`పేకమేడలు` మూవీ రివ్యూ, రేటింగ్
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఇటీవల మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాంటి కోవాలోనే ఇప్పుడు `పేకమేడలు` సినిమా వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`బాహుబలి` సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు రాకేష్ వర్రే. నటుడిగా, హీరోగా రాణిస్తున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై `పేకమేడలు` అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని నిర్మించారు. ఇందులో వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటించారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. రియలిస్టిక్ స్టోరీస్‌కి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి కథాంశంతోనే `పేకమేడలు` మూవీని రూపొందించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(జులై 19)న విడుదలైంది.
కథః
లక్ష్మణ్(వినోద్ కిషన్) బిటెక్ చదివి బలాదూర్ తిరుగుతుంటాడు. జాబ్ చేయడం చేతకాదు. ఆయనకు భార్య వరలక్ష్మి(అనుష కృష్న), కొడుకు ఉంటాడు. కానీ ఫ్యామిలీని పట్టించుకోడు. బస్తీలో ఉంటూ ఫ్రెండ్స్ తో రోజూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. మాటలతోనేకోటలు కడుతూ, ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి జల్సాలు చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా కోట్లు సంపాదించాలనుకుంటాడు. మరోవైపు భార్య చిన్నా చితకా పనులు చేసి వచ్చిన దానితో కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె కర్రీ పాయింట్ పెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం కొంత డబ్బు కావాలని భర్త లక్ష్మణ్‌ని అడగ్గా, ఏదోలా మ్యానేజ్ చేస్తానని చెబుతాడు. ఫ్రెండ్ ని కాకా పట్టి 50వేలు అప్పుతీసుకుంటాడు. వాటితో షాపింగ్ చేసి మంచి డ్రెస్సులు కొంటాడు. ఇంతలో ఓ ఎన్‌ఆర్‌ఐ లేడీ లగ్జరీ అపార్ట్‌మెంట్ లో ఫ్లాట్ కొనేందుకు దిగుతుంది. ఆమెతో పరిచయం క్లోజ్‌గా మారుతుంది. తన మాయమాటలతో ఆమెని తన బుట్టలో వేసుకుంటాడు లక్ష్మణ్. రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టించి కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఆమెతో ఫిజికల్‌గానూ కలుస్తాడు. అయితే ఆమెకి అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉంటాయి. భర్త నస భరించలేక ఇండియా వస్తుంది. లక్ష్మణ్‌కి క్లోజ్ అయి అతనితోనే ఉండాలని, భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటుంది. మరోవైపు ఆ ఎన్‌ఆర్‌ఐ లేడీ మోజులో పడ్డ లక్ష్మణ్ కూడా తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటాడు. ఎన్‌ఆర్‌ఐ లేడీ విషయం తెలిసి గొడవపెట్టుకుంటుంది లక్ష్మణ్ భార్య. గొడవపడి పుట్టింటికి వెళ్లిపోతుంది. అదే సమయంలో లక్ష్మణ్ ని ఎన్‌ఆర్‌ఐ లేడీ భర్త లోకల్ ఫ్రెండ్స్ తో చితక్కొట్టిస్తాడు. అతని అసలు బండారం ఆమెకి తెలిసేలా చేస్తాడు. దీంతో లక్ష్మణ్ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది? పుట్టింటికి వెళ్లిన భర్య తిరిగి వచ్చిందా? ఇద్దరు కలిశారా? విడిపోయారా? లక్ష్మణ్‌లో వచ్చిన మార్పేంటి? చివరగా ఇచ్చిన ట్విస్టేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఓ వైపు వందల కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీస్ హవా సాగుతున్న నేపథ్యంలో మరోవైపు కాన్సెప్ట్ చిత్రాలు సైతం ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. వారికి రిలీఫ్‌నిస్తున్నాయి. సందేశాన్నిస్తున్నాయి. టైమ్ పాస్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. భారీ పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే, ఇప్పుడు ఇలాంటి చిన్న బడ్జెట్, కాన్సెప్ట్ చిత్రాలకు ఆదరణ బాగుంటుంది. ఆడియెన్స్ కూడా చూసేందుకు ఇష్టపడుతున్నారు. `పేకమేడలు` కూడా అలాంటి సినిమానే. లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చోటు చేసుకునే సంఘటనలు, బస్తీలో ఉండే ఓ జంట మధ్య గొడవలను కళ్లకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు నీలగిరి మామిళ్ల. సినిమా.. లక్ష్మణ్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. అతను బిటెక్ చేయడం, కానీ జాబ్ చేసే ఆసక్తి లేకపోవడం, ఈజీగా మనీ సంపాదించాలనుకోవడం, జల్సాలు చేయాలనుకోవడం అనేది సహజంగా చాలా మంది మగాళ్లలో ఉండే లక్షణం. ఈ పాయింట్‌తో ఆడియెన్స్ ని కనెక్ట్ చేశాడు దర్శకుడు. అతను ఇంట్లో భార్యకి కథలు చెబుతూ, అది చేస్తా? ఇది చేస్తా అని చెబుతూ మోసం చేస్తూ బయటకు ఎంజాయ్ చేయడం చాలా రియలిస్టిక్ గా చూపించారు.
మరోవైపు బస్తీలో ఉండే ఫ్యామిలీస్ జీవితాలు, వాళ్లు పడే బాధలు, వాళ్ల గొడవలు, పక్కింట్లో ఏదైనా సంఘటన జరిగే ఇతరులు ఆతృతగా చూడటం వంటి సన్నివేశాలు కళ్లకి కట్టినట్టు వెండితెరపై ఆవిష్కరించారు. రెగ్యూలర్‌గా మన జీవితంలో జరిగే సన్నివేశాలను సహజంగా ఆవిష్కరించి ఆడియెన్స్ ని కనెక్ట్ చేశాడు. ఇక బలాదూర్ తిరిగే భర్తని కంట్రోల్ చేసేందుకు భార్య చేసే ప్రయత్నాలు, దీంతో ఇంట్లో గొడవలు సైతం రియలిస్టిక్‌గా ఉన్నాయి. మరోవైపు లక్ష్మణ్.. ఎన్‌ఆర్‌ఐ ఆంటీతో పులిహోర కలిపే సీన్లని కామెడీగా, ఫన్నీగా చూపించాడు. ఆయా సన్నివేశాలు బాగా పేలాయి. ఎన్‌ఆర్‌ఐ లేడీ కోసం లక్ష్మణ్ బిల్డప్ కొట్టిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు ఆమె మోజులో పడి భార్యకి విడాకులు ఇవ్వాలనుకోవడం, గొడవ పడటం వంటి సీన్లు కూడా రక్తికట్టించేలా ఉన్నాయి. ఊర్లో భార్యభర్తల పంచాయితీ, ఊరి జనాలు రియాక్ట్ అయిన తీరు, అలాగే ఇంటి ఆడబిడ్డ వచ్చినప్పుడు అన్న భార్య దెప్పిపొడుపు మాటలు సైతం బాగున్నాయి.
సినిమాలో అనవసరమైన అంశాలకు పోకుండా ఏది ఎంత కావాలో, అంతే పెట్టి రూపొందించారు దర్శకుడు. అయితే మధ్య మధ్యలో కొంత లాగ్ అనిపిస్తుంది. స్లోగా సాగడం, లక్ష్మణ్ ప్రవర్తనని, ఆయన కొట్టే బిల్డప్‌లను కాస్త ఎక్కువగా చూపించడం సాగదీతగా అనిపిస్తుంది. సినిమాలో చాలా వరకు ఫన్ కి స్కోప్ ఉంది. కానీ ఆ యాంగిల్‌ని సరిగా వాడుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సినిమాలో చాలా డ్రామా ఉంది. ఆ డోస్ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. మరోవైపు కొత్త కాస్టింగ్ కావడంతో కనెక్ట్ అవడానికి టైమ్ పడుతుంది. కానీ రియలిస్టిక్ సీన్లు వాటిని డామినేట్ చేస్తాయని చెప్పొచ్చు. క్లైమాక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. సాదాసీదా ముగింపులా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఏదైనా సర్‌ప్రైజింగ్ అనిపించే సీన్ పెడితే సినిమా ఫలితం అదిరిపోయేది. ఓవరాల్‌గా మన చుట్టూ రెగ్యూలర్‌గా జరిగే సంఘటనలను, ఓ రియల్ లైఫ్‌ని వెండితెరపై చూపించే మూవీ `పేకమేడలు`.
