`సారంగదరియా` మూవీ రివ్యూ, రేటింగ్
నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `సారంగదరియా`. పండు దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
రాజా రవీంద్ర చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాల్లో కీలక పాత్రలతో మెప్పించేవారు. ఇప్పుడు ఆయన `సారంగదరియా` సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇందులో మోయిన్ మొహ్మద్, మోహిత్ పేడాడ, యశస్విని ముఖ్య పాత్రలు పోషించారు. పద్మారావు అబ్బిశెట్టి(పండు) దర్శకుడిగా పరిచయం అవుతూ `సారంగదరియా` సినిమాని రూపొందించారు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. `భరతీయుడు2`తోపాటు ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 12)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు అర్జున్(మోయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్. దీంతో రోజూ తాగుతూనే ఉంటాడు. బార్‌లో ఎవరితోనో గొడవపడి తలలు పగలగొడుతుంటాడు. ఇంటి గురించి ఏమాత్రం పట్టించుకోడు. కూతురు అను(యశస్విని) కాలేజ్, ఇంటికే పరిమితం. బయట ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆమెని కాలేజ్‌లో రాజ్(శివచందు) ప్రేమ పేరుతో వెంటపడుతుంటాడు. చిన్నవాడు సాయి(మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటాడు. ఏదో ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేసి రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఫాతిమా(మధులత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పెద్దబ్బాయి ఏదో గొడవతో ఇంటికి వస్తుంటాడు. చిన్నబ్బాయి అమ్మాయిల విషయంలో దొరికిపోతూ కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. మరోవైపు కూతురు గురించి ఇరుగుపొరుగువాళ్లు ఆరా తీస్తుంటారు. పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ఎప్పుడు ఏదో రకమైన ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో ఇంట్లో మనశ్శాంతి లేదని, వ్రతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో రాజ్ తండ్రి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. దీంతో కూతురుకి సంబంధించిన అసలు విషయం బయటపడుతుంది. మరి ఆ రహస్యమేంటి? మోడల్‌గా రాణించాలనుకునే అనుకి అడ్డంకి ఏంటి? అర్జున్ లవ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏంటి? సాయికి ఫాతిమా దక్కిందా? ఈ సమస్యల నుంచి కృష్ణ కుమార్ ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`సారంగదరియా` సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని కష్టాలను విభిన్న కోణంలో చూపించే సినిమా. ఇందులో కులం ప్రస్తావన ఉంది, మతం ప్రస్తావన ఉంది. లింగమార్పిడి ప్రస్తావన ఉంది. అలాగే అమ్మాయి మోడల్‌గా ఎదగాలనుకునే ఇన్‌స్పిరేషన్ స్టోరీ ఉంది. ఒక పేరెంట్స్ ఆవేదన ఉంది. ఇలా నాలుగైదు కథలను ఒకే స్టోరీలో చెప్పే సినిమా అవుతుంది. నిజానికి ఇలాంటి భిన్నమైన సబ్జెక్ట్ ని డీల్ చేయడం కత్తిమీద సాములాంటిదే. కానీ దర్శకుడు పండు తొలి సినిమాతోనే సరళంగా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తూ, అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఇప్పుడు ఆడియెన్స్ సందేశాత్మక చిత్రాలను చూసేందుకు ఆసక్తిగా లేరు. ఏదైనా ఎంటర్‌టైనింగ్‌గా చెబితే, కమర్షియల్‌గా చెబితే చూస్తున్నారు. అందుకే కమర్షియల్ వేలో సినిమాని చూపించే ప్రయత్నం చేశారు `సారంగదరియా` టీమ్. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
సినిమాగా చూస్తే.. ఫస్టాఫ్‌ని పాత్రలను పరిచయం చేయడం, కృష్ణకుమార్ ఫ్యామిలీ పరిస్థితిని, ఒక్కొక్కరి కథని చెప్పారు. కాకపోతే దాన్ని డిటెయిలింగ్‌గా చెప్పారు. దీంతో సినిమా కొంత లాగ్ అనిపించినా, ఓవరాల్‌గా ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే, సాయి పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఛిల్ తరహాలోనే ఉంటుంది. టీనేజ్ కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అయ్యేలా ఇప్పుడు జనరేషన్‌కి దగ్గరగా ఉంటుంది. అది ఆకట్టుకుంటుంది. ఇక కృష్ణ పాత్రలో ఆయన జీవిత పాఠాలు చెబుతూ, తన నిస్సాహయ స్థితిని చూపించారు. ఓవరాల్‌గా ఫస్టాఫ్ ఓకే అనిపించేలా ఉంటుంది. ఇక రెండో భాగాన్నీ డీల్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రతి సీన్‌ని ఎక్కువగా, డిటెయిల్‌గా చెప్పే ప్రయత్నంలో అది బోరింగ్‌గా మారింది. ఎమోషన్స్ పలుచబడ్డాయి. వరుసగా కష్టాలు ఎదురుకావడంతో కృష్ణ పాత్రలోని నిస్సాహయత ఆడియెన్స్ లో కలుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. అమ్మాయి పాత్రలోని ట్విస్ట్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అను పాత్ర యాక్టివ్‌గా మారడంతో సినిమా ఊపందుకుంటుంది. లింగమార్పిడికి సంబంధించిన అంశాలు, మోడల్ కావాలనుకునే తన ఆశయాలకు సంబంధించి అను పడే స్ట్రగుల్స్ గుండెని బరువెక్కించేలా ఉంటాయి. అదే సమయంలో సమాజంలోని వివక్ష, కామపిశాచుల స్వభావాలను, చిన్నవారిని పెద్ద వాళ్లు తొక్కేసే ప్రయత్నాలను చూపించారు. ఈ సన్నివేశాలు కథని సీరియస్‌గా, ఉత్కంఠభరితంగా మారుస్తాయి. నెక్ట్స్ సీన్ ఏం జరుగుతుందో క్యూరియాసిటీ పెంచుతాయి.
