`డార్లింగ్` మూవీ రివ్యూ, రేటింగ్..
నభా నటేష్, ప్రియదర్శి కలిసి నటించిన సినిమా `డార్లింగ్`. ఇది ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, `ఇస్మార్ట్ శంకర్`తో పెద్ద హిట్ అందుకుంది. గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలవడమేకాదు, నటనతోనూ మెప్పించింది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అంతలోనే ఆమె యాక్సిడెంట్‌కి గురయ్యింది. దీంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ `డార్లింగ్` చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది. ప్రియదర్శి ఇందులో ఆమెకు జోడీగా నటించాడు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని `హనుమాన్` ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నేడు శుక్రవారం(జులై 19)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
రాఘవ్(ప్రియదర్శి)కి చిన్పప్పుడు చదువంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో అమ్మ అతనిలో చదువుపై ఆసక్తి కలిగించడం కోసం బాగా చదువుకుని, మంచి జాబ్ తెచ్చుకుంటే, మంచి శాలరీ వస్తే మంచి, అందమైన భార్య వస్తుందని చెబుతుంది. ఆ తర్వాత పక్కింటి కుర్రాడు(సుహాస్) అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకుని పారిస్‌కి హనీమూన్ వెళ్తాడు. ఇది చూసిన రాఘవ్.. అమ్మ చెప్పిన మాటకు ఫిక్స్ అయి బాగా చదువుకుని, జాబ్ తెచ్చుకుని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంటాడు. ఒక టూరిస్ట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. కానీ మ్యారేజ్ కాదు. అమ్మాయిలు దొరకరు. ఇంతలో రాఘవ్ తల్లిదండ్రులు నందిని(అనన్య నాగళ్ల) అనే అమ్మాయితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. కానీ పెళ్లి రోజే ఆ అమ్మాయి వేరే వాడితో లేచిపోతుంది. రాఘవ్‌కి ఇది పెద్ద షాక్. దీంతో ఫ్రెండ్, ఆఫీస్‌లో కొలిగ్స్ అంతా అవమానిస్తుంటారు. నానా రకాలుగా మాటలు అంటుంటారు. దీంతో బాగా తాగి చనిపోవాలని నిశ్చయించుకుంటాడు. ఓ కొండెక్కి దూకాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆనంది(నభా నటేష్) అనే అమ్మాయి రాఘవ్‌ని మోటివేట్ చేసి సూసైడ్ నుంచి తప్పిస్తుంది. ఈ సందర్బంగా ఇప్పటి వరకు ఇతరులు చెబితే విన్నాం, అదే చేశావ్, ఇప్పుడు నీకు ఏం కావాలో దాని కోసం నువ్వే పోరాడాలి, సాధించాలి అని ఆనంది చెప్పిన మాటకి ఫిదా అయిన రాఘవ్.. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అంతేకాదు ఏకంగా పెద్దలను ఎదురించి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఫస్ట్‌నైట్‌లో ఆనందితో క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు, ఆమెకి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడంతో లాగిపెట్టి చితక్కొడుతుంది. దీంతో మైండ్ బ్లాక్ అయిన రాఘవ్ కి షాకిచ్చే విషయాలు తెలుస్తాయి. ఆనందికి స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని, ఆనంది ఒక్కరు కాదు, ఐదుగురు అని. మరి ఇంతకి ఆ డిజార్డర్ ఏంటి? ఆమెలో ఐదుగురు ఉండటమేంటి? ఆ ఐదుగురు ఎవరు? ఎలా వచ్చారు? దాన్నుంచి ఆనంది ఎలా బయటపడింది? ప్రియా కథేంటి? రాఘవ్ దీన్ని ఎలా ఫేస్ చేశాడు? చివరి ఏం జరిగింది, ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు చోటుచేసుకున్నాయనేది అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ తో చాలా సినిమాలు వచ్చాయి. `అపరిచితుడు` అలాంటి సినిమానే. తీరని కోరికలు, అవమానాలు, అఘాయిత్యాల కారణంగా మనిషిలో ఇలాంటి డిజార్డర్ వస్తుందని మెడికల్ సైన్స్ చెబుతుంది. ఒకరు ఇద్దరు ముగ్గురిగా మారడం, రెండు మూడు రకాలుగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అయితే `అపరిచితుడు` సినిమా పక్కన పెడితే ఇలాంటి కథలు ఎక్కువగా హర్రర్ కామెడీ, హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌లోనే చూపిస్తుంటారు మేకర్స్. ఒక వ్యక్తిలోకి ఆత్మలు వచ్చి చేరి తమ కోరికలు తీర్చుకుంటాయి. కానీ `డార్లింగ్` సినిమా విషయంలో దానికి భిన్నంగా `అపరిచితుడు` స్టయిల్‌ని ఫాలో అయ్యాడు దర్శకుడు అశ్విన్ రామ్. ఫన్ వేలో ఈ సినిమాని నడిపించాడు. నభా నటేష్ పాత్రని స్ల్పిట్ పర్సనాలిటీ, మల్టీఫుల్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ కలిగిన అమ్మాయిలా చూపించాడు. ఇదే ఈ సినిమాలో ఉన్న కొత్తదనం. ప్రియదర్శి పాత్రని కామెడీ వేలో చూపించాడు. నభా నటేష్‌తో అతను ఎలాంటి బాధలు పడ్డాడు? అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని, పారిస్‌కి హనీమూన్ వెళ్లాలనుకున్న రాఘవ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడనేది ప్రియదర్శి పాత్రలో కామెడీగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ సినిమాని ఆకట్టుకునేలా, వినోదాత్మకంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడు.
