గోపీచంద్ ‘సీటీమార్’రివ్యూ
కార్పొరేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో హీరో చేసే ఈ ప్రయత్నం ఎలా సఫలీకృతం అయ్యిందన్నదే ‘సీటీమార్’ సినిమా.
Seetimaarr
గోపీచంద్ నుంచి సరైన మాస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. థియోటర్ లోనూ అదే పరిస్దితి. క్రాక్ సినిమా తర్వాత సరైన మాస్ సినిమా పడలేదు. ఈ లోటుని తీరుస్తానంటూ ‘సీటీమార్’ విజిలేస్తూ మన ముందుకు వచ్చింది. ట్రైలర్ కూడా ఓ రేంజిలో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేసింది. పెరిగిన అంచనాలను సినిమా నిలబెట్టుకుందా, అసలు సీటిమార్ లో కథేంటి, కబడ్డీ నేపధ్యం సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడింది..చెక్ దే ఇండియా సినిమాకు ఈ ‘సీటీమార్’కు సంభందం ఉందా వంటి విషయాలు చూద్దాం.
Seetimaarr
కథ
ఆత్రేయపురం రామకృష్ణా మెమోరియల్ స్కూల్ అంటే ఒకప్పుడు పెద్ద పేరు. అయితే కార్పోరేట్ సంస్దలు వచ్చాక ఆ స్కూల్ ని పట్టించుకునే వాళ్లే కరువు అవుతారు. ఆ స్కూల్ మూతబడే స్దితికి వస్తుంది. ఈ విషయం రామకృష్ణ కుమారుడు కార్తీక్(గోపీచంద్) కు తెలిసి బాధపడతాడు. కార్తీక్ (గోపీచంద్) బేసిక్ గా ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. దాంతో తనకు తెలిసిన కబడ్డి ద్వారానే ఆ స్కూల్ ని వెలుగులోకి తేవాలనుకుంటాడు. కబడ్డీలో ఆ స్కూల్ స్టూడెంట్స్ కనుక నేషనల్ ఛాంపియన్ షిప్ సాధిస్తే ఆ స్కూల్ మళ్లీ దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని భావించి అందుకు తగ్గట్లు గా సన్నాహాలు చేస్తాడు.
Seetimaarr
అందుకు మన కార్తీక్ కు ఎవరూ కలిసి రారు. అయినా క్రిందా మీదా పడి ఆ ఊర్లోవాళ్లని ఒప్పించి, మేనేజ్‌మెంట్ ని మెప్పించి, తన టీమ్ ని రెడీ చేస్తాడు. తనే చెక్ దే ఇండియా లో షారూఖ్ లా మారి ట్రైనింగ్ ఇస్తాడు. ఆనక ఢిల్లీకి తీసుకెళ్తాడు. నేషనల్స్ లో ఆడించి ఫైనల్ వరకూ తీసుకెళ్తాడు. అయితే ఇంకో రెండు రోజుల్లో మొత్తం ఓ కొలిక్కి వచ్చేస్తుందనగా టీమ్ మొత్తం కిడ్నాప్ అయ్యిపోతుంది. చేసింది ఎవరూ అంటే ఓ లోకల్ దాదా అని తెలుస్తుంది. ఆ లోకల్ దాదాకు ఎక్కడో ఆత్రేయపురం నుంచి వచ్చి కబడ్డీ జట్టుతో ఏం పని, వాళ్లను కార్తీక్ టీమ్ ఎలా కాపాడుకుని నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించాడు. ఈ కథలో జ్వాలా రెడ్డి (తమన్నా) పాత్ర ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Seetimaarr
కథ,కథనం విశ్లేషణ..
