- Home
- Entertainment
- Movie Reviews
- Dhandoraa Movie Review: దండోరా మూవీ రివ్యూ, రేటింగ్.. శివాజీ మరోసారి రెచ్చిపోయాడా?
Dhandoraa Movie Review: దండోరా మూవీ రివ్యూ, రేటింగ్.. శివాజీ మరోసారి రెచ్చిపోయాడా?
Dhandoraa Movie Review: శివాజీ, నందు, రవికృష్ణ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రలో నటించిన మూవీ `దండోరా`. క్రిస్మస్ కానుకగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

దండోరా మూవీ రివ్యూ
క్రిస్మస్ కానుకగా ఈ గురువారం దాదాపు ఆరేడు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ప్రధానంగా నిలిచిన మూవీ `దండోరా`. కులం, సామాజిక అంశాలను ప్రధానంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతుంది. ముందుగానే మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది. శివాజీ మరో హిట్ కొట్టాడా? ఈ సినిమాలో కులం గురించి ఏం చూపించారనేది రివ్యూలో తెలుసుకుందాం.
దండోరా మూవీ కథ
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో కుల వివక్ష చాలా ఉంటుంది. తక్కువ కులం వాళ్లు చనిపోతే ఊరికి దూరంగా నదిలో దహనం చేయాల్సి వస్తుంది. శివాజీ(శివాజీ) కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అగ్రకులానికి చెందిన పెద్దమనిషి. ప్రాణాలైనా వదులుకుంటానుగానీ, కులం విషయంలో తగ్గేదెలే అనే మనస్తత్వంతో ఉంటారు. ఆయన కొడుకు విష్ణు(నందు) హైదరాబాద్‌లో పెద్ద చదువుల కోసం వెళ్తాడు. కూతురు సుజాత(మణిక) ఊర్లోనే తండ్రితోపాటు ఉంటుంది. అయితే ఆమె అదే ఊరికి చెందిన తక్కువ కులానికి చెందిన రవి(రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. పెళ్లికి కూడా సిద్ధమవుతారు. వీరి ప్రేమ విషయం శివాజీతోపాటు వారి కుల పెద్దలకు తెలుస్తుంది. ఇది బయటకు వస్తే పరువు పోతుందని, వారి కుల పెద్దలు రవిని చంపేస్తారు. అది తట్టుకోలేక సుజాత కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒంటరైపోతాడు శివాజీ. కొడుకు విష్ణు తండ్రిని అసహ్యించుకుంటాడు. కులం గజ్జితో చెల్లిని చంపుకున్నారని కుల పెద్దలను, తండ్రిని అసహ్యించుకుంటాడు. తండ్రికి దూరంగానే ఉంటాడు. అనంతరం మూడేళ్లు ఒంటరిగా మదనపడ్డ శివాజీలో వచ్చిన మార్పేంటి? ఆయన్నీ శ్రీలత(బిందు మాధవి) ఎలా మార్చింది? శ్రీలత కూతురుని శివాజీ ఎందుకు పెంచుకున్నాడు? చివర్లో ఆమె ఇచ్చిన ట్విస్టేంటి? ఊరు సర్పంచ్(నవదీప్) పాత్రేంటి? అనేది మిగిలిన సినిమా.
దండోరా మూవీ విశ్లేషణ
కాలం మారుతుంది, జనరేషన్స్ మారుతున్నాయి. ఎడ్యూకేషన్ పెరిగింది. అయినా కుల వివక్ష తగ్గడం లేదు, కుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఒక సామాజిక సమస్యని కథా వస్తువుగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు దర్శకుడు మురళీకాంత్. అయితే ఇలాంటి అంశాలు చెప్పే క్రమంలో సినిమాలు ఓవర్ బోర్డ్ వెళ్తుంటాయి. మరీ డ్రైగా ఉంటుంటాయి. కానీ ఇందులో అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. కుల వివక్ష, కుల గజ్జి ఉంటే అది ఎంతటి దారుణాలకు కారణమవుతుందనేది ఇందులో చూపించారు. ఇక సినిమాగా చూసినప్పుడు ప్రారంభంలోనే ఓ తక్కువ కులానికి చెందిన మహిళ చనిపోతే ఊరికి దూరంగా ఉన్న నదిలో పూడ్చి పెట్టడానికి తీసుకెళ్లడం, ఈ క్రమంలో వాళ్లు పడే బాధలను చూపించి ఆ ఊర్లో ఎంతటి కుల వివక్ష ఉందనేది ఆవిష్కరించారు. అనంతరం శివాజీ కూతురు తక్కువ కులం వ్యక్తిని ప్రేమించగా, అతను ఆస్తిపరుడు అయినా, కులం కారణంగా ప్రాణాలను కోల్పోవడం అగ్రకులాల్లో ఉన్న కుల గజ్జిని ఆవిష్కరిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో ఎక్కువగా రవి, సుజాతల ప్రేమ కథకి ప్రయారిటీ ఇచ్చారు, అడపాదడపా ఈ సామాజిక సమస్యను టచ్ చేస్తూ వెళ్లారు. ఆ ప్రేమ కథలో కొంత రొమాన్స్ ఉంటుంది? కామెడీ ఉంటుంది. అదే సమయంలో శివాజీ పాత్ర చనిపోయినప్పుడు ఊరి సర్పంచ్ నవదీప్ చేసే హడావుడి, సత్తన్న చేసే కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. కూతురు చనిపోయాక శివాజీ పడే మనోవేదనని ఎమోషనల్ గా ఆవిష్కరించారు. సెకండాఫ్ అంతా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. బిందు మాధవి పాత్ర చెప్పే వాస్తవాలు, ఆమె జీవితం గుండెని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. శివాజీలో వచ్చిన మార్పు ఆశ్చర్యపరుస్తుంది. కోర్ట్ సీన్‌తో మూవీని మరో లెవల్‌కి తీసుకెళ్లారు. అనంతరం సినిమా ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుంది. సినిమాలో ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్‌లాగా ఉంటాయి. జీవిత సత్యాలను ఆవిష్కరిస్తాయి. కథనాన్ని గ్రిప్పింగ్‌గా నడిపించిన తీరు కూడా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఇందులో ఆవిష్కరించారు. కుల గజ్జి ఒక కుటుంబాన్ని ఎంతగా చిన్నాభిన్నం చేసిందనేది చూపించిన తీరు కలిచివేస్తుంది. ఓవరాల్‌గా అన్ని భావోద్వేగాలకు గురి చేస్తూనే సినిమాని నడిపించిన తీరు, ఒక మార్పుతో ముగించిన తీరు బాగుంది.
