- Home
- Entertainment
- Movie Reviews
- సర్దార్ పాపారాయుడు సినిమా రివ్యూ, కృష్ణ మీద పగ తీర్చుకున్న ఎన్టీఆర్, మనవరాలిగా నటించిన శ్రీదేవితో డ్యూయెట్లు
సర్దార్ పాపారాయుడు సినిమా రివ్యూ, కృష్ణ మీద పగ తీర్చుకున్న ఎన్టీఆర్, మనవరాలిగా నటించిన శ్రీదేవితో డ్యూయెట్లు
సీనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో చేయని ప్రయోగం లేదు. ఎన్నో రకాల పాత్రలకు ఆయన ప్రాణం పోశాడు. ఎన్టీఆర్ అంటే అందరికి మైథలాజికల్ పాత్రలే గుర్తుకు వస్తాయి. కానీ సర్దార్ పాపారాయుడు లాంటి అద్భుతమైన సాంఘిక చిత్రాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.

సర్దార్ పాపారాయుడు సినిమాకు 45 ఏళ్లు
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన లో అద్భుతమైన సినిమాలెన్నో వచ్చాయి. అందులో ఆణిముత్యం లాంటి సినిమా సర్దార్ పాపారాయుడు. పవర్ ఫుల్ డైలాగులు, మనసుదోచుకునే పాటలు, ఎన్టీఆర్ నటన, శ్రీదేవి గ్లామర్.. అన్ని కలిసి ఈ సినిమాని ఎక్కడికో తీసుకుపోయాయి. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో క్రాంతి కుమార్ నిర్మించిన ఈసినిమాలో ఎన్‌టి రామారావు తో పాటుగా శ్రీ దేవి, శారద, కైకాల సత్యనారాయణ, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, మోహన్ బాబు, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, పండరీబాయి లాంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. దాదాపు 45 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సర్ధార్ పాపారాయుడు సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
సర్దార్ పాపారాయుడు సినిమా కథలోకి వెళితే..
సర్ధార్ పాపారాయుడు సినిమా కథ అంతా బ్రీటీష్ కాలంలో కొనసాగుతుంది. ఒక నిజాయితీగల పోలీసు అధికారి రాము (ఎన్‌టి రామారావు), విజయ (శ్రీదేవి) ప్రేమించుకుంటారు. విజయ తండ్రి ధర్మరాజు (రావు గోపాలరావు) అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు.కానీ అతను బయటకు పెద్దమనిషిలా నటిస్తూ.. గుట్టు చప్పుడు కాకుండాచేయాల్సిన దుర్మార్గాలు అన్నీ చేస్తుంటాడు. ఆయనతో పాటు సత్యమూర్తి ( కైకాల సత్యనారాయణ), న్యాయపతి (అల్లు రామలింగయ్య) అనే మరో ఇద్దరు విలన్లు కూడా ఉంటారు. వీరు బ్రిటిష్ వారితో చేతులు కలిపి పేద ప్రజలను హింసిస్తూ.. వారిని దోచుకుంటారు. అయితే ధర్మరాజు తన కూతురు ప్రేమిస్తున్న రామును ఒక సారి చూస్తాడు. అతనికి వెంటనే ప్లాష్ బ్యాక్ గుర్తకు వస్తుంది. రాము తండ్రి సర్ధార్ పాపారాయుడు( ఎన్టీరామారావు) గుర్తుకు వస్తాడు. గతంలో ధర్మరాజు, సత్యమూర్తి, న్యాయపతి ఈ ముగ్గురు విలన్లు కలిసి.. అండమాన్ దీవులలో విజయరాఘవరాజు (ప్రభాకరరెడ్డి) అనే రాజును చంపి.. నీతి, నిజాయితీలతో బ్రతికే పెద్దమనిషి, స్వాతంత్ర్య సమరయోధుడూ అయిన సర్దార్ పాపారాయుడు పై ఆ నేరాన్ని మోపుతారు. దాంతో సర్దార్ పాపారాయుడికి జీవిత ఖైదు పడుతుంది. ఇక రాము కూడా తన తండ్రిలాగే ఉండటంతో.. అతన్ని చూసిన ధర్మరాజు షాక్ అవుతాడు. రాము తల్లి సీత (శారద) ను కూడా చూస్తాడు విలన్. వారిని చూసినప్పటి నుంచి ధర్మరాజుకు నిద్ర ఉండదు. ఈక్రమంలో సర్దార్ పాపారాయుడు జైలు నుండి విడుదలవుతాడు. తన జీవితం నాశనం చేసిన విలన్ల భరతం పడుతుంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న పాపారాయుడిని, అతని కొడుకు రాము అడ్డుకుంటాడు. దాంతో వీరి మధ్య విభేదాలు మొదలవుతాయి. చివరికి కథ ఏమౌతుంది. సర్ధార్ పాపారాయుడి పగతీరిందా..? తండ్రీ కొడుకులు ఒకటవుతారా.. లేదా? అనేది క్లైమాక్స్.
