- Home
- Entertainment
- Movie Reviews
- Hanuman Ansh Telugu Review: హనుమాన్ అంశ్ మూవీ రివ్యూ.. నీమ్ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Hanuman Ansh Telugu Review: హనుమాన్ అంశ్ మూవీ రివ్యూ.. నీమ్ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Hanuman Ansh Review: హనుమాన్ భక్తుడు, దేవుడిగా కొలువొందుతున్న నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన `హనుమాన్ అంశ్` మూవీ తెలుగులోనూ విడుదలైంది. నార్త్ లో సంచలనం సృష్టించిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యిందా?

హనుమాన్ అంశ్ మూవీ రివ్యూ
హనుమాన్ అంశ్ (Hanuman Ansh) నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన హిందీ బయోగ్రాఫికల్ డివోషనల్ డ్రామా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో విడుదలై మంచి బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా, రాగిని సోనా, నమ్రత జి సింగ్, అనుప్రియా ఏ నగర్, విశాల్ చతుర్వేది నిర్మించారు. ఇందులో బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు. ఆగస్ట్ 7న హిందీలో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రెండు కోట్లతో రూపొంది నాలుగు వందల కోట్లు రాబట్టింది. ఇన్నాళ్లకి తెలుగులోకి వచ్చింది. ఈ శుక్రవారం(అక్టోబర్ 9)న విడుదల చేశారు. హోంబలే ఫిల్మ్స్ వాళ్లు, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సమక్షంలో తెలుగులోకి అనువాదమైంది. మరి నార్త్ లో దుమ్ములేపిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
హనుమాన్ అంశ్ మూవీ కథ
స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ ఇది. డాక్టర్ రామ్ నందన్ భోసలే (చందన్ కె. ఆనంద్) దేవుడిపై నమ్మకం లేని శాస్త్రవేత్త. ఆయన జీవితంలో చోటుచేసుకునే ఓ కీలక సంఘటన విశ్వాసం, దైవత్వం గురించి ఆలోచించేలా చేస్తుంది. ఈ క్రమంలో ఆయనకు లక్ష్మీనారాయణ్ శర్మ (శోభినవ్ సత్య) పరిచయమవుతాడు. కాలక్రమంలో లక్ష్మీనారాయణ్ శర్మ నీమ్ కరోలి బాబాగా ప్రసిద్ధి చెందుతాడు. చిన్నతనంలో ఎదురైన విషాదం, ఆధ్యాత్మికత వైపు ఆయనను నడిపించిన పరిస్థితులు, జీవితానికి అర్థం వెతుక్కుంటూ సాగించే ప్రయాణం కథలో కీలకంగా నిలుస్తాయి. ప్రజలకు ప్రేమను పంచడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఇతరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించారన్నది సినిమాలో ప్రధానంగా చూపించారు. అయితే దేశమంతా తిరిగిన ఆయన నీమ్ కరోలీలోనే ఎందుకు కొలువైయ్యారు? అక్కడ ఏం చేశాడనేది సినిమా కథ.
హనుమాన్ అంశ్ మూవీ విశ్లేషణ
బయోపిక్ సినిమాల్లో ఒక వ్యక్తి సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సమస్యలు, జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే హనుమాన్ అంశ్ ఆధ్యాత్మికత, దయ, ప్రేమ, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రధానంగా రూపొందించారు. మనిషిలో మార్పు రావడానికి ఎదురయ్యే అనుభవాలు ఎలా కారణమవుతాయో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అంశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో కథలో భావోద్వేగ తీవ్రత పెరుగుతుంది.
అయితే కథనం ఎపిసోడ్ల తరహాలో సాగడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా ఉండటం వల్ల సినిమా వేగం తగ్గుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఉండే భారీ మలుపులు, ఉత్కంఠ ఇందులో కనిపించదు. అయితే సినిమా అంటే వినోదం, థ్రిల్, సస్పెన్స్, వాహ్ ఫీలింగ్ వంటి వాటికి ప్రయారిటీ ఇస్తారు. ఆడియెన్స్ కూడా వాటిని ఆశిస్తారు. ఆ పరంగా చూస్తే ఇందులో అవేవీ ఉండవు.
దేవుడికి సంబంధించిన మూవీ అన్నప్పుడు మాయలు, వారి లీలలకు ప్రయారిటీ ఉంటుంది. వాటినే ఆడియెన్స్ ఆశిస్తారు. అవి లేకపోతే చప్పగా సాగుతుంది. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. నీమ్ కరోలి బాబా జర్నీని చూపించారు. సింపుల్‌గా ఆయన లైఫ్‌ని ఆవిష్కరిస్తుంది. అందులోని ప్రధాన ఘట్టాలను మాత్రం చూపించారు. దేవుడు, దైవత్వానికి సంబంధించిన ఎన్నో గొప్ప సినిమాలు చూశారు మన తెలుగు ఆడియెన్స్. కాబట్టి ఏదో ఉండాలని ఆశిస్తారు. కానీ ఇందులో అవి లేకపోవడంతో నిరాశ తప్పదు. సినిమా చాలా ప్లాట్‌గా సాగుతుంది, హై, లో అనేవి ఉండవు. సాఫీగా సాగిపోతుంటుంది. డ్రామా కూడా పెద్దగా లేదు. ఉన్నచోట కూడా పండలేదు.