నటీనటులుః
లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ చాలా బాగా చేశాడు. పాత్రలో ఒదిగిపోయాడు. కాస్త ఇన్నోసెంట్‌గా, ఇంకాస్త కన్నింగ్‌గా అదరగొట్టాడు. డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ మ్యాజిక్ చేశాడు. వరలక్ష్మి పాత్రలో అనుష కృష్ణ లుక్, నటన అంతే రియలిస్టిక్‌గా ఉంది. పాత్రలో జీవించింది. పాత్రకి ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్లని అంతే బాగా చేసి మెప్పించింది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ బాగా రక్తికట్టింది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఈ పాత్రల ముందు మిగిలినవన్నీ తేలిపోతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్ఆర్‌ఐ లేడీగా రేతికా శ్రీనివాస్ కూడా అంతే బాగా చేసింది. వీరితోపాటు జగన్ యోగిరాజ్, గణేష్ తిప్పరాజు, నరేష్ యాదవ్‌లు కూడా బాగా చేశారు. మిగిలిన పాత్రలు సైతం ఆకట్టుకునేలా, సహజంగా ఉన్నాయి.
టెక్నీకల్‌గాః
సినిమాకి హరిచరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కథకి తగ్గట్టుగానే నేచురల్‌గా ఉంది. సంగీతం సినిమాకి పెద్ద ప్లస్. మ్యూజిక్‌తోపాటు బిజీఎం అదిరిపోయింది. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో అది కీలకభూమిక పోషించింది. కథలో భాగంగా వచ్చే పాటలు ఆకట్టుకునేలా కాదు, హృదయాన్ని టచ్ చేసేలా ఉన్నాయి. ఎమోషనల్ సాంగ్ సైతం బాగుంది. బస్తీని ఆవిష్కరించిన ఆర్ట్ వర్క్ ని అభినందించాల్సిందే. కాన్సెప్ట్ మూవీ కావడంతో బడ్జెట్ తక్కువే ఉంటుంది. కానీ ఈ మూవీ విషయంలో రాకేష్ వర్రే రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది. దర్శకుడు నీలగిరి మామిళ్ల చాలా సహజంగా సినిమాని తెరకెక్కించిన తీరుని అభినందించాల్సిందే. ఆయన రైటింగ్, డిస్టర్బ్ లేని కథనం సినిమాకి పెద్ద హైలైట్. పైగా ఆర్టిస్ట్ ల ఎంపిక, వారి నటన డైరెక్షన్‌ని ఎలివేట్ చేశాయని చెప్పొచ్చు. చాలా సన్నివేశాలను చాలా డిటెయిలింగ్‌గా చెప్పడం, రూరల్, బస్తీల్లో చోటు చేసుకునే సంఘటనలను సైతం అంతా బాగా వెండితెరపై ఆవిష్కరించడం దర్శకుడు ప్రతిభకి నిదర్శనంగా నిలుస్తాయి. చిన్న చిన్నలోపాలున్నా ఫన్నీ వే నుంచి ఎమోషనల్ సైడ్ సినిమాని నడిపించిన తీరు బాగుంది.
ఫైనల్ గాః `పేకమేడలు` రియలిస్టిక్ మూవీ. నిజాయితీతో కూడిన ప్రయత్నం.
రేటింగ్‌ః 2.75
నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్
టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR