వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ రివ్యూ
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా `సంక్రాంతికి వస్తున్నాం`. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వెంకటేష్ ఇటీవల కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోతున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఎక్కడో మిస్ ఫైర్ అవుతుంది. గతంలో మాదిరిగా విజయాలు దక్కడం లేదు. దీంతో తనకు బలం అయిన వినోదాన్ని నమ్ముకుని వస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేశారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా మంగళవారం(జనవరి 14)న విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
వైడీ రాజు(వెంకటేష్) ఐపీఎస్ అధికారిగా వందకుపైగా ఎన్ కౌంటర్స్ చేసి పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా పేరుతెచ్చుకుంటాడు. కానీ సస్పెండ్‌కి గురవుతాడు. అందులోనే తన జూనియర్ మీనాక్షి(మీనాక్షి చౌదరీ) రాజుని బాగా ప్రేమిస్తుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. తనకు గౌరవం లేని జాబ్ తాను చేయను అని చెప్పి జాబ్‌కి రిజైన్ చేసి ఇంటికి వచ్చేస్తాడు రాజు. మీనాక్షిని కూడా రమ్మంటే ఆమె రాను అంటుంది. దీంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకుంటారు. కట్ చేస్తే రాజమండ్రిలో తన ఊర్లో పెళ్లి చేసుకుని భార్య భాగ్యలక్ష్మి(ఐశ్వర్యా రాజేష్), పిల్లలతో హాయిగా ఉంటాడు. కాకపోతే ఇల్లరికం అల్లుడిగా వెళ్తారు. ఇప్పటికే నలుగురు పిల్లల్ని కనడంతో మళ్లీ భార్యభర్తలు కలిస్తే పిల్లలు పుడతారని చెప్పి మామ(మురళీధర్ గౌడ్) అడ్డంకిగా మారతాడు. అయినా రాత్రిళ్లు ఈ ఇద్దరు ఆటాపాటలు, రొమాన్స్ తో రెచ్చిపోతారు. ఊర్లో, ఇంట్లో రాజుని రాముడిగా చూస్తుంటారు. ఆదర్శ జంటగా వీరిని భావిస్తుంటారు. కట్ చేస్తే ఆకేళ్ల(శ్రీనివాస్ అవసరాల) అనే పెద్ద వ్యాపారవేత్త అమెరికా నుంచి తెలంగాణకు వస్తాడు. అతను కిడ్నాప్‌కి గురవుతాడు. అతన్ని కిడ్నాపర్ల నుంచి తీసుకురావడానికి రాజు అయితే కరెక్ట్ అని భావించిన సీఎం(నరేష్) మీనాక్షిని రాజు వద్దకు పంపిస్తారు. ఆమె వచ్చీ రావడంతోనే తాను రాజు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెబుతుంది. దీంతో రాజు కొంపలో అసలు చిచ్చు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ లు లేవని భార్యతో సహా అంతా నమ్ముతారు. కానీ మీనాక్షి రావడంతో రాజు అసలు రూపం బయటపడుతుంది. దీంతో జెలసీతో భార్య భాగ్యం రెచ్చిపోతుంది. అనుమానిస్తుంది. ఆపరేషన్‌కి పంపేందుకు నిరాకరిస్తుంది. తాను కూడా వస్తానని కండీషన్ పెడుతుంది. ఓ వైపు భార్య, మరోవైపు ప్రియురాలి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు? ఆపరేషన్ ఎలా చేశాడు? ఇద్దరు ఆడాళ్లు కలిసి రాజుని ఎలా ఇబ్బంది పెట్టారు? దీంతో రాజులో వచ్చిన మార్పేంటి? ఇందులో బుడ్డోడు బుల్‌రెడ్డి ఏం చేశాడు? వీటీవీ గణేష్ పాత్రేంటి? ఈ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
వెంకటేష్ ఇటీవల నేల విడిచి సాము చేసిన ప్రతిసారి ఎదురుదెబ్బలే తగిలాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ తన బలం. అవి కాకుండా యాక్షన్ సినిమాలు చేసి చేదు అనుభవాలు చవిచూశాడు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీకి పెద్ద పీఠ వేస్తూ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ గా నిలిచే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కడం విశేషం. అనిల్ రావిపూడి సినిమాలు ఇటీవల కామెడీ అంతగా వర్క్ కావడం లేదు. సెపరేట్‌గా ఇరికించినట్టుగా కామెడీ ఉంటుందనే విమర్శలు వచ్చాయి. కానీ సిచ్చువేషన్ కామెడీకి పెద్ద పీఠ వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. వెంకటేష్ కి సరైన ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. అయితే భార్య భార్తల మధ్య గొడవలు, అనుమానాలు అనేది ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే విషయం. ఇందులో దానికి పెద్ద పీఠ వేశాడు దర్శకుడు. అదే ఆయన సక్సెస్‌గా చెప్పొచ్చు. సందర్భానుసారంగా పుట్టే కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు.
