'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ!
ట్రైలర్ లో కామెడీ చూడగానే మహేష్ బాబు కాస్త 'దూకుడు'గానే ఉన్నాడని అర్దమైంది. యాక్షన్ బ్లాక్ లు చూస్తూంటే 'ఒక్కడు'గా మళ్లీ అవతరించాడని అనిపించింది. అయితే అదే సమయంలో ఇదేమిన్నా మిక్సెడ్ వ్యవహారమా అని కూడా డౌట్ తెప్పించింది.
(Review By ---సూర్య ప్రకాష్ జోశ్యుల) ట్రైలర్ లో కామెడీ చూడగానే మహేష్ బాబు కాస్త 'దూకుడు'గానే ఉన్నాడని అర్దమైంది. యాక్షన్ బ్లాక్ లు చూస్తూంటే 'ఒక్కడు'గా మళ్లీ అవతరించాడని అనిపించింది. అయితే అదే సమయంలో ఇదేమిన్నా మిక్సెడ్ వ్యవహారమా అని కూడా డౌట్ తెప్పించింది. ఫైనల్ గా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మాత్రం క్లూ ఇచ్చేసింది. దాంతో కాస్తంత ఎక్కువే ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. దర్శకుడు వాటిని ఎంత వరకూ రీచ్ అయ్యాడు.. ఇన్నాళ్లు సెకండ్ లీగ్ హీరోలతో హిట్ కొట్టి ముందుకెళ్లిన అనీల్ రావిపూడి తొలి సారి స్టార్ ని ఎలా డీల్ చేసాడు, మహేష్ లో మాస్ ఏంగిల్ ని ఏ మేరకు బయిటకు లాగి మెస్మరైజ్ చేసాడు, ఎఫ్ 2 స్దాయిలో కామెడీ చేసాడా,తనకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకున్నాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి : ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్‌బాబు) కొందరు పిల్లలను టెర్రరిస్ట్ లు కిడ్నాప్ చేస్తే ..తన టీమ్ మెంబర్స్ తో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేసి విడిపిస్తాడు. అయితే ఈ ఆపరేషన్ లో టీమ్ మెంబర్ అజయ్ (సత్యదేవ్)తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు. అతను కర్నూల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేసే భారతి(విజయ శాంతి) కుమారుడు. తన కొలీగ్ ఫ్యామిలీకు సపోర్ట్ ఇవ్వటం కోసం,ఆ న్యూస్ ని చెప్పటం కోసం అజయ్ కృష్ణ , తన కొలీగ్ రాజేంద్ర ప్రసాద్ ( ప్రసాద్) తో పాటు కర్నూలు వస్తాడు. (అప్పుడే ట్రైన్ ఎపిసోడ్ వస్తుంది).
అజయ్ కృష్ణ కర్నూల్ లో లాండ్ అయ్యే సమయానికి భారతి కొన్ని ప్రాణాంతక సమస్యల్లో ఉంటుంది. స్టేట్ మినిస్టర్ నాగేంద్రప్రసాద్ (ప్రకాష్ రాజ్) ఆమె కుటుంబాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తూంటాడు. ఆ విషయం తెలుసుకున్న అజయ్...ఆమెను ఆ సమస్యలనుంచి తప్పించే భాధ్యతను తీసుకుని ఓ కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఆ క్రమంలో నాగేంద్రతో ..అజయ్ కృష్ణ తలపడాల్సి వస్తోంది. ఇంతకీ నాగేంద్ర ఎందుకు భారతి కుటుంబంపై పగ పట్టి చంపాలనకున్నాడు. అంత శక్తివంతుడైన మినిస్టర్ ని అజయ్ కృష్ణ ఎలా దారిలోకి తెచ్చాడు..ఈ కథలో సంస్కృతి (రష్మిక) పాత్ర ఏమిటి? . వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్టార్ ఫార్ములా..సేఫేనా : అనిల్ గత చిత్రాలు హిట్ అయ్యాయి కానీ ఆయన ఎంచుకునే కథల్లో పెద్దగా బలం లేక తేలిపోయాయి. థియేటర్ లో కూర్చున్నంతసేపు ...కామెడీ చేస్తూ… హీరో హీరోయిన్లకి కొన్ని మ్యానరిజమ్స్ పెట్టి ఎంగేజ్ చేస్తూ లాక్కెళ్లిపోతున్నాడు.విలన్, హీరో ఫార్ములాతో పాసైపోతున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు తో చేసేటప్పుడు ఆ లోపాలను సరిచేసుకుని స్క్రిప్టు రాసుకుంటాడని ఎక్సపెక్ట్ చేస్తాం. కానీ అనీల్ రావిపూడి అంత సీన్ లేదు..నేనింతే అని తేల్చేసాడు.
