`మద గజ రాజ` మూవీ రివ్యూ, రేటింగ్
విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ జంటగా నటించిన `మద గజ రాజ` మూవీ ఈ శుక్రవారం తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

విశాల్ నటించిన `మద గజ రాజ` సినిమా దాదాపు 12ఏళ్ల తర్వాత విడుదలైంది. అనేక ఆర్థిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ సంక్రాంతికి తమిళంలో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. ఊహించని విజయంతో సుమారు రూ. 50కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు దీన్ని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
నేడు శుక్రవారం(జనవరి 31)న విడుదలైంది. ఈ చిత్రంలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంతానం, మనోబాలా, సోనూసూద్ కీలక పాత్రలు పోషించారు. సుందర్ సీ దర్శకత్వం వహించగా, ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందించడం విశేషం.
జెమినీ ఫిల్మ్ సర్య్కూట్ పతాకంపై అక్కినేని మనోహర్ ప్రసాద్, అక్కినేని ఆనంద్ ప్రసాద్, ఏసీ షణ్ముగం, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. తెలుగులో దీన్ని సత్య కృష్ణ ప్రొడక్షన్ విడుదల చేసింది. ఈ శుక్రవారం తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
రాజా అలియాస్ మద గజ రాజ అలియాస్ ఎంజీఆర్ (విశాల్) ఓ చిన్న ఊర్లో కేబులు టీవీ నడిపిస్తుంటాడు. తండ్రి రిటైర్ మెంట్‌కి దగ్గరగా ఉన్న ఇన్‌స్పెక్టర్. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి వస్తున్న నేరస్థుడికి ప్రాణహానీ ఉందని చెప్పి తాను సేఫ్‌గా తీసుకువస్తాడు రాజ. ఆ నేరస్థుడి కూతురు మాధవి(అంజలి)కి తొలి చూపులోనే పడిపోతాడు. దీంతో వారిని తన ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు.
కట్ చేస్తే మాధవి తండ్రికి, రాజ తండ్రికి గొడవ అయి మాధవి వెళ్లిపోతుంది. ఆ బాధలో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి మాస్టర్ ఇంట్లో పెళ్లికి ఆహ్వానం వస్తుంది. చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరిని ఆహ్వానించడంతో పాత ఫ్రెండ్(సంతానం)తోపాటు ఇతర స్నేహితులు అంతా కలుస్తారు. పెళ్లిని బాగా ఎంజాయ్ చేస్తారు.
ఈ సందడి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిపోవాలనుకున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుంటాడు రాజ. దానికి కారణం పొలిటీషియన్, తెరవెనుక ప్రభుత్వాలను నడిపించే మీడియా అధినేత కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) హస్తం ఉందని తెలుస్తుంది. దీంతో అతనికి బుద్ది చెప్పి ఫ్రెండ్స్ ని సేవ్ చేయాలని బయలు దేరుతాడు రాజ.
మరి స్టేట్ మొత్తాన్ని ఆడించే బిగ్ షాట్‌తో రాజ ఎలా పోరాడాడు? దీనికి మంత్రి సత్తిపండు(మనోబాలా)ని ఎలా వాడుకున్నాడు? మరి మాయ(వరలక్ష్మి శరత్ కుమార్)తో రాజాకి ఉన్న లవ్ ట్రాక్ ఏంటి? చివరికి తన ఫ్రెండ్స్ కి రాజా న్యాయం చేశాడా? కాకర్లని ఎలా దెబ్బకొట్టాడు అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
విశాల్ సినిమాలు ఇటీవల ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు. తెలుగులో చాలా కాలంగా డిజప్పాయింట్ చేస్తున్నారు. పైగా ఇటీవల ఆయన అనారోగ్యంతో కనిపించి అందరిని ఆందోళనకు గురి చేశారు. అయినా `మద గజ రాజ` మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని తన కమిట్‌మెంట్‌ని చాటుకున్నారు. 12ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్న సినిమాని బతికించే ప్రయత్నం చేశారు.
సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ మూవీ అక్కడ పెద్ద హిట్ అయ్యింది. విశాల్‌తోపాటు అందరికి పెద్ద బూస్ట్ ఇచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా విశేషంగా ఆకట్టుకుంది. మరి అదే మ్యాజిక్ తెలుగులో జరిగిందా? అనేది చూస్తే ఇక్కడ కూడా ఆ మ్యాజిక్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా 12ఏళ్ల క్రితం రూపొందించినా, కథ పరంగారొటీన్‌గానే ఉన్నా, కామెడీ మాత్రం ఎవర్ గ్రీన్. ఇప్పటికీ అదే నవ్వులు పూయించగలిగేలా ఈ సినిమా ఉండటం విశేషం.
ఇప్పుడు హర్రర్ సినిమాల వెంటపరిగెడుతున్న దర్శకుడు సుందర్ సీ `మద గజ రాజ`ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు. అప్పటి కామెడీతో ఇప్పటి ఆడియెన్స్ ని కూడా అదే స్థాయిలో నవ్వించడంలో సక్సెస్ అయ్యాయి.
కథ పరంగా చూస్తే కొత్తగా ఏం ఉండదు, 12ఏళ్ల నాటి మూవీ అంటే కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో కామెడీ ఎలిమెంట్లని బాగా రాసుకున్నారు దర్శకుడు. ముఖ్యంగా సంతానం పాత్రని హిలేరియస్‌గా రాసుకున్నారు. ఆయన వేసే పంచ్‌లు ఇందులో హైలైట్. ప్రారంభం నుంచి, ఎండింగ్ వరకు పంచ్‌లతో కడుపుబ్బ నవ్వించాడు.
మొదటి భాగంలో సంతానం రెచ్చిపోతే, రెండో భాగంలో మనోబాలాని వాడుకున్నారు. ఆయన పాత్ర హిలేరియస్‌గా ఉంటుంది. ఎండింగ్ వరకు బ్యాక్ టూ బ్యాక్ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో కథని మలుపుతిప్పే పాత్రనే మనోబాలాది. ఆయన జస్ట్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాని నడిపించాడు. అటు కాకర్లకి చెమటలు పట్టిస్తూ, ఇటు ఆడియెన్స్ కి నవ్వులు పూయించారు.
చాలా కాలం తర్వాత సంతానం కామెడీ సినిమాకి మరో హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన హీరో రాణిస్తున్న నేపథ్యంలో వింటేజ్ సంతానంని చూపించారు. వీటితోపాటు అంజలితో లవ్ ట్రాక్ మరో ఆకర్షణగా నిలుస్తుంది. వాళ్ల తండ్రిని కాపాడే సీన్లలోనూ ఫన్ జనరేట్ అయ్యింది. ఇంకోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు పవర్‌ఫుల్ రోల్స్ తో ఆకట్టుకుంటుంది. కానీ ఇందులో గ్లామర్ పాత్రతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. పూర్తి గ్లామరస్‌గా కనిపించి మతిపోగొట్టింది.
వరలక్ష్మిని ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె ట్రాక్ కూడా హిలేరియస్‌గా ఉంటుంది. అటు గ్లామర్ ట్రీట్‌తోపాటు కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. సినిమాలో ఫ్రెండ్స్ కోసం నిలబడే హీరో తత్వం మరో ఆకర్షణ. ఇది మంచి సందేశం కూడా. కానీ ఇప్పటి జనరేషన్‌కి ఇది కాస్త బోరింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఓ ఇరవై ఏళ్ల క్రితమే చాలా వచ్చాయి.
ఇక సోనూ సూద్‌తో హీరో టామ్ అండ్ జెర్రీ ఫైట్ రెగ్యూలర్‌గా, రొటీన్‌గానే, దాన్ని సంతానం పంచ్‌లు, మనోబాలా కామెడీ, వరలక్ష్మి అందాలు, అంజలి లవ్ ట్రాక్ డామినేట్ చేస్తాయి. అవి సినిమాని హిలేరియస్ గా మార్చాయి. దీంతో ఇది టైమ్‌తో సంబంధం లేకుండా, జనరేషన్‌తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది.
నటీనటులుః
మద గజ రాజ పాత్రలో విశాల్ ఇరగదీశాడు. ఓ వైపు లవ్ ట్రాక్‌ని, మరోవైపు ఫ్రెండ్స్ కి విలువ ఇవ్వడం, వారి కోసం సోనూ సూద్ తో పోరాడటం వంటి సీన్లలో అదరగొట్టాడు. నటన పరంగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఈజీగా చేసుకుంటూ వెళ్లాడు. సినిమాకి మరో బలం సంతానం. ఆయన మరోసారి విశ్వరూపం చూపించారు. తనదైన పంచ్‌లతో సినిమాని హిలేరియస్‌గా మార్చారు. మనోబాలా సెకండాఫ్‌ని నిలబెట్టాడు. ఎక్స్ ప్రెషన్స్ తో కడుపుబ్బా నవ్వించారు. సోనూ సూద్ విలనిజం ఆకట్టుకుంటుంది.
ఇక అంజలి, వరలక్ష్మి విషయంలో దర్శకుడు వీరిని లవ్ ట్రాక్ ల కంటే గ్లామర్ సైడ్ బాగా చూపించేందుకు ఫోకస్ పెట్టినట్టుంది. అంజలి సిన్సియర్ లవర్‌గా, వరలక్ష్మి అందంతో రెచ్చగొట్టే లవర్‌గా ట్రాక్‌లు పెట్టి ఆద్యంతం రక్తికట్టించారు. అందులో ఈ ఇద్దరు కూడా రెచ్చిపోయారు. సుబ్బరాజు, మణివణ్ణన్ పాత్రలు ఓకే అనిపిస్తాయి. సదా, ఆర్య, షకీలా మెరుపులు స్పెషల్ ఎట్రాక్షన్.
టెక్నీషియన్లుః
రిచ్చర్డ్ ఎం నాథన్ కెమెరా వర్క్ చాలా బాగుంది. విజువల్స్ ఇప్పటికీ అదే ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చాయి. క్వాలిటీ పరంగా కొదవలేదు. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్. పాటలు ఉర్రూతలూగించేలా ఉన్నాయి. బీజెఎం కూడా బాగుంది. ప్రవీణ్ కేఎస్, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సినిమాని చాలా క్రిస్పీగా కట్ చేశారు. హైలైట్ అయ్యే సీన్లని పెట్టి, మిగిలిన ఎపిసోడ్లని లేపినట్టు కనిపిస్తుంది.
అందుకే అక్కడక్కడ లింకులు మిస్ అయ్యాయి. దర్శకుడు సుందర్ సీ డైరెక్టర్ పరంగా అదిరిపోయింది. రెగ్యూలర్ కమర్షియల్ సినిమానే తీసినా, కామెడీనే నమ్ముకున్నారు. అదే సినిమాకి బలం. అయితే సినిమాని బ్లాక్ బ్లాక్‌లుగా సెట్ చేసుకుంటూ వచ్చినట్టుగా ఉంటుంది. ఏది పేలుతుందో అవే ఎపిసోడ్లని ఉంచి, మిగిలినదంతా కట్ చేసినట్టుగా ఉంటుంది.
అదే సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. తెలుగు డైలాగుల్, పంచ్‌లు చాలా సహజంగా ఉన్నాయి. తెలుగు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ప్రొడక్షన్ పరంగా నిర్మాణ విలువలకు కొదవలేదు.
ఫైనల్‌గాః ఫస్టాఫ్ సంతానం.. సెకండాఫ్ మనోబాలా.. నవ్వులే నవ్వులు. లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా.
రేటింగ్‌ః 2.75