సర్దార్ పాపారాయుడు సినిమా రివ్యూ
సర్దార్ పాపారాయుడు సినిమా అప్పటి యువతను ఉర్రూతలూగించింది. 1980 లో రిలీజ్ అయిన ఈమూవీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా ఈసినిమాలో పాటలు, డైలాగ్స్ కు యూత్ పూనకాలతో ఊగిపోయారు. సర్దార్ పాపారాయుడు గా ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్టింగ్ ఆడియన్స్ ను కదలనీయకుండా చేస్తుంది. ఇటు రాము పాత్రలో శ్రీదేవితో పెద్దాయన చేసిన రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఒక వైపు రాము పాత్రలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే.. మరో వైపు పాపారాయుడిగా అదరగొట్టాడు ఎన్టీఆర్. సినిమా ఓపెనింగ్ నుంచి రాము పాత్రతో కూల్ అయిన జనాలను.. ఆతరువాత చిన్నగా పాపారాయుడి పాత్ర వైపు మళ్లించి..సినిమాలో సీరియస్ నెస్ ను తీసుకువచ్చాడు దర్శకుడు. అయితే ఈరెండు విషయాల్లో ఎన్టీఆర్ కామన్ గా కనిపించేలా.. ఆయనతో ద్విపాత్రాభినయం చేయించాడు దాసరి. సినిమాకు డైలాగ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. బ్రిటీష్ అధికారి పాత్రలో మోహన్ బాబుతో పప్పా..రాయుడు అని ఫన్నీగా పలికించాడు దాసరి. పాపారాయుడిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అన్నీ థియేటర్లలో విజిల్స్ వేయించాయి. బ్రిటీష్ వారు చేసిన అన్యాయాలు, వారికి తొత్తులుగా మారినవారి విలనిజాన్ని కూడా కళ్లకు కట్టినట్టు గా చూపించారు. ఒక వైపు దేశ భక్తి, మరో వైపు పగ, తల్లి ప్రేమ, ప్రియురాలి ప్రేమ, తండ్రీ కొడుకుల మధ్య భేదాభిప్రాయాలు, బ్రిటీష్ వారి అరాచకాల చుట్టు ఈసినిమా తిరుగుతుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈనిమాను అందరికి అర్ధం అయ్యేలా తెరకెక్కించారు దాసరి. మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకులుగా నటించిన ఎన్టీఆర్ ఎదురుపడినప్పుడు కొడుకు రామ్మోహన్ తో పాపారాయుడు పలికే ‘పిచ్చివాడా.. నా వయసంత లేదు నీ అనుభవం’ అనే డైలాగ్ విపరీతంగా పాపులర్ అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే..
