`సత్యభామ` మూవీ రివ్యూ, రేటింగ్..
కాజల్ అగర్వాల్ కమర్షియల్ సినిమాల నుంచి టర్న్ తీసుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీ `సత్యభామ`తో వస్తుంది. ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
తెలుగు తెర అందాల చందమామగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ చందమామ అనే ట్యాగ్‌ని క్యారీ చేస్తూనే ఉంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని కుమారుడికి జన్మనిచ్చింది. ఓ వైపు ఫ్యామిలీని లీడ్ చేస్తూనే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది కాజల్. డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ వెళ్తుంది. అందులో భాగంగా తెలుగులో మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ `సత్యభామ` చేసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ మూవీ తెరకెక్కింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే మూవీ రూపొందింది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్ 7)న విడుదలైంది. మరి లేడీ ఓరియెంటెడ్ మూవీతో కాజల్ తొలి ప్రయత్నం ఫలించిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
సత్యభామ(కాజల్) షీ టీమ్ డిపార్ట్ మెంట్ ఏసీపీగా పనిచేస్తుంటుంది. ఆమె అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే టీమ్‌ని కనిపెట్టి అరెస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్నప్పుడు అమ్మాయిలు షీ టీమ్‌కి సంబంధించిన యాప్‌ని ఎలా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పిస్తుంటుంది. అది చూసిన హసీనా సత్యభామని కలిసి తన సమస్యని చెబుతుంది. ఆమె తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్) చేత చిత్ర హింసలకు గురవుతుంది. దీంతో ఆమెని కాపాడతానని మాటిస్తుంది సత్యభామ. యాదుకి ఫోన్‌లో వార్నింగ్ ఇస్తుంది. దీంతో డ్రగ్స్ తీసుకున్న అతను ఆ రాత్రి హసీనాని చంపేస్తాడు. అతన్ని పట్టుకునే సమయంలో షూట్ చేసినందుకు సత్యభామని ఆ విభాగం నుంచి తప్పిస్తారు పై అధికారులు. కానీ హసీనా చనిపోయే ముందు తన తమ్ముడు ఇక్బల్(ప్రజ్వల్ యాద్మ)ని చూసుకోవాలని చెబుతుంది. ఆమెకిచ్చిన మాటకోసం, తనని చంపిన యాదుని ఎలాగైనా పట్టుకోవాలని వృత్తికి మించి పనిచేస్తుంది.పై అధికారులు అడ్డు వచ్చినా లెక్క చేయకుండా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో కొన్ని రోజులకు హసీనా తమ్ముడు ఇక్బాల్ మిస్ అవుతాడు. అతన్ని వెతికే క్రమంలో రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉంటుందని తెలిసింది. అతను ఎంపీ కొడుకు. అతన్ని పట్టుకుని ఆరా తీసే క్రమంలో ఇక్బల్ టెర్రరిస్ట్ గా మారాడని, తెలుస్తుంది. అంతేకాదు విజయ్, నేహా అనే మరో ఇద్దరు వ్యక్తులు ఇందులో భాగమైనట్టు, వాళ్లు టెర్రరిస్ట్ లు అని తెలుస్తుంది. మరోవైపు విజయ్ అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు అమ్మేస్తుంటాడు(ఉమెన్ ట్రాఫికింగ్). ఈ విచారణలో అనేక కొత్త విషయాలు బయటకు వస్తుంటాయి. మరి ఇంతకి యాదు దొరికాడా? ఇక్బల్ నిజంగానే టెర్రరిస్ట్ గా మారాడా? అతని గతం ఏంటి? విజయ్, నేహాలు ఎవరు? హసీనా కేసు విచారణలో బయటపడ్డ అనేక కొత్త విషయాలేంటి? హసీనా మరణంలో ఉన్న షాకిచ్చే విషయం ఏంటి? అమర్(నవీన్ చంద్ర)తో సత్యభామకి ఉన్న రిలేషన్ ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ మర్దర్ జరగడం, లేదా వరుసగా మర్దర్లు జరగడం, ఆ నేరస్థుడికి ఒక మోటో ఉండటం, ఓ బలమైన కారణంతో హంతకుడిగా మారడం చూస్తుంటాడు. దాన్ని పోలీసులు ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లతో చేధించారనేది, ఎంతటి ఉత్కంఠంగా సినిమా సాగిందనేది ఉంటుంది. కానీ `సత్యభామ` ఆ పరంగా చూస్తే ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫార్మూలాకి పూర్తిభిన్నమైన స్క్రీన్‌ప్లేతో సాగే చిత్రం. కథ చిన్నదే అయినా, దాన్ని అనేక మలుపులు తిప్పుతూ, అనేక కొత్త పాత్రలను పరిచయం చేస్తూ కొత్త విషయాలను టచ్ చేస్తూ సాగుతుంది. అనేక విషయాలను ఈ మూవీ చర్చిస్తుంది. షీ టీమ్ ప్రాధాన్యతని తెలియజేస్తుంది. అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెబుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో భిన్నమైన అంశాలను తెలియజేస్తుంది. అటు మహిళల్లో సామాజిక అవగాహన కల్పిస్తుంది. మరోవైపు సందేశం ఇచ్చినట్టు కాకుండా చాలా కథలో భాగంగా అలా ఆ అంశాన్ని టచ్ చేస్తూ కమర్షియల్ వేలో, అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ వేలో ఈ మూవీని నడిపించారు. అందుకే ఇది స్క్రీన్ ప్లే పరంగా ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది.
