#LifeofMuthu: శింబు “ది లైఫ్ ఆఫ్ ముత్తు” రివ్యూ
ఇదొక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్. ఒక చిన్న పల్లెలో జీవించే వ్యక్తి చీకటి ప్రపంచంలోకి ఎలా వచ్చాడు? ఆ ప్రపంచం నుంచి బయట పడటానికి అతడు ఏం చేశాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ముత్తు జీవితంలో చీకటి కోణం ఉంది. అలాగే… లవ్, రొమాన్స్, యాక్షన్ కూడా ఉన్నాయి.
Life of Muthu
చాలా కాలం తర్వాత శింబు కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన కొత్త చిత్రం 'వెందు తానిండదు కాదు' ను తెలుగులో కొంచెం ప్లాన్ చేసి రిలీజ్ చేయించాలని ప్లాన్ చేసాడు. లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో ఈ సినిమాను డబ్ చేశారు.ఉన్నంతలో ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. కానీ తమిళంతో పాటుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయించడం మాత్రం కుదరలేదు. గురువారమే విడుదల కావాల్సిన సినిమా.. రెండు రోజులు వాయిదా పడింది. శనివారం అయినా సరిగ్గా బజ్ క్రియేట్ చేసేలా సినిమా రిలీజైందా అంటే అదీ లేదు. టెక్నికల్ ఇష్యూల కారణంగా మార్నింగ్ షోలు పడలేదు. ఆ తర్వాత మెల్లిగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది..ఏమన్నా హిట్ కొట్టగలిగిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథాంశం:
విధి మనం ఎదగటానికి మన చుట్టూ విరోధులను ఉంచుతుంది. ముత్తు (శింబు) పరిస్దితి కూడా అదే. చదువుకున్నాడు ..కానీ తన ఉన్న చిన్న పల్లెలో బ్రతుకు దెరువు లేదు. ఏం చేయాలి....అందుకే పల్లె దాటి పట్నం వచ్చాడు. ముంబై మహాపట్నం చేరాడు. అక్కడ ఎక్కువ శాతం తనలాంటి వాళ్లే. రోజు వారి జీవనం కోసం ఒక పరోటా స్టాల్‌లో చిన్నపనికి కుదురుతాడు. కొద్ది రోజులుకు , ఆ స్టాల్ లో కేవలం పరోటాలే కాదు..మనుషులు ప్రాణాలు తీసే వ్యక్తులు ఉన్నారని అర్దం అవుతుంది. ఒక్కసారి వలయం లోకి వచ్చాక తప్పించుకోలేము. ఆ స్టాల్ యజమానికి అండర్ వరల్డ్‌తో ఉన్న సంబంధాల గురించి తెలిసాక ఏం చేయగలడు...చుట్టూ జరుగుతున్న మర్డర్స్...తనకు తెలిసున్న వారు చనిపోతున్నారు. పారిపోవాలనుకున్నాడు.
కానీ ప్రారబ్దం అతన్ని తనతో పాటు తన ఊరు నుంచి తెచ్చుకున్న గన్ పట్టించింది. అంతే ఆ తర్వాత పరిణామాలు వరసగా జరిగిపోయాయి. తెలిసే సరికే గ్యాంగ్ వార్స్ లో తనూ తెలియకుండా భాగమైపోయాడు. అలాగే అతను అక్కడే ఓ అమ్మాయి పావని (సిద్ధి ఇద్నాని)తో ప్రేమలో పడతాడు. లోకల్ డాన్ కు రైట్ హ్యాండ్ గా మారాక అతని జీవితమే మారిపోయింది. చాలా అతని దగ్గరకు కోరకుండానే వచ్చాయి. కానీ అందుకోసం తనకు అత్యంత ఇష్టమైన వాటిని పణంగా పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ముత్తు ఏం చేశాడు ? తన ప్రేమ కథను ముందుకు తీసుకెళ్లాడా..డాన్ గా ఎదిగిన అతని ప్రస్తానం ఎలా కొనసాగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ గ్యాంగస్టర్ కథలు అన్నిటికి ఒకటే స్టోరీ లైన్ ఉంటుంది. అనుకోకుండా క్రైమ్ ప్రపంచంలోకి వెళ్లినవాడు బయిటపడగలడా...గౌరవంగా తన జీవితాన్ని కొనసాగించగలడా?... అని. ఈ కథకూడా దాదాపు అలాంటిదే.ఇలాంటి వర్మ సత్య, ధనుష్ ధూల్ పేట వంటి కథలు మనకు కొత్తేమీ కాదు. అయితే ఇది ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ అందించిన కథ తో చేసిన సినిమా కావటంతో ఆసక్తి కలుగుతుంది. జయమోహన్ కథలో శ్రీధర్ (నీరజ్) అనే పాత్రను ప్రవేశపెడతాడు. ముత్తు ఏ రోజైతే సిటీలో ప్రవేశించాడో..అదే రోజు అతనూ ఆ రోజే వస్తాడు. కానీ తనకు రక్తం మరక అంటకుండా సర్వైవ్ అవగలుగుతాడు. అంటే విధి ఎవరి జీవితం ఎలా నిర్ణయిస్తే అలా ప్రయాణించాల్సిందే అన్న ఫిలాసఫీ అండర్ కరెంట్ గా నడుస్తుంది.