సినిమా ప్రారంభంలో వెంకటేష్ ఐపీఎస్ అధికారిగా ఎంత పవర్‌ఫుల్ అనేది చూపించారు. ఎందుకు జాబ్ వదిలేశాడనేది చూపించి, ఆ తర్వాత రాజమండ్రికి కథని షిఫ్ట్ చేశాడు. ఓ వైపు తెలంగాణ సీఎం ప్రముఖ సీఈవో ఆకేళ్లతో మీటింగ్, ఆయన కిడ్నాప్ కావడం, ఆయన్ని సురక్షితంగా తీసుకురావడానికి సీఎం లేవెల్లో చర్చలు చూపిస్తూనే మరోవైపు వెంకటేష్ తన భార్య ఐశ్వర్యతో ప్రేమ, ఫ్యామిలీలో ఫన్నీ సీన్లతో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా వెంకీ కొడుకుగా బుల్‌రెడ్డి పాత్రలో చేసిన చిన్న పిల్లాడి కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే వెంకీ, ఐష్ మధ్య రొమాన్స్ కూడా ఫన్నీగా ఉంటుంది. దీంతో ఫస్టాఫ్ అంతా ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగుతుంది. హిలేరియస్‌గా అనిపిస్తుంది. వెంకీ పక్కన చేసిన పనోడు పాత్ర కూడా నవ్వులు పూయిస్తుంది. మీనాక్షి ఎంట్రీతో ఐశ్వర్యలో వచ్చే జెలసీ, అనుమానం ఈ క్రమంలో ఆమె చేసే పనులు, మాటలు, దాన్ని కవర్ చేయడానికి వెంకీ పడే బాధలు ఆద్యంతం హిలేరియస్‌గా ఉంటాయి.
ఇక సెకండాఫ్‌లో కూడా ప్రారంభంలో అదే ఫన్ కంటిన్యూ చేశాడు. కానీ ఆకేళ్లని పట్టుకునేందుకు వేసే డ్రామాలు, స్కెచ్‌ల నుంచి కథ స్లో అయిపోతుంది. ఫన్ తగ్గిపోతుంది. కాస్త సీరియస్‌గా అనిపిస్తుంది. మరోవైపు రౌడీ షీటర్ అప్పు పాండేని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాల్లో కొంత ఫన్ వర్కౌట్ అవుతుంది. కానీ చాలా వరకు ఆ డోస్ తగ్గిపోయింది. అదే సమయంలో అనవసర సీన్లు వచ్చిపోతున్నట్టుగా ఉంటుంది. దీంతో సహజత్వం మిస్ అయ్యింది. ఫన్ వర్కౌట్ కాలేదు. మరోవైపు క్లైమాక్స్ లో వెంకీ చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. కానీ ఊర్లో టీచర్ కి జరిగిన అవమానం ఎపిసోడ్ ఇరికించినట్టుగా ఉంటుంది. దానికి కథకి సంబంధం లేదు. ఫస్టాఫ్ మాదిరిగా సెకండాఫ్‌ని కూడా డీల్ చేసి ఉంటే సినిమా అదిరిపోయేది. అదే సమయంలో వెంకటేష్ పాత్రని సరిగా డీల్ చేయలేదు. కావాలని తగ్గించినట్టుగా ఉంటుంది. ఓ వైపు ఐశ్వర్యా రాజేష్, మరోవైపు బుల్ రెడ్డి పాత్ర, ఇంకోవైపు యానిమల్ నటుడు వంటి సైడ్ రోల్స్ కి ప్రయారిటీ ఇచ్చి వెంకీకి తక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ, సంక్రాంతి పండగని తలపించే ఎపిసోడ్లు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సినిమా కేవలం ఫన్ కోసం చేసిందే కాబట్టి లాజిక్కులు వేతకడం వేస్ట్. సంక్రాంతికి పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలనుకుంటారు. అది ఏమాత్రం బాగున్నా నడిపిపోతుంది. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా కూడా అలాంటిదే.
