నాగ శౌర్య 'వరుడు కావలెను' మూవీ రివ్యూ
నాగశౌర్య, యువ హీరోయిన్ రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం వరుడు కావలెను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీపావళీ కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.
కథేంటి
భూమి (రీతూ వర్మ) ఓ స్టార్టప్ కంపెనీ నడుపుతూంటుంది. చాలా స్ట్రిక్ట్. ఎవరినీ ఎంటర్టైన్ చేయదు. నవ్వదు. నవ్వుతూ మాట్లాడినా ఒప్పుకునే రకం కాదు. మన్మధుడులో నాగ్ పాత్రను గుర్తు చేస్తూంటుంది. మరో ప్రక్క ఆకాష్ (నాగ శౌర్య) దుబాయిలో ఆర్కిటెక్ట్. ఓ ప్రాజెక్ట్ కోసం ఇండియాకి వచ్చాడు. ఆ క్రమంలో భూమిని కలిసాడు. ఆమె కంపెనీకు కావాల్సిన డిజైన్ గీసిచ్చాడు. ఆకాష్ ఆమెని తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రేమను ఎక్సప్రెస్ చేద్దామనుకుంటాడు. కానీ ఆమె ఆ అవకాసం ఇవ్వదు. ఈలోగా ఆకాష్ కు ఒకావిడ (నదియా) పరిచయం అవుతుంది. ఆమె తన కుమార్తెకు సంభంధాలు చూస్తూంటుంది. నదియా కూతురే భూమి. నదియాకు ఆకాష్ కు మధ్య స్నేహం ఏర్పడుతుంది.
తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నా ఆమె పడటం లేదని చెప్పి వాపోతే..తన కూతురు ఏ సంభందం కూడా ఓకే చేయటం లేదని ఆమె బాధపడుతుంది. ఇలా ఒకరికొకరు ఓదార్పు యాత్ర చేసుకుంటారే కానీ ఆ ఇద్దరి కథల్లో సెంట్రల్ క్యారక్టర్ భూమి అని తెలుసుకోరు. ఇక భూమి అలా స్ట్రిక్ట్ గా ఉండటానికి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో విఫలమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఇంతకీ భూమి గతంలో ఎవరితో ప్రేమలో పడింది..ఆకాష్ తన ప్రేమను ఆమెతో వ్యక్తపరిచాడా, చివరకు వాళ్లిద్దరూ ఒకటయ్యారా, నదియా కూతురు తన ప్రేమించే భూమి అని ఆకాష్ ఎలా తెలుసుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
స్టోరీ ఎంత సింపుల్ గా ఉంటే సినిమా అంత అందంగా వస్తుందనటంలో సందేహం లేదు. అయితే సింపుల్ అన్నారు కదా మరీ సాంపిల్ లాగా ఉంటే దాన్ని సాగతీయటానికి అదే విస్తరించటానికి సినిమా భాషలో ట్రీట్మెంట్ చేయటానికి చాలా కష్టపడాలి. డైలాగులుతో పేజీలు పేజీలు నింపుకెళ్ళాలి. అదే ఈ సినిమా కు జరిగింది. ఓ ఐదు నిముషాలు హీరో,హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటే కట్ అయ్యే కాంప్లిక్ట్ ని, ఆ అవకాసం ఇవ్వకుండా డైరక్టర్,ఆమెలోని రైటర్ కలిసి సినిమా చివరి దాకా విడతీసే ఉంచారు. ఒకరు మనస్సు విప్పుదామంటే మరొకరు అడ్డుపడతారు...లేదా ఎవరో ఒకరు అడ్డం పడతారు. అయితే లైటర్ వీన్ ఫన్ తో ,త్రివిక్రమ్ పూనినట్లుగా రాసిన డైలాగులుతో సినిమాని లాగేసారు.ఫస్టాఫ్ కార్పోరేట్ సెటప్ లో వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో సప్తగిరితో లాగ్ కామెడీ అంటూ ఫన్ చేసి ఒడ్డున పడే ప్రయత్నం చేసారు. గ్యాప్ లని టిక్ టాక్ కామెడీతో నింపేసారు.
