవి రన్ అవుతున్నాయి. వీటి వల్ల లాభం పొందిన వాళ్లు ఉన్నారు, నష్టపోయిన వాళ్లూ ఉన్నారు. కొందరికి లక్, మరికొందరికి తీరని నష్టం. ఎప్పుడు బోర్డ్ తిప్పేస్తారో తెలియదు. కానీ జనం ఇలాంటి వాటికే త్వరగా ఎట్రాక్ట్ అవుతారనేది ఈ సినిమా ద్వారా మేకర్స్ చెప్పారు. అయితే దాన్ని లైటర్ వేలో చెప్పారు. కమర్షియల్ హంగులతో చెబితే ఇంకా బాగుండేది.
ఫస్టాఫ్ మొత్తం మిడిల్ క్లాస్‌లో ఉండే పరిస్థితులు, వారి లైఫ్ ఎలా సాగుతుంది. రోజూ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఇంట్లో ముచ్చట్లు ఎలా ఉంటాయి అనేది చూపించారు. అదే సమయంలో నిజాయితీతో కూడిన ప్రేమలను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ తో, అమ్మతో ముచ్చట్లు, లవర్‌తో మాటలను ఫన్నీగా చూపించాడు. సినిమాని ఫన్నీగా నడిపించాడు. ఇక పెళ్లైన తర్వాత అత్తా కోడళ్ల పంచాయితీలను కామెడీగా చూపించారు. దీని వల్ల హీరో ఇబ్బంది పడటం, అటు అమ్మని, ఇటు భార్యని సముదాయించుకోవడం వంటి సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. నవ్వించేలా ఉంటాయి. ఇక అప్పుడే చైన్ సిస్టమ్ బిజినెస్ అంశాన్ని యాడ్ చేస్తూ కథని అటువైపు టర్న్ తిప్పారు. ఈజీ మార్కెటింగ్ బిజినెస్ మోసం చేయడంతో హీరో భార్య మదనపడుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రూపాయి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకుంటారు. దాన్ని ఏదైనా బిజినెస్‌లోనే ఏదైనా ఆస్తులు కొనడానికో వాడతారు. కానీ అలాంటి డబ్బు మోసానికి గురైతే ఆ బాధలను ఎంత దారుణంగా ఉంటాయనేది ఇందులో కళ్లకి కట్టుగా ఆవిష్కరించాడు దర్శకుడు.
సినిమా మొత్తం రియాలిటీగా సాగుతుంది. ప్రత్యక్షంగా ఆయా సంఘటనలను మనమే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నటీనటులు అంతే బాగా యాక్ట్ చేయగా, దర్శకుడు అంతే సహజంగా వెండితెరపై ఆవిష్కరించడం విశేషం. కానీ సినిమా మొత్తం చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది. ఎక్కడ హై మూమెంట్లు, ఎక్కడా లో మూమెంట్లు ఉండవు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్లు లేవు. పాటలు, హిలేరియస్ కామెడీ లేదు. యాక్షన్ లేదు. గ్లామర్ లేదు. చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంది. హడావుడి లేదు. అదే కొంత సినిమాకి మైనస్‌గా మారింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్ బాగుంటుంది, కానీ థియేటర్ అన్నప్పుడు కమర్షియల్ హంగులను ఆడియెన్స్ ఆశిస్తారు. ఆ విషయంలో లోటైతే ఉంటుంది. ఇంకా ఫన్ డోస్ పెంచాల్సింది. హిలేరియస్‌గా నవ్వుకుని, ఆ తర్వాత సందేశాన్ని ఫీల్ అయ్యేలా ఉండేది. అదే సమయంలో హీరో తన అమ్మకి, భార్యకి, ఫ్రెండ్స్ కి, ఆఫీస్‌లో వాళ్ల సర్‌తోనూ పదే పదే హితబోధ చెప్పినట్టుగా మాట్లాడటం కూడా కాస్త ఓవర్‌గా అనిపించింది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సినిమా థియేట్రికల్‌గానూ మంచి ఫలితాన్ని చూసేది.
నటీనటులుః
చైతన్యరావు చిరంజీవి పాత్రలో బాగా చేశాడు. ఎక్కడ హీరో అనే భావన కలగదు. కానీ తన పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. అతను మిడిల్ క్లాస్ వ్యక్తిగా బాగా సూట్ అయ్యాడు. అలానే నటించాడు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలో జీవించేశాడు. ఆయన భార్య పాత్రలో భూమి రెడ్డి కూడా బాగా సెట్ అయ్యింది. అంతే సహజంగా చేసింది. అమ్మ పాత్రలో నటించిన ఆర్టిస్ట్ బాగా చేసింది. అలాగే ఆఫీసర్‌గా నందకిషోర్ బాగా సెట్ అయ్యాడు. ఉన్నంతలో బాగా చేశాడు. శంకరన్న పాత్రలో సంతోష్ యాదవ్ మెప్పించాడు. పాత్రలో ఒడిగిపోయాడు. హీరో ఫ్రెండ్స్ గా వెంకీ మంకీ, శివ కళ్యాణ్, మల్లేష్ బలాస్త్ ఫర్వాలేదు.అలాగే పద్మావతి, సీతామహాలక్ష్మి, తీన్ మార్ చంద్రవ్వ, సుజాత, అశోక్ కుమార్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి అరుణ్ చిలువేరు, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఫర్వాలేదు. ప్రిన్స్ హెన్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. కానీ సీన్లని ఎలివేట్ చేసేంతగా లేదు. మ్యూజిక్‌గానీ, బీజీఎం గానీ డీసెంట్‌గానే ఉంది. ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి కెమెరా వర్క్ బాగుంది. సినిమాకి రిచ్ లుక్ తేవడంలో వీరి కెమెరా పనితనం ఎంతగానో ఉంది. సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఇంకా బెటల్‌గా ఉండాల్సింది. సినిమాని వేగంగా నడిపించే ఉంటే బాగుండేది. పెద్దింటి అశోక్ కుమార్ డైలాగ్స్ మాత్రం సహజంగా మధ్యతరగతి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దర్శకుడు అక్షర చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రెయిట్‌గా చెప్పారు. ఎక్కడా ట్రాక్ తప్పకుండా తీసుకెళ్లాడు. కానీ దాన్ని కమర్షియల్ వేలో, మరింత ఫన్ వేలో చెబితే మరింత బాగుండేది. కానీ సహజంగా తీసిన తీరు, సహజంగా సినిమాని నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. మిడిల్ క్లాస్ ఆడియెన్స్ తమ జీవితాన్ని చూసినట్టుగానే ఉంటుంది.
ఫైనల్‌గాః `షరతులు వర్తిస్తాయి` చైన్ సిస్టమ్ బిజినెస్‌కి సంబంధించి మంచి సందేశాన్నిచ్చే చిత్రం. మిడిల్ క్లాస్ జీవితాలకు ప్రతిబింబం.
రేటింగ్‌ః 2.5
నటీనటులుః చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ - పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ - శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం - కుమారస్వామి (అక్షర)