#Aadikeshava:వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' రివ్యూ
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava).
#Aadikeshava Review
ప్రతీ హీరోకు తనను తాను యాక్షన్ హీరోగా చూసుకోవాలని ఉంటుంది. అలాగే దర్శకుడికి యాక్షన్ సినిమా చేస్తేనే నెక్ట్స్ లెవిల్ ఉంటుంది. అందుకోసం యాక్షన్ కథలతో ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మొదలెడతారు. అది కామన్ గా జరిగే విషయమే. అయితే యాక్షన్ సినిమా చేయాలంటే అది ఓ రేంజిలో లేకపోతే ప్రేక్షకుడుకు ఎక్కే పరిస్దితి లేదు. కేవలం కొట్టుకుంటాం,నరుక్కుంటాం అంటే సరిపోదు. అందుకు తగ్గ ఎమోషన్ ఉండాలి. అదీ అంతకు ముందు చూడనదై ఉండాలి. ఆ తరహా ఎమోషనల్ యాక్షన్ ని ఈ సినిమా ఇవ్వగలగిందా, మెగా మేనల్లుడు యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి..అసలు ఈ సినిమా కథేంటి, డైరక్టర్ ఇంటర్వూలో చెప్పినట్లు ట్యూబ్ లైట్ సీన్ థియేటర్ లో బాగా పేలిందా ఇవన్నీ రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
బాలు (వైష్ణవ్ తేజ్) సలక్షణమైన కుర్రాడు. సగటు యాక్షన్ సినిమా హీరోలాగ...అతనికి అన్యాయం,అక్రమం అంటే గిట్టదు. అవి చేసేవాళ్లను ఎంతదూరం వెళ్లైనా అంతు తేలుస్తూంటాడు. అతని అమ్మా,నాన్నా (రాధిక శరత్ కుమార్, జయప్రకాశ్) కొంతకాలం ఈ అన్యాయ,అక్రమాలను ఎదుర్కొనే జాబ్ కు గ్యాప్ ఇచ్చి ... ఏదన్నా ఉద్యోగం చెయ్యమని బతిమాలుతూ వుంటారు. సర్లే పెద్దవాళ్లు అని, వాళ్ళ కోరిక కాదనలేక ఒక కాస్మొటిక్స్ కంపెనీ కి అప్లై చేసి,ఇంటర్వూలో ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీ లీల) ఇంప్రెస్ చేసిసే ఉద్యోగంలో చేరిపోతాడు. ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు..ఆమే హీరోయిన్ కదా అని గుర్తించినట్లున్న మన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. సర్లే మీరు ఇంత సినిమాటెక్ గా వెళ్తున్నారు కదా అని ఆమె తండ్రి కూడా అదే ఫాలో అవుతాడు. ఓ రోజున అదే కంపెనీ లోనే పనిచేస్తున్న ఇంకొక కుర్రాడికి ఇచ్చిన తన కూతురు చిత్రని ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన ప్రకటన చేసేస్తాడు. (Aadikeshava Movie Review)అక్కడితో ఆగకుండా మన హీరోకు వార్నింగ్ ఇవ్వడానికి కొంతమంది రౌడీలను కూడా పిలిపిస్తాడు.
ఇంత రొటీన్ రచ్చ జరుగుతున్నప్పుడు ఇంకో ట్విస్ట్ రివీల్ కావాలి కదా. అందుకు రంగం సిద్దమవుతుంది. ఈ కుర్రాడు మీరు చూస్తున్న బాలు కాదు..వెనకాల పెద్ద ప్లాష్ బ్యాక్ ఉన్న రాయలసీమ కుర్రాడు. అంటే ఇక్కడ భాషాలా ఓ సమరసింహా రెడ్డిలా బ్రతుకుతున్నాడన్న మాట. ఇక రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్) అన్నయ్య (తనికెళ్ళ భరణి) వచ్చి బాలుని అత్యవసరంగా రాయలసీమ తీసుకొని వెళతాడు. అక్కడ బ్రహ్మపురంలో చెంగారెడ్డి (జోజు జార్జి) అక్రమంగా మైనింగ్ చేయిస్తూ పిల్లలచేత పనులు చేయిస్తూ ఉంటాడు. విలన్ కదా అడ్డుకునేవాళ్ళందరినీ చంపేస్తూంటాడు. అక్కడికే మన హీరో వెళ్తాడు. ఇక్కడ హైదరాబాదులో కాస్మొటిక్ కంపెనీలో పనిచేసే బాలుకి రాయలసీమనుంచి పిలుపు రావటం ఏంటి , ఆ విలన్ తో మనడోకి ఏంటి లింక్ , బాలు అసలు పేరు రుద్రా కాళేశ్వర్ రెడ్డి అని తెలిసింది? మన హీరో బాలు నేపధ్యం ఏంటి? ఇవన్నీ ఊహించలేకపోతే 'ఆదికేశవ' సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఎందుకనో ఈ సినిమాకు మొదటి నుంచి పెద్ద బజ్ లేకుండా పోయింది. ట్రైలర్ వచ్చాక అయినా బజ్ క్రియేట్ అవుతుందనుకున్నారు. అదీ జరగలేదు. అప్పటికీ నిర్మాత ...ఈ సినిమాపై ఇచ్చిన స్టేట్మెంట్స్ అయినా హాట్ టాపిక్ గా మారుతుందనుకుంటే అదీ జరగలేదు. ట్రైలర్ క్లిక్ అయ్యి ఉంటే వేరే విధంగా ఉండేది. దాంతో సినిమా చూడకముందే ఓ విధమైన నమ్మకం పెట్టేసుకున్నారు. అందుకు విభిన్నంగా తెరపై జరిగితే ఖచ్చితంగా నెక్ట్స్ లెవిల్ ఉండేది. ఎక్సపెక్ట్ చేయనది జరిగితే ఆ ఇంపాక్ట్ వేరే విధంగా కనపడేది. కానీ అందరూ ఈ సినిమా ఏదో తేడాగా ఉందనటం మొదలెట్టారు. అందుకు తగినట్లుగానే సినిమా ఉంది. ఏదో ఎనభైల్లో వచ్చిన ఓ సినిమాని ఇప్పుడు రీరిలీజ్ లో చూస్తున్న ఫీలింగ్. కేవలం మాస్ అనే ఒక్క సింగిల్ ఎజెండాతో ఈ కథని ఓకే చేసి తెరకెక్కించారనిపిస్తుంది. ఉప్పెనలో తనలోని నటుడుని చూపించిన వైష్ణవ్ తేజ సైతం ఏ చేయాలో , ఎలా రెస్పాండ్ కావాలో తెలియనట్లు ఆర్టిఫిషియల్ గా చేసుకుంటూ పోయారు. ఆర్టిస్ట్ లకే ప్రేరణ కలిగించలేకపోయిన ఈ కథ ..చూసే మనకు ఏమి అనిపిస్తుంది. ఓ సీరియస్ సమస్యను డీల్ చేస్తున్నట్లు ఉండదు..అలాగని పక్కా కమర్షియల్ ఫిల్మ్ ఫార్మెట్ లా తీసారు కదా అంటే అటు కాలక్షేపం ఇవ్వదు.
బాషా టైప్ స్క్రీన్ ప్లే తో సాగే ఈ సినిమా లో క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ ఇలా ఒక్కటేమిటి అన్ని జానర్స్ లోని ఎలిమెంట్స్ ని సీన్స్ గా అల్లేసి కలిపేసి గందరగోళం చేశాడు. మైనింగ్ బిజినెస్ కొత్తగా అనిపించి కథ అల్లుకున్నారని అర్దమవుతోంది. అయితే అది సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. దాని మీద పెద్దగా వెళ్లలేదు. దాంతో సినిమా ఫార్మెట్ లో నడుస్తూంటుంది. ఈ క్రమంలో డైరక్టర్ దర్శకుడు ఏమి చెప్పాలనకున్నాడో క్లారిటీ వచ్చేసరికి..క్లైమాక్స్ కు చేరుకుంటాము. హీరో యాక్టివ్ ప్యాసివ్ క్యారక్టర్.. యాక్షన్ లో ఉన్నట్టు కనపడతాడు ..అదేమీ విలన్ కు విస్తుపోయేటంత సవాల్ వేసిరేలా ఉండదు. ఊరుకూరుకే యాక్షన్ సీన్స్ వచ్చి పోతూంటాయి. దాంతో స్క్రీమ్ సమయం, మన సమయమంతా వృధా చేసిన ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ తో రోమాన్స్ దారుణం అనిపిస్తుంది. ఆ సీన్ల ప్రారంభ ముగింపులు కూడా ఏమిటేవిటో ఉంటాయి.