చాలాకాలం క్రితం వచ్చిన ‘గోల్కొడ హైస్కూల్' ..తమ హైస్కూల్ గ్రౌండ్ ను కాపాడుకోవడానికి క్రికెట్ ఆడే కుర్రాళ్ళ కథ. అలాగే మొన్మీ మధ్య న సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ మూవీ తమ ఊరి క్రీడా మైదానం కాపాడుకోవడం కోసం హాకీ స్టిక్ పట్టిన అమ్మాయిల కథ. ఇప్పుడీ కథ కూడా అంతే. తన తండ్రి స్దాపించిన రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్ లో చదువుకున్న ఈ అమ్మాయిలను నేషనల్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్స్ గా నిలబెట్టి, తద్వారా తమ వూరికి, ఆ స్కూల్ కు గుర్తింపు తీసుకురావాలన్నది హీరో కోరిక. అది బాగానే ఉంది. ఆ రెండు సినిమాలు ఆ పాయింట్ చుట్టూనే తిరిగే ప్రయత్నం చేసాయి.
Seetimaarr
అయితే ఈ డైరక్టర్ మాస్ కు కేరాఫ్ ఎడ్రస్ గా కథలు రాసే సత్తా ఉన్నవాడు. దాంతో ఆ పాయింట్ కు విలన్ ని జత చేసాడు. అలాగే విజయ్ హీరోగా వచ్చిన ‘విజిల్’ మూవీలోనూ ఫుట్ బాల్ క్రీడాకారులను విజయ్ ఎలా ట్రైనప్ చేస్తాడో అదే విధానం ఇందులోనూ మనకు కనిపిస్తుంది. మెరికల్లాంటి అమ్మాయిలను ఎంపిక చేసిన హీరో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాడు. అందులో విజయ్ ఆ అమ్మాయిలను కన్వెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే, ఇందులో ఆ పని హీరో… కబడ్డీ ఆడే అమ్మాయిల తల్లిదండ్రులను కన్వెన్స్ చేస్తాడు. అంతే తేడా.
Seetimaarr
వాస్తవానికి కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్పోర్ట్స్ డ్రామా చెయ్యాలనే ఆలోచన నిజంగా గొప్పదే. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువై, స్పోర్ట్స్ డ్రామా చిన్నదైనప్పుడే ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమాలో జరిగేది అదే. కబడ్డీతో సినిమా ఓ ఇంటెన్స్ డ్రామా గా నడుస్తుందేమో, అందులో సాధక,భాధలు చర్చిస్తూ ఓ ప్రేరణగా ప్లేయర్స్ కు నిలుస్తుందేమో అనుకుంటాము. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ వాటిని డామినేట్ చేసేసాయి. ఎప్పుడైతే కబడ్డీ టీమ్ కిడ్నాప్ అయ్యిందో అప్పుడే కథే కిడ్నాప్ అయ్యిపోయింది. అక్కడ నుంచి ఆ కథను విడిపించటానికి డైరక్టర్ ..హీరోని ముందు పెట్టి నానా పైట్స్ చేస్తాడు. గోపిచంద్ లాంటి యాక్షన్ హీరో ఉన్నప్పుడు ఇలాంటి కిడ్నాప్ వ్యవహారాలు తప్పవు అనుకుంటే కొంత రిలీఫ్.
Seetimaarr
ఇవన్ని ప్రక్కన పెడితే సంపత్ నంది మాస్ మసాలా ఎలిమెంట్స్ ని స్క్రిప్టులో అతి నాజూగ్గా ఇరికించగలడు. మోటుగా విలన్స్ చేత మాట్లాడించగలడు. హీరో చేత థీటుగా సమాధానం చెప్పించగలడు. ఈ డైలాగులు ప్రతిభ చాలా వరకూ ఉపయోగపడింది. ఫస్టాఫ్ ఫన్ ఉండటం వల్లనేమో.. స్పీడుగా వెళ్లిపోయినా అందుకే సెకండాఫ్ నట్టింది. డిల్లీ మాకన్ సింగ్ అంటూ మాఫియా నేపధ్యం తిసుకున్నా పెద్దగా పనికొచ్చిందేమీ లేదు.సెకండాఫ్ లో కబడ్డీ ఆటగా మాయమై, హీరోకు విలన్ కు కబడ్డీ గేమ్ మొదలైంది.