ఏదైతేనేం ఫ్యామిలీలకు ఊ కొట్టేలా ప్యాకేజీ చేసారు. తెరని కలర్ ఫుల్ విజువల్స్ తో నింపేసి, కాన్వర్షేషన్ తో కాలక్షేపం చేసారు. ఫస్టాఫ్ లో పెద్దగా ట్విస్ట్ లు ,టర్న్ లు లేకపోయినా నడిచిపోయింది.సెకండాఫ్ లో అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎందుకు పెట్టారో అర్దం కాదు. నిజానికి రెండు ముక్కుల్లో చెప్పాల్సింది ఇరవై నిముషాలు పెట్టారు. ఆ సీన్స్ మాత్రం హారిబుల్ ..ఎందుకంటే ఆ సీన్స్ వల్ల కథలో కొత్త మలుపులేమీ రావు. ప్రేక్షకుడుకి ఆ సీన్స్ అంత డిటేల్ గా తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ప్లాష్ బ్యాక్ అయ్యాక కథలో కూడా ఏమీ జరగలేదు. ఉన్నంతలో ఫ్లాష్ బ్యాక్ తర్వాత వచ్చే సప్తగిరి లాగ్ కామెడీ సినిమాని ఒడ్డున పడేసింది. క్లైమాక్స్ మళ్లీ రొటీన్ గా ముగించారు. అంతకు మించి చేయటానికి కూడా ఏమీ లేదు.
టెక్నికల్ గా...
సినిమా కథ, కథనం కన్నా డైలాగులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ స్టైల్ లో గణేష్ రావూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కేవలం ఫన్నీ డైలాగ్స్ మాత్రమే కాకుండా మురళీ శర్మ ఆడపిల్ల లైఫ్, పెళ్లి గురించి చెప్పిన సీన్ లో డైలాగ్స్ లాంటివి అక్కడక్కడా హత్తుకునేవీ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే బాగా ఖర్చు పెట్టారు అని అర్దమవుతోంది. ప్రతీ ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉండాలని కెమెరామెన్ కష్టపడ్డారు. అలాగే మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.
డైరక్టర్ గా లక్ష్మీ సౌజన్య...ఎక్కడా ఇది తొలి సినిమా అనిపించదు. స్క్రిప్టునే మరింత బలంగా చేసుకుని ఉంటే ఇంకా బాగా సీన్స్ పండేవి. పాటల్లో తొలి సాంగ్ పరమేశ్వర చాలా బాగుంది. ఈ సాంగ్‌తో రీతూ ఎంత స్ట్రిక్ట్ పర్సన్ అనేది చూపించటం కూడా నచ్చుతుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే దిగు దిగు నాగ సాంగ్ లో కొత్త రీతు వర్మ కనిపిస్తుంది. వడ్డాణం సాంగ్ జస్ట్ ఓకే అనిపించుకుంది. రీరికార్డింగ్ కూడా బాగుంది.
నటీనటుల్లో ...నాగ శౌర్య ,రీతు ఫెరఫెక్ట్ పెయిర్ గా అనిపించారు. వెన్నెల కిషోర్ సీన్స్ నవ్విస్తాడు., ప్రవీణ్ జస్ట్ ఓకే. హర్షవర్ధన్ నెగెటివ్ రోల్‌లో కనిపించినా ఇంప్రెస్ చేసేటంత సీన్ ఆ సీన్స్ కు లేదు. కమెడీయన్ సత్య జస్ట్ ఓకే, సప్తగిరి లాగ్ కామెడీకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Varudu Kaavalenu
బాగున్నవి:
నాగ శౌర్య డ్రస్ సెన్స్, లుక్స్
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా జాగ్రత్తలు తీసుకోవటం
సాంగ్స్
బాగోలేనివి :
కథలో చెప్పుకోదగ్గ కాంప్లిక్ట్స్ లేకపోవటం
ఊహకు అందే కథనం
విసుగెత్తించే ప్లాష్ బ్యాక్
స్లో నేరేషన్
Varudu Kaavalenu
ఫైనల్ థాట్
పెళ్లి చూపులు చుట్టూ తిరిగే ప్రతీ కథ 'పెళ్లి చూపులు' సినిమా కాదు
Rating : 2.5/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Varudu Kaavalenu
తెర వెనక..ముందు
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు :నాగశౌర్య, రీతువర్మ , నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు.
మాటలు: గణేష్ కుమార్ రావూరి,
ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య