సినిమా ప్రారంభం నుంచే డైరెక్ట్ కథలోకి వెళ్లాడు దర్శకుడు. కాజల్ పాత్రని పరిచయం చేశాడు. ఆమె ఎంతటి పవర్‌ఫుల్ ఆఫీసర్ ఒక్కసీన్‌లో చెప్పేశాడు. హసీనా హత్య చేసిన యాదుని వెతికే క్రమంలో ప్రారంభంలో కొంతస్లోగా సాగినట్టుగా అనిపించినా, ఆ తర్వాత స్పీడ్ అందుకుంటుంది. గ్రిప్పింగ్ గా కథనాన్ని నడిపించారు. దీంతో ఎక్కడా బోర్ కొట్టదు. ఆడియెన్స్ సినిమాతో ట్రావెల్ అవుతుంటారు. ఇన్వెస్టిగేషన్‌లో పెద్దగా పురోగతి లేకపోతే ఆడియెన్స్ బోర్ ఫీలవుతారు. కానీ ఇందులో ఆడియెన్స్ దృష్టి పక్కకి వెళ్లకుండా ఎంగేజ్ చేసేలా కథనాన్ని డిజైన్ చేసుకోవడం పెద్ద అసెట్. దీనికి కారణం సినిమాలో ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇవ్వడం, హసీనా పాత్రలో తమ్ముడిపై ఉన్న బాధ్యతని, ప్రియుడి వల్ల పడ్డ బాధని కాజల్ పాత్ర ద్వారా చూపిస్తూ ఎమోషనల్‌గా సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేశారు. సినిమా మొత్తం ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. సెకండాఫ్ మరింత షార్ప్ గా ఉంది. ఎమోషన్స్ తోపాటు యాక్షన్ సీన్లతోనూ టైట్ గా నడిపించారు. ఫైట్ సీన్లలో కాజల్ అదరగొట్టింది. అది కూడా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయడమే కాదు ఈలలు వేసేలా ఉంటుంది. సెకండాఫ్ లో కాస్త ఇంటలిజెంట్‌గా కథనాన్ని నడిపించేప్రయత్నం చేసి, కొంత వరకు ఓకే అనిపించుకున్నారు. మరోవైపు కాజల్, నవీన్ చంద్రల మధ్య సీన్లలో ఫన్ యాడ్ చేసి సీరియస్ నెస్ నుంచి రిలీఫ్‌నిచ్చేలా చేశారు.