పవన్ ఫ్యాన్స్ ని అలరించటానికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఆ పాటలు పెట్టి శ్రీలీల చేత డాన్స్ లు చేయించటం తప్పించి ప్రత్యేకంగా ఏమీ కనపడదు. కమర్షియల్ సినిమా ఇలాగే ఉంటుంది.ఉండాలి అన్నట్లు కొన్ని లెక్కలువేసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన ప్రయత్నం ఇది. ఏదైమైనా యాక్షన్ సినిమా చేస్తున్నాం అనగానే దర్శకుడు...మరీ ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్లి అప్పట్లో వచ్చిన సాంబ, ఆది, చెన్నకేశవరెడ్డి ఈ సినిమాలను రిఫరెన్స్ గా పెట్టుకున్నట్లున్నాడు. అయితే అందులో ఉన్న స్క్రీన్ ప్లేను తీసుకున్నాడు కానీ ఎమోషన్ ఎలిమెంట్ ని కాప్చర్ చేయలేకపోయాడు. కేవలం కొత్తదనం అంటే.. ..ఓ రౌడీని చంపి ఆ మంటల్లోంచి హీరో సిగరెట్ వెలిగించుకునే సీన్ అనుకోవాలి.
టెక్నికల్ గా...
యాక్షన్ ఎపిసోడ్స్ లో వైష్ణవ్ తేజ్ కొత్తగా కనిపించాడు. కానీ అతని బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యినట్లు అనిపించలేదు. ఆ పాత్ర చిత్రణ పేలవంగా ఉండటంతో కలిసి రాలేదు. ఉన్నంతలో కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్నిటికీ న్యాయం చేశాడు. శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. డాన్స్ లు బాగున్నాయి అంతే. మళయాళ నటుడు జోజూ జార్జ్ కు కీ ఇది కొత్త పాత్రే. ఎందుకంటే ఆయన పాత్రలు ఎప్పుడూ కాస్త విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి రొటీన్ విలన్ పాత్ర కొత్తే. అయితే ఎప్పటిలాగే సెటిల్డ్ గా కనిపించాడు. కానీ సినిమాలో ఆయన ప్రభావం ఏం కనిపించదు. కేవలం అప్పడుప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ లా కనపడుతుంది. క్లైమాక్స్ కోసం ఈ పాత్రని కథలోకి తీసుకొచ్చాడు. మిగతా పాత్రలు కథలాగానే రొటీన్ గా సాగిపోతూంటాయి.
సాంకేతికంగా బ్యాగ్రౌండ్ స్కోర్ మోతలాగ ఉంటుంది. ఎక్కడా ఎమోషన్ కలిగించదు. పాటలు అయితే అసలు కిక్ లేవు.డడ్లీ కెమెరా వర్క్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం తగ్గేదే లే అన్నట్లున్నాయి. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడుగా తొలి చిత్రం మేకింగ్ , రైటింగ్ ఫక్తు కమర్షియల్ సినిమా మీటర్ ని,టెంప్లేట్ ని ఫాలో అయ్యారు. కొత్త దర్శకుడు ఇలా చేస్తే చేసేదేముంది. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేసారు ఆ కొరియోగ్రాఫర్స్. డైలాగులు అక్కడక్కడా బాగా పేలాయి. డైరక్టర్ కు మాస్ పల్స్ కొంత తెలుసు కానీ రొటీన్ కథ ఎంచుకోవటంతో సమస్యగా మారింది.
ప్లస్ లు
వైష్ణవ్ తేజ్
శ్రీలీల ఎనర్జీ
ప్రొడక్షన్ వాల్యూస్
కామెడీ బిట్స్
మైనస్ లు
కథ,కథనం
రొటీన్ ప్లాష్ బ్యాక్ సీన్స్
క్లైమాక్స్
ఫైనల్ థాట్
సినిమా మారుతోంది..కథా చెప్పే విధానంలోనూ, టెక్నికల్ గానూ కొత్త పుంతలు తొక్కుతోంది. పుష్ప, కేజీఎఫ్ లు,జైలర్ ,లియో,, కన్నూర్ స్క్వాడ్ వంటి సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటిని చూసిన కళ్ళతో ఇలాంటి సినిమాలు చూడటం అంటే కాస్త ఇబ్బందే. అంతకు మించి లేకపోతే అంతమైపోయే పరిస్దితి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు
ఛాయాగ్రహణం: డడ్లీ
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 24, 2023