ఈ సినిమాలో చెప్పుకోదగిన స్దాయిలో కథ లేదు. సరే సినిమా ఆడటానికి కావాల్సింది కథ కాదు కదా అని సరిపెట్టుకుందామంటే దాన్ని సైతం ఆఖరి అరగంట దాకా దాస్తాడు. ప్రీ క్లైమాక్స్ కు వెళ్లిపోతూండగా...ఇదీ కథ అని తేలుస్తాడు.. ఫస్టాఫ్ వరకు ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో(కథకు సంబందం లేకపోయినా) లాగించేసి ఒడ్డునపడ్డాడు. కానీ ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ ట్రైన్ ఎపిసోడ్ కూడా కథలో భాగం కాకపోవటంతో ఓ టైమ్ వచ్చేసరికి ఇంక అవదా అనే స్దాయిలో విసుగొచ్చింది.అయితే ఇంటర్వెల్ కు దగ్గర వచ్చే ఎపిసోడ్ తో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా లేచింది. అయితే సెకండాఫ్‌లో ఆ ప్లో మెయింటైన్ చేయలేకపోయాడు.దాంతో సెకండాఫ్ కాస్త స్లో అయిందనే చెప్పాలి.
అలాగే మహేష్ అభిమానులకు పండగ చేయాలని, ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ కూర్చుకుంటూ కథ అల్లుకున్నాడు. దాంతో ప్రారంభం ఓ యాక్షన్ ఎపిసోడ్..ఇంటర్వెల్ మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్..మధ్యలో కామెడీ ఎపిసోడ్. సెకండాఫ్ లో కాస్తంత ఎమోషన్...మళ్లీ కామెడీ, యాక్షన్...ఇలా ఓ పాట్రన్ ఫాలో ఫిక్సైపోయి కథ నడిపేసారు. పంచ్ డైలాగులు, ఫైట్స్ తో హీరోయిజం చూపించాలనుకున్నాడు కానీ విలన్ కు, హీరోకు మధ్య సరైన కాంప్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేద్దామనుకోలేదు. దాంతో హీరో.. యాక్టివ్ గా ఉండే ప్యాసివ్ పాత్రలా మారాడు. అయితే అలాంటి లోపాలు హైలెట్ కానివ్వకుండా చేసే మంత్రదండం అతని దగ్గర ఉంది. ...ఎక్కడైనా సినిమా డ్రాప్ అవుతోందంటే...మరుక్షణమే..పాటో,ఫైటో,కామెడీ బిట్టో...ఏదో ఒక ఎలిమెంట్ తో లేపి నిలబెట్టేసాడు.
అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆ స్పీడ్ పడిపోయింది. సినిమాకు సరిపడ క్లైమాక్స్ సెట్ చేయలేదు. ఇంటర్వెల్ ని దాటే యాక్షన్ ఎపిసోడ్ పడితే వేరే విధంగా ఉండేది. అయితే మైండ్ బ్లాక్ సాంగ్ ఫెరఫెక్ట్ టైమ్ లో పెట్టడం, మహేష్ లుంగీ స్టెప్స్ కూడా ఆ లోటుని కొంతవరకూ భర్తి చేసి ఫాన్స్ కి ఫుల్ మీల్స్ అందించారు. స్టార్ కాస్ట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ సినిమాకు ఓ లుక్ తెచ్చేసాయి. సంక్రాంతికి సరైన పోటీ లేకపోతే ఈ సినిమా పరుగుని ఆపేవాళ్లు ఉండరు.