`సత్యభామ` స్క్రీన్ ప్లే పరంగా కాస్త కొత్తగా, మరికొంత ఇంటలిజెంట్ ప్రయత్నం ఉన్నా, కథనాన్ని నడిపించే విషయంలో దర్శకుడు కన్‌ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్బల్ పాత్రకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, అతని పాత్రలో బలమైన కారణాలను చూపించకపోవడంతో డ్రామా ఓవర్ అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. మరోవైపు ఇన్వెస్టిగేషన్ కొత్తగా ఉన్నా, కన్‌ఫ్యూజన్ ఎక్కువైంది. చాలాపాత్రని కథలోకి తీసుకురావడంతో కథన అనేక మలుపులు తిరిగి కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఇక్బాల్ పాత్రలోనూ క్లారిటీ లేదు. అతనిప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కన్విన్సింగ్‌గా లేదు. దివ్యతో అతని రిలేషన్ విసయంలోనూ క్లారిటీ మిస్ అయ్యింది. రిషి పాత్రని ఎందుకు లాగారో అర్థం కాదు, దీనికితోడు హర్షవర్థన్ పాత్ర సెటప్‌కి సంబంధించిన సీన్లు కూడా కథని డైవర్ట్ చేసేలా ఉన్నాయి. యాదు పాత్రని ముగింపులోనూ నాటకీయత మిస్ అయ్యింది. సినిమాకి టెర్రరిస్ట్ ల లింక్ కూడా నప్పలేదు. టూ మచ్ పాత్రలు, ఆయా కథలను చూపించడంతో సినిమా కన్ ఫ్యూజ్ క్రియేట్ అయ్యింది. అయితే చివర్లో అన్నింటిని లింక్ లు చూపించాలనుకున్నా, అందోలనూ క్లారిటీ మిస్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్‌లోనూ కొత్తదనం లేదు, ఎత్తులు పై ఎత్తులు రేసీగా లేవు, పైగా డల్గానే అనిపిస్తుంది. కథ కూడా బలంగా రాసుకుంటే బాగుండేది. అయితే క్లైమాక్స్ ని మాత్రం మరింత ఎమోషనల్‌గా మార్చేశారు. అది ఆద్యంతం ఆకట్టుకుంది.
నటీనటులుః
సత్యభామగా కాజల్ అదరగొట్టింది. యాక్షన్‌తోనూ నటనతోనూ మెప్పించింది. తనలోని కొత్త యాంగిల్ని చూపించింది.ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీగా మెరిసిన కాజల్ యాక్షన్ కూడా చేస్తుందని, చేసి మెప్పించగలదని నిరూపించింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టింది. యాక్షన్‌లో తనలోని మరో యాంగిల్ చూపించింది. గ్లామర్ బ్యూటీ యాక్షన్‌లో ఎలా మెప్పిస్తుందనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ ఈ మూవీతో ఆ డౌట్స్ క్లీయర్ చేసింది కాజల్. ఇలాంటి సినిమాలకు బాగా సెట్ అవుతుందని నిరూపించింది. నవీనచంద్ర.. కాజల్ ప్రియుడిగా, భర్తగా, రైటర్‌గా సెటిల్డ్ గా చేశారు. ఇక్బల్‌గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. కొత్త కుర్రాడైనా అదరగొట్టాడు. పోలీస్ ఆఫీసర్లుగా ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్ అదరగొట్టారు. వీరితోపాటు రిషి పాత్రలో అంకిత్, యాదు పాత్రలో అనిరుథ్ పవిత్రన్, దివ్యగా సంపద, సత్య ప్రదీప్తి వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి మ్యూజిక్ పెద్ద అసెట్. పాటలు చాలా బాగున్నాయి. బీజీఎం సినిమాకి పెద్ద ప్లస్. అదే సినిమాని ఎంగేజ్ చేస్తే నడిచేలా చేసింది. కొత్తగానూ ఉంది. కాజల్ సీన్లని ఎలివేట్ చేయడంలోనూ బీజీఎం బాగుంది. మెలోడీ, బ్యాక్ గ్రౌండ్స్ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. బి విష్ణు కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే బాగుంది. అయితే టూ మచ్ సబ్ క్యారెక్టర్స్, వారి స్టోరీస్ అసలు విషయాన్ని ట్రాక్ తప్పేలా చేశాయి. కన్ ఫ్యూజ్ క్రియేట్ చేశాయి. సినిమాని పక్కదారి పట్టించేలా అనిపించింది. కానీ చాలా వరకు బ్రిలియన్స్ గా ఉంది. ఒక్కో పాత్రని లింక్ చేసిన తీరు బాగున్నా, ఇంకా బెటర్‌గా చేయాల్సింది. దర్శకుడు సుమన్ చిక్కాల ఓ కొత్త తరహాలో ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా మార్చేశాడు. సినిమాని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్‌గాః `సత్యభామ` కాజల్ లోని కొత్త కోణం ఆవిష్కరించిన మూవీ. ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌లకు సంబంధించిన డిఫరెంట్ ప్రయత్నం.
రేటింగ్‌ః 2.75
నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులు.
టెక్నికల్ టీమ్
బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ - బాలాజీ
సినిమాటోగ్రఫీ - బి విష్ణు
సీఈవో - కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
దర్శకత్వం: సుమన్ చిక్కాల