- Home
- Entertainment
- Movie Reviews
- Jinn Movie Review: జిన్ మూవీ రివ్యూ.. హర్రర్ సినిమాల్లో ఇది వేరే లెవల్
Jinn Movie Review: జిన్ మూవీ రివ్యూ.. హర్రర్ సినిమాల్లో ఇది వేరే లెవల్
Jinn Movie Review: ఈ శుక్రవారం చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా డిఫరెంట్ హర్రర్ మూవీగా `జిన్` విడుదలైంది. అమిత్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

జిన్ మూవీ రివ్యూ
హర్రర్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కంటెంట్ బాగుండి భయపెట్టే సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ వీటిని బాగా చూస్తారు. ఎలా ఉన్నా మినిమమ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. అందులో భాగంగా ఈ శుక్రవారం `జిన్` అనే మూవీ వచ్చింది. సరికొత్త హర్రర్ మూవీగా దీన్ని రూపొందించారు దర్శకుడు చిన్మయ్ రామ్. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ పతాకాలప నిఖిల్ ఎం గౌడ నిర్మించారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడలో రూపొందిన ఈ మూవీని డబ్ చేసి తెలుగులో అదే పేరుతో నేడు శుక్రవారం(డిసెంబర్ 19)న విడుదల చేశారు. మరి ఈ హర్రర్ చిత్రం తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
జిన్ మూవీ కథ
ఓ కాలేజీ లైబ్రరీలో ఓ స్టూడెంట్ బుక్స్ చదువుతూ నిద్రపోతాడు. లేచి చూస్తే రాత్రి అవుతుంది. కాలేజ్ క్లోజ్ అవుతుంది. ఆ రాత్రి ఆ కాలేజీలోనే ఉంటాడు. కానీ వింత శబ్దాలు, వింత మనుషులు ఆయన్ని వెంటాడుతుంటాయి. దీంతో ఆ రాత్రి ఆ కాలేజీలోనే అపస్మారక స్థితిలో పడిపోతాడు. కట్ చేస్తే నలుగురు ఫ్రెండ్స్ ఎగ్జామ్ కోసం ఆ కాలేజీకి ఒకే కారులో వెళ్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత పక్కనే ఉన్న పెద్ద చెరువు వద్దకు వెళ్తారు. అక్కడ వింత అనుభవాలను ఫేస్ చేస్తారు. వింత మనుషులను చూస్తారు. దీంతో భయపడి అక్కడి నుంచి కారులో వెళ్లిపోతుండగా యాక్సిడెంట్ అవుతుంది. వీరు ప్రయాణించే కారు చెట్టుని ఢీ కొట్టుంది. ఈ నలుగురు కోమాలోకి వెళ్తారు. కానీ పెద్దగా గాయాలు కావు, కారు కూడా డ్యామేజ్ కాదు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. ఇది మామూలు యాక్సిడెంట్ కాదు, ఏదో సైతాన్ వల్లే జరిగిందని అనుమానిస్తారు. దీంతో ఢిల్లీ నుంచి మౌళి(అమిత్ రావు) అనే పేరుమోసిన మంత్రగాడిని పిలిపిస్తారు. ఆయన ఈ ఘటనని విచారించగా ఆశ్చర్యకరమైన సంఘటనలు బయటకు వస్తాయి. అదే సమయంలో కోమాలో ఉన్న ఈ నలుగురు కుర్రాళ్ల ఆత్మలు కాలేజీలో ఇరుక్కుపోతాయి. అది ఎలా జరిగింది? దీనికి కారణం ఎవరు? దీని వెనుక కథేంటి? ఈ కుర్రాళ్ల ఆత్మలు బాడీలోకి రావడానికి ఏం చేశారు? చివర్లో ట్విస్ట్ ఏంటనేది మిగిలిన సినిమా.