సర్దార్ పాపారాయుడు సినిమాలో అన్ని పాత్రలు వారికోసమే అన్నట్టుగా ఉంటాయి. పాపారాయుడు, రాము పాత్రల్లో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలు మాత్రమే కాదు... ఇలాంటివి కూడా అలవోకగా చేయగలరు అని నిరూపించారు. ఎన్టీఆర్ ఏదైనాచేయాలి అని సంకల్పిస్తే.. అది ఎంత కష్టమైనా ఖచ్చితంగా చేసి తీరుతారు. అలా ఛాలెంజ్ గా తీసుకునిచేసిన సినిమాలెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో సర్ధార్ పాపారాయుడు కూడా ఒకటి. ఇక ఎన్టీఆర్ భార్యగా, యంగ్ ఎన్టీఆర్ తల్లిగా శారద అద్భుతంగా నటించారు. ఇక ఈసినిమాకు మెయిన్ హీరోయిన్ శ్రీదేవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ తో గతంలో సినిమాలు చేసి ఉండటంతో.. ఆయన పాత్రకు తగ్గట్టుగా శ్రీదేవి అభినయం అంద్బుతం. ముఖ్యంగా డ్యూయోట్ సాంగ్స్ లో శ్రీదేవి నటన, ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టాయని చెప్పవచ్చు. గ్లామర్ పార్ట్ గా మాత్రమే కాకుండా.. సినిమా కథలో ఎన్నో ట్విస్ట్ లకు శ్రీదేవి కారణం అవుతుంది. అయితే గతంలో మనవరాలిగా నటించిన శ్రీదేవితో ఎన్టీఆర్ డ్యూయోట్లు, రొమాన్స్ పై విమర్శలు వచ్చినా.. పెద్దాయన ఆ విషయాలను పెద్దగాపట్టించుకోలేదు. ఇక ఈమూవీలో మరో ఇంట్రెస్టింగ్ పాత్ర మోహన్ బాబుది. బ్రిటీష్ అధికారిగా అతని నటన నిజంగా అద్భుతం అని చెప్పాలి. మోహన్ బాబు డైలాగ్ చెపితే బాగుంటుంది అంటారు. అయితే ఇందులో వచ్చీ రాని తెలుగులో అతను చెప్పిన డైలాగ్స్ ఆపుకోలేనంత నవ్వు తెప్పిస్తాయి. ప్రతీ పదాన్ని సాగదిస్తూ.. దానికి ఎక్స్ ప్రెషన్స్ ను యాడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ పాత్రలో మోహన్ బాబు ఎంత కష్టపడ్డాడు అనేది చూసేవారికి అర్ధం అవుతుంది. ఇక విలనిజం పండించడంలో రావుగోపాలరావు, కైకాల సత్యనారయణను కొట్టేవారు ఎవరుంటారు.. ఎప్పటిలాగానే విలన్లుగా వారు అద్భుతం చేశారు. ఇక కామెడీ విలన్ గా అల్లు రామలింగయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సినిమాలో పాటలన్నీ అద్భుతాలే..
సినిమాను అద్భుతంగా మలిచారు దర్శకరత్న దాసరి. యువతకు కావలసిన దేశ భక్తి.. ప్రేమ అంశాల కలబోతతో సినిమాను విజయం వైపు నడిపించారు. ఈసినిమాలో దాసరి రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు ఆయన రాసిన పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. దాసరి తరువాత ఈసినిమా విజయానికి చక్రవర్తి సంగీతం కూడా కారణం అయ్యింది. ఈసినిమాలో పెట్టిన జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. చీరకే సిగ్గేసింది పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాుద. అప్పట్లో ఏ హోటల్ నుంచి అయినా, ఏ వేడుక నుంచి అయినా ఈ పాటే వినిపించేది. అంతలా ప్రభావం చూపించాయి పాటలు. ఇక వెంకటరత్నం కెమెరా.. ఎస్పీ బాలు, సుశీల పాటలు..సినిమాకు ప్లాస్ అయ్యాయి. నిర్మాణం విషయంలో ఏమాత్రం తగ్గలేదు క్రాంతి కుమార్. అప్పట్లోనే ఊటీలోని తమిళం గార్డెన్స్, సామియార్ మఠం, మైసూర్ రోడ్, పైకారా డామ్, బోట్ క్లబ్, బొటానికల్ గార్డెన్ లాంటి ప్రాంతాలలో ఈసినిమా షూటింగ్ జరిగింది.