Seetimaarr
రచ్చ, బెంగాళ్ టైగర్, గౌతమ్ నంద సినిమాలు చూసిన వాళ్లకు ఈ డైరక్టర్ ఎలాంటి కథ అయినా చివరకు రామాయణం ఇచ్చినా మాస్ అప్పీల్ కలిపేసి రచ్చ రచ్చ చేసేస్తాడని అర్దమవుతుంది. కథ,గిథ జాన్తానై హీరో గోల్,గోల వదిలేసేయ్..హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ నడుస్తోందా లేదా అన్నది ఈ సినిమాలో డైరక్టర్ ఎంచుకున్న విషయాలు. అయితే మరీ మాస్ మసాలా అని మాబోటోడు ఫీలవుకుండా ఉమెన్ ఎంపర్మెంట్ ని చెప్తూ కొన్ని సీన్స్ ఉండనే ఉంటాయి. కాబట్టి ఇదో రకం మాస్ స్క్రీన్ ప్లే రచన అనుకోవాలి.
Seetimaar
టెక్నికల్ గా..
మణిశర్మ ఉన్నారు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. పాటల్లో సీటీమార్, జ్వాలారెడ్డి బావున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడా మంచి మెరుపులు చూపించాడు. ఎడిటింగ్ ఎక్కడా లాగ్ లు లేకుండా నీట్ గా ఉంది. మిగతా డిపార్టమెంట్స్ ఎక్కడా ఏ లోపం కనపడనీయలేదు. అన్ని అందంగా అమిరాయి. ఎప్పటిలాగే సంపత్ నంది మార్క్ రైటింగ్ మాస్ ఎలిమెంట్స్ తో మురిసిపోయింది. ప్రక్క ట్రాక్స్ తో పరుగులెత్తింది. డైలాగులు బాగున్నాయి. కథకూడా అంతే బాగుంటే వీటిన్నటికి ఓ నిండుతనం వచ్చేంది.
seetimar
నటీనటుల ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే...
కబడ్డి కోచ్ కార్తీక్ గా గోపిచంద్ చేసింది టిపికల్ పాత్రే కానీ డీసెంట్ గా అరుపులు లేకుండా లాక్కెళ్లాడు. యాక్షన్,ఎమోషన్స్ సీన్స్ ని బాగానే పండించారు. యాక్షన్ సీన్స్ లో అయితే ఎప్పటిలాగే బాగున్నాడు. ఇక తమన్నాది చెప్పుకోదగ్గ పాత్ర అంటే కాదు అని చెప్పాలి. హీరోయిన్ గా చేసిందా అంటే అదీ కాదనే చెప్పాలి. కానీ తెలంగాణా స్లాంగ్ యాడ్ అవటంతో కొత్తగా అనిపించింది. రావు రమేష్ పాత్ర,భూమిక,రెహమాన్ లలో రావు రమేష్ పాత్ర హైలెట్ అయ్యింది.
Seetimaar
బాగున్నవి
గోపిదంద్,తమన్నా కాంబో
సంపత్ నంది మాస్ డైలాగులు
ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్
బాగోలేనివి
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
రొటీన్ గా అనిపించే విలనిజం
క్లైమాక్స్ పార్ట్
చెప్పుకోదగిన స్దాయిలో ఎంటర్టైన్ చేయలేకపోవటం
గోపీచంద్ ను ‘గౌతమ్ నంద’ తర్వాత మరోసారి కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు సంపత్ నంది గట్టి ప్రయత్నమే చేశాడు.
Seetimaarr
ఫైనల్ థాట్
ఇదో 'ఆవు వ్యాసం' టైప్ ట్రీట్మెంట్ కథ, ఏ బ్యాక్ డ్రాప్ (స్పోర్ట్స్ అయినా సోప్ లు అమ్ముకునే కథ అయినా) అదే విలన్, అదే ఫైట్స్ , అవే సీన్స్
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Seetimaarr
ఎవరెవరు..
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్;
నటీనటులు: గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా, అప్సర రాణి (స్పెషల్ సాంగ్) తదితరులు; ఛాయాగ్రహణం: ఎస్. సౌందర్ రాజన్;
సంగీతం: మణిశర్మ;
ఎడిటింగ్: తమ్మిరాజు;
కళ: సత్యనారాయణ డి.వై;
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి;
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది;
సమర్పణ: పవన్ కుమార్;
రన్ టైమ్: 138 నిముషాలు
విడుదల: 10-09-2021