జిన్ మూవీ విశ్లేషణ
`జిన్` మూవీ హర్రర్ చిత్రాల్లో ఇదొక విభిన్నమైన మూవీ. ఇప్పటి వరకు మనం చాలా వరకు హిందూ బేస్డ్ దెయ్యాలను, హర్రర్ సినిమాలను చూశాం. ఇది కాస్త ముస్లిం కమ్యూనిటీ టచ్ ఉన్న హర్రర్ మూవీ కావడం విశేషం. ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. సూపర్ నేచురల్ పవర్స్ ని బేస్ చేసుకుని, ఆత్మల కథ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇలాంటి సినిమా మన తెలుగులో రాలేదనే చెప్పాలి. అందుకే కథ పరంగా చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ కూడా. అంత ఈజీగా అర్థం కాదు. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. కాలేజీ లైబ్రరీలో కుర్రాడు ఉండటం, ఆ కాలేజీ కింద ఆత్మలు తిరగడం, ఆయనకు వింత శబ్దాలు వినిపించడం, స్టూడెంట్ తోపాటు, నలుగురు కుర్రాళ్లు ఒకే కాలేజీలో ఉండటం, వీళ్లు ఆత్మలుగా తిరగడం, ఈ రెండు కథలను మిక్స్ చేసిన తీరు చూస్తే వాహ్ అనిపిస్తుంది. అసలు ఊహకందని విధంగా ఉంటుంది. ఇలాంటి కథలు రాయడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు ఆలోచనకి హ్యాట్సాప్ చెప్పాలి. అయితే ఆయా అంశాలను తీసుకెళ్లిన తీరు కూడా విభిన్నంగా ఉంది. కాకపోతే క్లారిటీ మిస్ అయ్యింది. ఏం చెప్పాలనుకున్నారు? ఏం చూపించాలనుకున్నారనే క్లారిటీ మిస్ అయ్యింది. దీంతో ఆడియెన్స్ లో కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇందులో జిన్ అనే ఆత్మలకు సంబంధించిన ప్రత్యేకతని చెప్పడం బాగుంది. భయ పెడుతూనే ఎంగేజ్ చేసిన తీరు బాగుంది. అయితే సినిమా కథనాన్ని మరింత క్లారిటీగా రాసుకోవాల్సింది. విజువల్స్ పరంగానూ క్వాలిటీ మిస్ అయ్యింది. ఫస్టాఫ్‌లో చాలా సీన్లు ఏమాత్రం మెప్పించేలా లేవు. బోరింగ్‌గా అనిపిస్తాయి. ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. సెకండాఫ్ తర్వాత కాస్త ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది. ఎండింగ్‌లో మౌళి పాత్ర ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. దీనికి రెండో పార్ట్ కూడా ఉంది. దానికి సంబంధించి చూపించిన విజువల్స్ బాగున్నాయి. అంచనాలు పెంచేలా ఉన్నాయి.
ఎవరెవరు ఎలా చేశారంటే?
ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. నలుగురు కుర్రాళ్లు అదరగొట్టారు. మౌళి పాత్రతో సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన అమిత్ రావు సినిమా అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకున్నారు. మూవీకి ఆయనే హీరో అని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. కళ్లతోనే మెప్పించాడు. పర్వేజ్ సింబా తన నటనతో ప్రేక్షకుల్ని నవ్వించాడు. ప్రకాష్ తుమ్మినాడ్ కూడా మెప్పించారు. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపించాయి.
టెక్నీకల్‌గా చూస్తే.. మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా బీజీఎం సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అలెక్స్ ఆర్‌ఆర్‌తో సినిమాని నిలబెట్టారు. సునీల్ హోన్నాలి కెమెరా వర్క్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. విజువల్స్ క్లారిటీ మిస్ అయ్యాయి. కీర్తి రాజ్ డి ఎడిటింగ్ పరంగానూ ఇంకా వర్క్ చేయాల్సింది. చాలా సీన్లలో క్లారిటీ మిస్ అయ్యింది. ముఖ్యంగా దర్శకుడు చిన్మయ్ రామ్ ఎంచుకున్న కథ బాగుంది. కానీ దాన్ని అంతే బాగా, ఆడియెన్స్ కి కనెక్ట్ చేసేలా రూపొందించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. స్క్రీన్ పరంగా మరింత వర్క్ చేయాల్సింది. కానీ క్లైమాక్స్ ని బాగా డీల్ చేశాడు. అదే ఫోకస్ ప్రారంభం నుంచి పెడితే అదిరిపోయే సినిమా అయ్యేది.
ఫైనల్‌గా
హర్రర్ చిత్రాల్లో ఇదొక డిఫరెంట్ మూవీ. కొత్తదనం ఇష్టపడేవారికి నచ్చే మూవీ అవుతుంది.
రేటింగ్ 2.5