మహేష్..మిగతావాళ్లు : ఇక మహేష్ బాబు మాత్రం తన వంతుగా దుమ్ము దులిపేసాడు. ఫుల్ ఎనర్జీతో దూసుకుపోయాడు. వరసపెట్టి సీరియస్ పాత్రలు చేస్తున్న మహేష్ ని ఇలా జోష్ తో చూడటం రిప్రెషే. మిలిట్రీ ఎపిసోడ్స్ లో, ఎమోషనల్ బ్లాక్ లలో తనేంటో చూపించాడు. రష్మిక చేత ఎందుకనో కానీ ఓవర్ యాక్షన్ చేయించారు. ఆమెతో ఉన్న సీన్స్ లౌడ్ గా ఉన్నాయి. విజయశాంతి పాత్రకు తగ్గట్లు హుందాగా ఉంటే దొంగగా చేసిన బండ్ల గణేష్ తేలిపోయాడు. ప్రకాష్ రాజు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్,రావు రమేష్ వంటివారు చల్తా హై.
టెక్నికల్ గా.. : సినిమా లో సరైన స్ట్రాంగ్ పాయింట్ లేకుండా, డెప్త్ లేని(తన) కథతో ఈ స్దాయి లాక్కురావటం దర్శకుడుగా అనీల్ రావిపూడి గొప్పతనమే. అలాగని అనీల్ నుంచి ఆశించే ఎఫ్ 2 స్దాయి కామెడీ అయితే మనకు ఈ సినిమాలో అంత ఎక్కువగా దొరకదు. సెకండాఫ్ లో ఎమోషన్స్ పైనే ఎక్కువగా ఆధారపడిపడ్డాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ..రెండు పాటలు ఇప్పటికే పెద్ద హిట్. పాటలు కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. ఆయన పనితనం ట్రైన్ సీన్ లలో మెచ్చుకోదగిన రీతిలో ఉంది. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. కాస్ట్యూమ్స్ డిపార్టమెంట్ బాగా హైలెట్ అవుతుంది. అలాగే మహేష్ వంటి స్టార్ సీన్ లో ఉంటే ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాట్లాడుకునే పనేముంది.
ఏవి హిట్ : ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కామెడీ టైమింగ్, కొండారెడ్డి బురుజు సెంటర్ ప్రకాశ్ రాజ్, మహేష్ కు మధ్య వచ్చే సీన్, “కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర అల్లురి సీతారామ రాజు ని చూసానన్నా….” అనే డైలాగు, రాజకీయ నాయకుల అవినీతిపై మహేష్ స్పీచ్, విజయ శాంతి గ్రేస్, ఫెరఫార్మెన్స్, ఇంట్రవెల్ బ్లాక్, మిలట్రీ బ్యాక్ డ్రాప్ సీన్స్, విజయశాంతి, మహేష్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, మైండ్ బ్లాక్, డాంగ్ డాంగ్ సాంగ్స్.
ఏవి ఫట్ : ముందే ఊహించగలిగే విధంగా ఉన్న కథ,కథనం( స్క్రీన్ ప్లే), క్లైమాక్స్, హైప్ చేసిన స్దాయిలో ఫన్ లేకపోవటం, రన్ టైమ్ ఎక్కువ అవటం
ఫైనల్ థాట్ : సంక్రాంతికు ‘సరిలేరు నీకెవ్వరు’ ఓ సరదా కమర్షియల్ సినిమా. అంతకు మించి ఎక్సపెక్ట్ చేయద్దమ్మా.
Rating: 3/5