కృష్ణపై పంతం నెగ్గించుకున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ చేయని పాత్ర లేదు.. అలాగే అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో.. ఆ సినిమా వర్కౌట్ అవ్వదు అని ఆపేశారు. ఈలోపు కృష్ణ అల్లూరిగా సినిమా చేశారు. అప్పుడు కృష్ణను పిలిచి ఎన్టీఆర్ ఆ పాత్ర చేయోద్దు అని అన్నారట. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాల విషయం తెలిసిందే. ఆతరువాత కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఆపాత్ర ఎన్టీఆర్ మళ్ళీ చేయాలని అనుకోలేదు. సినిమా అద్భుతంగా ఉందని కృష్ణను మెచ్చుకున్నారు కూడా. అయితే అల్లూరిగా నటించాలి, ఆ పాత్రలో కనిపనించాలి అన్న ఆశ మాత్రం ఎన్టీఆర్ లో పోలేదు. దాంతో సర్ధార్ పాపారాయుడు సినిమాలో ఓ సీన్ లో ప్రత్యేకంగా అల్లూరి పాత్రలో కనిపించి, తన కోరిక తీర్చుకున్నారు ఎన్టీఆర్. అల్లూరి పాత్రలో నేను కూడా అద్భుతంగా చేయగలను అని కృష్ణకు తెలిసేలా చేశారని అప్పట్లో కొంత మంది అభిప్రాయ పడినట్టు సమాచారం. ఈరకంగా తన పంతం నెగ్గించుకున్నారు ఎన్టీఆర్. ఆతరువాత కాలంలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా అల్లూరిగా కనిపించారు పెద్దాయ.
సర్ధార్ పాపారాయుడు సినిమా విశేషాలు
1980 జూన్ లో పాట రికార్డింతో ఈసినిమా పనులు స్టార్ట్ అయ్యాయి. నిర్మాతగా క్రాంతికుమార్ కు ఎన్టీఆర్ తో ఇదే మొదటి సినిమా. ఆయన దర్శకుడిగా అద్భుతాలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన శ్రీ అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై సినిమాలు తీసిన క్రాంతి కుమార్.. ఈసినిమాతో శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్ ను స్టార్ట్ చేశారు.
ఇక 1980 జులై 1న ఈసినిమా షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. తల్లీ కొడుకులుగా శారద, ఎన్టీఆర్ పై ఫస్ట్ సీన్ ను షూట్ చేశారు దాసరి.సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన చేతి మనికట్టు విరిగిపోవడంతో షూటింగ్ కు కొంత కాలం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
సర్ధార్ పాపారాయుడు సినిమా 1980 అక్టోబర్ 30న రిలీజ్ అయ్యింది. మొదటి ఆటతోనే ఈమూవీ సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర జన ప్రభంజనం కనిపించింది. అంతే కాదు హైదరాబాద్, విజయవాడల్లోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా 300 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా 100 రోజులు వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణ రోడ్డులో గల మ్యూజిక్ అకాడమీలో 1981 ఫిబ్రవరి 15న సర్దార్ పాపారాయుడు శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సినిమాను 1985లో 'సర్ఫరోష్' పేరుతో హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేశారు. అక్కడ కూడా మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా సర్దార్ పాపారయుడు సినిమా 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసినిమా ఇప్పటి ప్రేక్షకులకు కూడా బాగా కెనెక్ట్ అవుతుంది. సర్దార్ పాపారాయుడు సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.