Vendhu Thanindhathu Kaadu
గన్ తో ముత్తు తలరాత మారింది అనేది చెప్తాడు. ముళ్ల దారిలో ముత్తు పాత్రను రక్త ప్రయాణం చేయిస్తాడు. అయితే అక్కడదాకా బాగానే ఉంది కానీ గౌతమ్ మీనన్ సినిమాల నుంచి ఎక్సపెక్ట్ చేసే లవ్ స్టోరీ మాత్రం ఫెయిలైంది. లవ్ స్టోరీ మనకు కనెక్ట్ కాదు. కమింగ్ ఏజ్ కథని గ్యాంగస్టర్ డ్రామా మోడ్ లో చెప్దామనే ప్రయత్నం అంత హర్షనీయంగా సమర్దించేలా ఉండదు. దానికి తగినట్లు స్లో నేరేషన్ . తెలిసి ఉన్నట్లు అనిపించే కథ పెద్దగా ఇంట్రస్ట్ కలగనివ్వవు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ఆసక్తికరంగా అనిపించటంతో అలా అలా నడిచిపోతుంది. ఏదైమైనా సహజంగా అనిపించ నేరేషన్ లో లార్జన్ దేన్ లైఫ్ రౌడీ కథలు చెప్పడం చాలా కష్టం. రెండూ సింక్ కావు. ఏదైమైనా స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ జరిగితేనే ఇలాంటి కథలు బ్రతుకుతాయి.
Vendhu Thanindhathu Kaadu
టెక్నికల్ గా ...
స్క్రిప్టు విషయం ప్రక్కన పెడితే... దర్శకుడుగా గౌతమ్ వాసుదేవ మీనన్ ...మనుష్యల్లో ఉండే కర్కశత్వం, ఒక చోటు నుంచి మరొకట చోటుకు మైగ్రేట్ అయిన జనాల మానసిక స్దితి..వారు ఒడ్డున పడ్డ చేపలా ఇబ్బంది పడే తీరు..ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. టైట్ ఫ్రేమ్స్ తో పాత్రల ఆలోచనలను వారి ఎక్సప్రెషన్స్ తో మనలోకి ఎక్కించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా ముత్తు పాత్ర అంతర్గత మధనం చూపే తీరు బాగుంటుంది. ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రతీ క్యారక్టర్ కు థీమ్ మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. కెమెరా వర్క్ చేసిన సిద్దార్ద నూని...వర్క్ మనకు అనురాగ కశ్యప్ బోంబే వాలెట్ ని గుర్తు చేస్తుంది. చాలా బాలెన్సెడ్ గా నడుస్తుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా అద్బుతంగా ఉంది.ఎడిటింగ్ లో ఓ అరగంట లేపేయచ్చు అనే ఫీలింగ్ కలిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ డైలాగులు ఓకే.
Vendhu Thanindhathu Kaadu
నటీనటుల్లో..
ఈ సినిమాకు మెయిన్ ఫిల్లర్ హీరో శింబు అలియాస్ శిలంబరసన్. అతను ముత్తు కథని పూర్తిగా అర్దం చేసుకుని పరకాయ ప్రవేశం చేసాడు. తనను తాను పూర్తిగా 180 డిగ్రీల్లో మార్చుకుని కష్టపడ్డాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. సినిమాలో తన లుక్ మూడు, నాలుగు వేరియేషన్స్‌లో కనిపిస్తుంది. ఇక గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో సిద్ధి ఇద్నాని పేరు తమిళనాట బాగా వినిపిస్తోంది. మరి 'ముత్తు' తెలుగులోనూ అమ్మడికి మంచి ఆఫర్స్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. మిగతా ఆర్టిస్ట్ లు సీజనల్ గా చేసుకుంటూ పోయారు.
vendhu thanindhathu kaadu
ఫైనల్ థాట్:
గౌతమ్ మీనన్ మత్తులో ఉండేవారికి ఈ ముత్తు ...గమ్మత్తుగా నచ్చేస్తుంది. లేనివాళ్లకు తమిళ డబ్బింగ్ సినిమాని తమిళంలోనే చూస్తున్నట్లు అనిపిస్తుంది.
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
vendhu thanindhathu kaadu
బ్యానర్: వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
నటీనటులు: శింబు, సిద్ది ఇద్నానీ, రాధికా శరత్ కుమార్, సిద్దిఖ్ తదితరులు
కథ: బీ జయమోహన్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాత: ఇషారీ కే గణేష్
సినిమాటోగ్రఫి: సిద్దార్థ నూని
ఎడిటింగ్: ఆంథోని
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
Run Time: 2గం 54ని
రిలీజ్ డేట్: 2022-09-17