దండోరా మూవీ హైలైల్స్, మైనస్‌లు
సినిమాకి కథ, కథనం పెద్ద అసెట్. నటీనటులు ఎంపికతోపాటు వారి నటన మరో అసెట్‌గా చెప్పొచ్చు. తమ నటనతో వాళ్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. బిజీఎం, మ్యూజిక్ బాగుంది. కెమెరా వర్క్ కూడా అదిరిపోయింది. డైలాగ్‌లు మరో అసెట్‌గా చెప్పొచ్చు. కనువిప్పు కలిగించే సందేశం ప్లస్‌గా నిలిచాయి. సీరియస్ ఫిల్మ్ లోనూ కామెడీని పండించిన తీరు బాగుంది.
మైనస్‌ల విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్ ఉంటుంది. ఎంత సేపు అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. సెకండాఫ్ ప్రారంభంలోనే డ్రైగా సాగింది. ఎడిటింగ్ పరంగా మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెలంగాణ స్లాంగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. కొన్ని సీన్లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి.
దండోరాలోని నటీనటులు
శివాజీగా శివాజీ అదరగొట్టారు. మరో నిలిచిపోయే పాత్ర అవుతుంది. సెటిల్డ్ గా నటించి మెప్పించారు. కోర్ట్ సీన్‌లో అదరగొట్టాడు. కొన్ని సీన్లలో ఆయన `మంగపతి` పాత్రని తలపించారు. నందు సైతం విష్ణు పాత్రలో ఇరగదీశారు. తన బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారు. కొత్త నందుని ఇందులో చూడొచ్చు. నవదీప్ 2.0 అని టైటిల్‌లో ఇచ్చారు. ఆయన నటన కూడా అదే రేంజ్‌లో ఉంది. ఓ కొత్త నవదీప్‌ని ఆవిష్కరించారు. బిందు మాధవి చాలా ప్రభావితం చేసే పాత్రలో మెప్పించింది. మౌనికా రెడ్డి విష్ణు భార్యగా అదరగొట్టింది. రవికృష్ణ పాత్ర మరో హైలైట్. ఫస్టాఫ్ లో అతని పాత్రనే హైలైట్‌గా ఉంటుంది. మురళీధర్ గౌడ్ ఈజీగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. సత్తన్న కామెడీ మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు అంతా ఆకట్టుకున్నారు.
దండోరాలోని టెక్నీషియన్ల పనితీరు
మార్క్ కె రాబిన్ సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచింది. పాటలు బాగున్నాయి. బిజీఎం అదిరిపోయింది. వెంకట్ ఆర్ శాఖమూరి కెమెరా వర్క్ చాలా బాగుంది. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ ఇంకా కాస్త షార్ప్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. ఇలాంటి సినిమాని తీయడానికి గట్స్ కావాలి. దర్శకుడు మురళీకాంత్ కిది తొలి చిత్రమైనా ఎక్కడా ఆ తేడా కనిపించలేదు. ఎంచుకున్న కథనిగానీ, సినిమాని నడిపించిన తీరుగానీ బాగుంది. షార్ట్ అండ్ స్వీట్‌గా నడిపించారు. చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పారు. అలా అని బోరింగ్‌గా కాకుండా, ఏదో సందేశం ఇస్తున్నట్టుగా కాకుండా షుగర్ కోటెడ్‌లో చెప్పిన తీరు బాగుంది. ఇలాంటి సినిమాని డీల్ చేయడం చాలా టఫ్ జాబ్. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే.
ఫైనల్‌గా
కుల వివక్ష, సామాజిక రుగ్మతలను చర్చిస్తూనే అన్ని భావోద్వేగాల మేళవింపుతో నడిపించిన మంచి కమర్షియల్ మూవీ `దండోరా`. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ.