దీనికితోడు ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’, ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆలోచింప చేస్తాయి. క్లైమాక్స్ లో అను తన తండ్రి గురించి చెప్పే డైలాగులు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా కులం, మతాలకు సంబంధించిన డైలాగ్‌లే కాదు, సీన్లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి. వాటికి విజిల్స్ పడతాయి. అర్జున్ తన ప్రియురాలి తండ్రికి బ్లడ్ డొనేట్ చేయడం, సాయి తన ప్రియురాలి తండ్రికోసం మత మార్పిడి చేసుకోవడం సినిమాలో హైలైట్‌గా చెప్పొచ్చు. సమాజంలో పేరుకున్న మురికిని చర్చించేలా చేస్తాయి. అయితే ఎమోషనల్ చాలా వరకు ఆశించిన స్థాయిలో పండలేదు. చాలా సన్నివేశాలను సాగదీయడంతో బోర్ ఫీలింగ్ తెస్తాయి. ఇలా కొన్ని కొన్ని మైనస్‌లు పక్కన పెడితే ఓవరాల్‌గా మంచి సందేశాత్మక మూవీ అవుతుంది.
నటీనటులుః
కృష్ణ కుమార్ పాత్రలో రాజా రవీంద్ర చాలా బాగా చేశాడు. ఇప్పటి వరకు కాస్త పాజిటివ్‌గా, ఇంకాస్త నెగటివ్ రోల్స్ చేసిన ఆయనకు మంచి ఎమోషనల్ రోల్ పడింది. సినిమాని తన భుజాలపై మోశారు. అలాగే అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ పాత్రలో లీనమై చేశాడు. చాలా నేచురల్‌గా చేశాడు. అతని స్టయిల్ బాగుంది. ఇక సాయి పాత్రలో మోహిత్ ఇరగదీశాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో అదరగొట్టాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. అను పాత్రలో యశస్విని అందంతో ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో సినిమా మొత్తాన్ని తనవైపు టర్న్ తీసుకుని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఫాతిమాగా మధులత అలరించింది. రాజ్ పాత్రలో శివ తనదైన యాప్ట్ రోల్లో మరోసారి మెప్పించాడు. కృష్ణకుమార్ భార్యగా నీల ప్రియ సైతం ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు వాటి పరిధి మేరకు ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు.
టెక్నీషియన్లుః
సినిమాకి ఎం ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ బాగా కుదిరింది. పాటలు ఉన్నంతలో బాగున్నాయి. బీజీఎం చాలా చోట్లు ఎలివేట్ అయ్యింది. పెద్ద రేంజ్ సినిమాని తలపించింది. మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు. దీంతోపాటు సిద్ధార్థ స్వయంభు కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ నీట్ గా, రిచ్‌గా కనిపించేలా ఉంది. రాకేష్‌రెడ్డి ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. ల్యాగ్‌ల విషయంలో మ్యానేజ్ చేయాల్సింది. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది. మంచి కథని చెప్పడంలో నిర్మాతల సహకారం కనిపిస్తుంది. అలాగే దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి(పండు) ఎంచుకున్న కథ బాగుంది. చాలా బలంగా ఉంది. చాలా అంశాలను ఒకే కథలో చెప్పాలని ఆయన చేసిన సాహసాన్ని అభినందించాల్సిందే. కానీ కొన్ని చోట్ల సుత్తి లేకుండా సూటిగా చెబితే బాగుండేది. ఎమోషన్స్ వర్కౌట్ చేసే విషయంలో ఇంకా వర్క్ చేయాల్సింది. ఎమోషన్స్ డెప్త్ మిస్ అయ్యింది. దీంతో చాలా సీన్లు ఆశించిన స్థాయిలో పండలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు కూడా తగ్గాయి. ఫన్‌కి ఛాన్స్ ఉన్నా, దాన్ని సరిగ్గా వాడుకోలేదు. సినిమాలో డైలాగ్‌లు హైలైట్ అని చెప్పాలి. సమాజంలో ఉన్న నెగటివిటీని టచ్ చేసిన తీరు బాగుంది. లింగమార్పిడి వంటి సంక్లిష్ట అంశాన్ని లైటర్ వేలో, సంఘర్షణతో చెప్పిన తీరు బాగుంది. ఇలా కొన్ని మైనస్‌లు పక్కన పెడితే, తను చెప్పాలనుకున్న పాయింట్‌ని మాత్రం క్లీయర్‌గా చెప్పాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు.
ఫైనల్‌గాః సందేశాన్ని కమర్షియల్ చెప్పే `సారంగదరియా`.
రేటింగ్‌ః 2.75
నటీనటులు :
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ - సాయిజా క్రియేషన్స్,
నిర్మాతలు - ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి,
దర్శకత్వం - పద్మారావు అబ్బిశెట్టి (పండు),
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అరుణాచల మహేష్,
మాటలు - వినయ్ కొట్టి,
ఎడిటర్ - రాకేష్ రెడ్డి,
మ్యూజిక్ డైరెక్టర్ - ఎం. ఎబెనెజర్ పాల్,
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు,
పాటలు - రాంబాబు గోశాల, కడలి సత్యనారాయణ ,
పి.ఆర్.ఒ - కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి