- Home
- Entertainment
- Movie Reviews
- Objection My Lord Review: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉందంటే?
Objection My Lord Review: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉందంటే?
Objection My Lord Review: శ్రీకాంత్ క్యారెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. ఆయన తాజాగా లాయర్‌గా నటించిన వెబ్ సిరీస్ `అబ్జెక్షన్ మై లార్డ్`. జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ
శ్రీకాంత్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. ఇటీవల క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుని దూసుకుపోతున్నాడు. పాజిటివ్, నెగటివ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా `అబ్జెక్షన్ మై లార్డ్` అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో ముఖేష్ రుషి కీలక పాత్ర పోషించారు. వీరితోపాటు అనన్యా శర్మ, స్నేహాల్, సమీర్ ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. ఇది జీ5 ఓటీటీలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి వెబ్ సిరీస్ ఎలా ఉంది? శ్రీకాంత్ అదరగొట్టారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
అబ్జెక్షన్ మై లార్డ్ కథ
పరశురామ్ (శ్రీకాంత్) వృత్తిరీత్యా నోటరీ. కోర్టు ఆవరణలో చెట్టు కింద డాక్యుమెంట్లు సిద్ధం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. చట్టాలపై, సెక్షన్లపై మంచి అవగాహన ఉన్నప్పటికీ కోర్టులో వాదించే అవకాశం మాత్రం అతనికి ఎప్పుడూ రాలేదు. ఒక రోజు కోర్టు ప్రాంగణంలో నారాయణ (రాయల హరిశ్చంద్ర) ఆత్మహత్య చేసుకోవడం పరశురామ్‌ను తీవ్రంగా కలచివేస్తుంది. ఆ ఘటన తర్వాత నారాయణ కుమార్తె సమీర (స్నేహాల్ కామత్) కిడ్నాప్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేస్తాడు. ఈ కేసును పరిశీలిస్తూ వెళ్లే కొద్దీ నారాయణ జీవితానికి సంబంధించిన అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. పరశురామ్ వేసిన పిల్‌ను కొట్టివేయాలని ప్రముఖ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ (ముఖేష్ రుషి) రంగంలోకి దిగుతాడు. కోర్టులో వీరిద్దరి మధ్య జరిగే వాదోపవాదాలు సాగుతాయి. సమీర కిడ్నాప్ కేసుకు మహిళల అక్రమ రవాణా వంటి అంశాలు ఎలా ముడిపడ్డాయి? ఈ వ్యవహారానికి ఒక ఎమ్మెల్యే కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి? కుటుంబం, సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా పరశురామ్ తన పోరాటాన్ని ఎలా కొనసాగించాడు? జూనియర్ లాయర్ వేద (అనన్యా శర్మ) అతనికి ఎలా తోడ్పడింది? చివరకు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? పరశురామ్ లాయర్‌గా సక్సెస్ అయ్యాడా? లేదా అనేది మిగిలిన కథ.
అబ్జెక్షన్ మై లార్డ్ ఎలా ఉందంటే?