మెయిన్‌గా మూవీలో ఎమోషన్స్ లేవు. ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని ఉన్నా, అవి కనెక్ట్ కాలేదు. దీనికితోడు నాటకీయత కూడా పెద్దగా లేదు. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉంటాయి. స్లోగా సాగుతుంది. చిన్న చిన్న సంఘటనలు ఎక్కువ సేపు చూపించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందులో అంతగా చూపించాల్సిన అంశం ఏముంది అనే ఫీలింగ్ కలుగుతుంది. దేవుడి పవర్‌కి సంబంధించిన సీన్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా సింపుల్‌గా ఉన్నాయి. దీంతో అవి కిక్ ఇవ్వలేకపోయాయి. క్లైమాక్స్ కూడా అసంతృప్తిగానే ఉంటుంది. కాకపోతే దేవుడిని నమ్ముకున్నా, శాస్త్రియంగా చేయాల్సినవి చేయాలని చెప్పే సన్నివేశాలు బాగున్నాయి.
మూఢ విశ్వాసం కాకుండా మనం పని మన చేయాలి, నిజాయితీగా ఉండాలి, దేవుడిని ఆరాధించాలి అని చెప్పిన తీరు బాగుంది. అయితే పూర్తి భక్తులుగా ఉన్నవారు, నీమ్ కరోలీ బాబా గురించి తెలిసిన వారికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. కానీ న్యూట్రల్ ఆడియెన్స్ ని ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక డాక్యుమెంటరీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. శోభినవ్ సత్యా నటన, సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు ప్రధాన బలాలు. నెమ్మదిగా సాగే కథనం, కొన్ని చోట్ల తగ్గిన ఉత్కంఠ బలహీనతలు.
హనుమాన్ అంశ్‌లో నటీనటుల నటన
నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్యా తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. పాత్రలోని ప్రశాంతత, ఆధ్యాత్మిక భావనలను అతిగా నటించకుండా తెరపై ఆవిష్కరించడం ఆయనకు కలిసొచ్చింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ హుందాగా కనిపించారు. చిన్న వయసు పాత్రలో విహాన్ షెడ్గే తన పరిధి మేరకు మెప్పించారు. డాక్టర్ రామ్ నందన్ భోసలే పాత్రలో చందన్ కె. ఆనంద్ కథకు కీలకమైన బలాన్ని అందించారు. పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర పాత్రలు ఓకే అనిపించారు.
టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు విశాల్ చతుర్వేది కథను భక్తిభావం, మానవీయ విలువల చుట్టూ నడిపించారు. అనవసరమైన కమర్షియల్ హంగులకు వెళ్లకుండా కథలోని ప్రధాన సందేశాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సన్నివేశాలను మరింత సంక్షిప్తంగా తెరకెక్కించి ఉంటే కథనం వేగంగా సాగేది. బిగ్ స్క్రీన్ ఫీల్ ఇవ్వకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. విశాల్ బావా సినిమాటోగ్రఫీ కథకు అవసరమైన విజువల్ ట్రీట్‌ని ఇచ్చింది. సాధు తివారీ, రిషి పాఠక్, శ్రేయాస్ ధర్మాధికారి, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆధ్యాత్మిక భావనలను పెంచాయి, మ్యూజిక్ బాగుంది. ఆర్‌ఆర్ ఇంకా బాగుంది. శంఖ్ రాజాధ్యక్ష ఎడిటింగ్‌లో మరింత క్రిస్ప్‌నెస్ ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.
ఫైనల్ నోట్
మొత్తంగా హనుమాన్ అంశ్ భక్తి, మానవత్వం, నిస్వార్థ సేవ వంటి అంశాలతో ఆలోచింపజేసే ఆధ్యాత్మిక చిత్రం. నీమ్ కరోలి బాబా జీవితంపై ఆసక్తి ఉన్నవారికి, ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. సాధారణ ఆడియెన్స్ కి మాత్రం ఇది ఏమాత్రం ఎక్కడు. పైగా తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం అంత ఈజీ కాదు. కనెక్ట్ అయితే మాత్రం ఏదో మ్యాజిక్ జరుగుతుందని చెప్పొచ్చు.
రేటింగ్ : 2.5