నటీనటులుః
వెంకటేష్.. పోలీస్ ఆఫీసర్‌గా కంటే ఫ్యామిలీ మ్యాన్‌గా ఆకట్టుకున్నారు. తనదైన కామెడీతో రెచ్చిపోయాడు. ఇద్దరు లేడీస్ మధ్య ఇరుక్కుపోయి నలిగిపోయిన పాత్రలో ఇరగదీశాడు. ఇది ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు. అదే సమయంలో డాన్సులతో, పాటతోనూ ఆకట్టుకున్నారు. ఐశ్వర్యా రాజేష్ వెంకీని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. ఆమె పాత్రకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఈర్ష్య పడే, అనుమానించే భార్య పాత్రలో జీవించింది. ఐష్ పాత్ర వల్ల మీనాక్షి పాత్ర కూడా హైలైట్ అయ్యింది. ఆమె కూడా బాగా చేసింది. మామగా మురళీధర్ గౌడ్ రెచ్చిపోయాడు. సీఎంగా నరేష్ ఆకట్టుకున్నారు. పార్టీ ప్రెసిడెంట్‌గా వీటీవీ గణేష్ కామెడీ వర్కౌట్ అయ్యింది. ఆకేళ్లగా శ్రీనివాస్ అవసరాలకి నటించడానికి పెద్దగా ఏం లేదు. జైలర్‌గా యానిమల్ నటుడు ఉపేంద్ర ఇరగదీశాడు. కానీ ఆయన కామెడీ ఓవర్ బోర్డ్ అయ్యింది. కానిస్టేబుల్ మాణిక్యంగా సాయికుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా వెంకీ కొడుకుగా చేసిన బుడ్డోడు మాత్రం దుమ్ములేపాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
సమీర్ రెడ్డి కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌రిచ్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది. సంక్రాంతి పండగని తలపించేలా ఉంది. ఎడిటర్ తమ్మిరాజు సెకండాఫ్‌లో కొంత ల్యాగ్ తీసేయాల్సింది. భీమ్స్ మ్యూజిక్ సినిమాకి మరో అసెట్. పాటలు, బీజీఎం అదిరిపోయింది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీని బాగా డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. బలవంతంగా ఇరికించిన కామెడీ కాకుండా సిచ్చువేషన్ కామెడీకి ప్రయారిటీ ఇచ్చి చేశాడు. కానీ సెకండాఫ్‌ని కూడా అదే స్థాయిలో తీసుకెళ్తే బాగుండేది. సాధారణంగా ఆయన సెకండాఫ్ ని డీల్ చేయడంలో విఫలమవుతాడు. ఇందులోనూ కొంత అది కనిపించింది. కానీ పర్వాలేదని చెప్పొచ్చు. కామెడీతో అన్ని పక్కకు వెళ్లిపోతాయి. సెకండాఫ్‌ని ఇంకా బాగా డీల్ చేస్తే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. కానీ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః `సంక్రాంతికి వస్తున్నాం`తో ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పక్కా. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకునే మూవీ.
రేటింగ్‌ః 3