'జీ5'లో విడుదలైన ఈ `అబ్జెక్షన్ మై లార్డ్` తమిళ వెబ్ సిరీస్ `సట్టముం నీదియుం`కు రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌ను చూసిన తెలుగు ప్రేక్షకులు తక్కువగానే ఉండటంతో ఈ కథ వారికి కొత్త అనుభూతిని కలిగించే అవకాశముంది. ఏడు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్‌లో తొలి నాలుగు ఎపిసోడ్లను దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ పాత్రలు, నేపథ్యం, కథను పరిచయం చేయడానికి ప్రయారిటీ ఇచ్చాడు. కోర్ట్‌రూమ్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు, కానీ ఈ కథను ఒక నోటరీ దృష్టికోణంలో చెప్పడం వల్ల కొత్తదనాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్ సాబ్` చిత్రంలో మహిళ సమ్మతి ఎంత ముఖ్యమో చెప్పినట్లే, ఈ సిరీస్ కూడా అదే తరహా సామాజిక సందేశాన్ని ఇస్తుంది. అయితే దాన్ని మరింత సహజమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. పరశురామ్ తొలిసారి కోర్టులో అడుగుపెట్టినప్పుడే అతను చివరకు విజయం సాధిస్తాడనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. అందుకే మొదటి నాలుగు ఎపిసోడ్లలో పెద్దగా ఆశ్చర్యపరిచే మలుపులు కనిపించవు. ఎపిసోడ్ చివర్లో చిన్న ట్విస్టులు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఉత్కంఠను కలిగించవు. దీనికితోడు చాలా స్లోగా సాగుతుంది. నత్త నడకగా కథనం సాగడంతో బోర్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే సమీర పాత్ర కథలో ప్రవేశించిన తర్వాత, ఆమె కుటుంబ నేపథ్యం బయటపడటంతో కథనం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అక్కడి నుంచి వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిలో కొంత ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా చివరి మూడు ఎపిసోడ్లు నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠకి గురి చేస్తాయి. విలన్ ట్రాక్ మాత్రం మరింత బలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎమ్మెల్యే పాత్రకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తి స్థాయిలో చూపించలేకపోయారు. కొన్ని సన్నివేశాలు లాజిక్ కంటే కథను ముందుకు తీసుకెళ్లడానికే రాసినట్లుగా అనిపిస్తాయి. అయితే సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
అబ్జెక్షన్ మై లార్డ్ లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
పరశురామ్ పాత్ర శ్రీకాంత్‌కు కొత్తది కాకపోయినా, ఆ పాత్రలోని భావోద్వేగాలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు. కుటుంబ సభ్యుల చేతిలో, ముఖ్యంగా తన కుమారుడి నుంచి ఎదురయ్యే అవమానాలను భరించే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఓడిపోయిన వ్యక్తి నుంచి విజేతగా మారే ప్రయాణాన్ని నమ్మించేలా చేశారు. పవర్‌ఫుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ముఖేష్ రుషి తన పాత్రకు తగ్గ స్థాయిలో కనిపించారు. పరశురామ్ జూనియర్ వేదగా అనన్యా శర్మకు మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. అవసరమైన భావోద్వేగాలను సమర్థంగా పలికించారు. సమీర పాత్రలో స్నేహాల్ కామత్ అద్భుతంగా నటించారు. ఆమె హావభావాలు పాత్రకు బలాన్ని తీసుకొచ్చాయి. నారాయణ పాత్రలో రాయల హరిశ్చంద్ర తన నటనతో కథకు మరింత భావోద్వేగాన్ని జోడించారు. మిగిలిన పాత్రల్లో సమీర్, జెమినీ సురేష్, అప్పాజీ అంబరీష్ తదితరులు తమ పరిధిలో చక్కగా నటించారు.
అబ్జెక్షన్ మై లార్డ్ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
టెక్నీకల్‌గా వెబ్ సిరీస్ బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. ప్రతి ఫ్రేమ్ కనువిందుగా ఉంది. అదే సమయంలో మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. సస్పెన్స్ అంశాలు, కోర్ట్ లో విచారణకు సంబంధించిన సమయంలో బీజీఎం అదిరిపోయింది. ఎడిటింగ్ పరంగా లోపాలున్నాయి. స్పీడప్ చేయాల్సింది. దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ బాగా సాగదీసినట్టుగా ఉంది. ఎమోషన్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. చాలా వరకు రొటీన్ ఫీలింగ్ తెప్పిస్తుంది. ట్విస్ట్ ల విషయంలోనూ మరింత కేర్ తీసుకోవాలి. నిర్మాణ విలువలకు కొదవ లేదు.
ఫైనల్‌గా
అబ్జెక్షన్ మై లార్డ్ ప్రారంభంలో కొంత భరిస్తే, ఆ తర్వాత ఎంగేజ్ చేసే సిరీస్. మహిళలకు సంబంధించి `సమ్మతి లేకుండా మహిళలను వేధించడం సరికాదు` అని చెప్పే సందేశం బాగుంది.
రేటింగ్: 2.5