ప్రియదర్శి పాత్ర తన డ్రీమ్ కోసం ఆరాటపడటం, పెళ్లి చేసుకుని, భార్యతో హనీమూన్‌కి వెళ్లాలనుకోవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఫ్రెండ్స్ అంతా అవమానించడంతో బాధలో ప్రియదర్శి సూసైడ్ చేసుకోవాలనుకోవడం, అంతలోనే నభా నటేష్ అక్కడికిరావడం, అతన్ని సేవ్ చేయడం, ఆ వెంటనే ఆమెని ప్రియదర్శి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. దీంతో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇక పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ రోజు నభా చుక్కలుచూపించడం, తాను పూర్తి భిన్నంగా మారి చితక్కొట్టడం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఆమెకి డిజార్డర్ ఉందని నభా నటేష్ చెప్పడంతో దాన్నుంచి బయటపడేందుకు, ఆమెని సేవ్ చేసేందుకు చేసే ప్రయత్నం ఓకే అనిపిస్తుంది. రాత్రి పార్టీలో జరిగే సన్నివేశాలు కాస్త కామెడీగా ఉంటాయి. బాబా సన్నివేశాలు కూడా ఫర్వాలేదు. ఇక నభాలో మల్టీఫుల్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలిసిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు కథ అంటే సినిమా కథ కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్ కి అసలు కథ స్టార్ట్ అవుతుంది. నభా పాత్రని రకరకాలుగా మలుపులు తిప్పించాడు దర్శకుడు. కొత్తకొత్త విషయాలను పరిచయం చేస్తుంటాడు. లౌడ్ సన్నివేశాలతో పిచ్చెక్కించాడు.
నభాలోని ఒక పాత్రకి సంబంధించి అలా ఎందుకు మారింతో చెప్పాడు. ఓ ముసలి వ్యక్తి చేసిన పని కారణంగా తాను ఎంత బాధపడిందో చెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ మిగలిన పాత్రలు, మిగిలిన వాళ్లు ఆమెలోకి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారనేదానికి క్లారిటీ లేదు. ఇక ఆమెని డీల్ చేసే విషయాలు మరింత బోరింగ్‌గా, మరింత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఫన్ కోసం పెట్టిన సన్నివేశాలు బెడిసికొట్టాయి. బాగా చిరాకు తెప్పిస్తాయి. ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఏ పాత్ర ఎందుకు ప్రవర్తిందో తెలియదు. నభాలోని భిన్నమైన పాత్రలు ఎందుకు వస్తున్నాయో క్లారిటీ లేదు. ఇవన్నీ బోరింగ్ మాత్రమే కాదు, పిచ్చెక్కించేలా ఉంటాయి. పైగా లౌడ్ ఫన్నీ సీన్లు టార్చర్ ఫీలింగ్‌ని తెస్తాయి. నభా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, మగాడిలా ప్రవర్తించడం, పెద్దవాళ్లు రిసెప్షన్ పెట్టినప్పుడు షాపింగ్ మాల్ సీన్లు, ఇంట్లో గొడవల సీన్లు సహనాన్ని పరీక్షించడంలో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయని చెప్పొచ్చు. సినిమా ముందుకెళ్లే కొద్ది, ఆ డోస్ మరింత పెరిగింది. ఫ్రస్టేషన్ పీక్‌లో తెప్పించి చివర్లో కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చి ముగించారు. క్లైమాక్స్ లో ఆనంది గతాన్ని పరిచయం చేసే సీన్లు, ఆనంది కోసం రాఘవ్ పడే తపన కాస్త ఫర్వాలేదనిపిస్తాయి. కానీ అప్పటి వరకు దర్శకుడు తనదైన స్క్రీన్‌ప్లేతో చుక్కలు చూపించాడు. సినిమాలో లాజిక్కులు లేవు. కథ అంతకంటే లేదు, కథనంలో క్లారిటీ లేదు. దర్శకుడు తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాడు. ఆడియెన్స్ తో ఓ ఆట ఆడుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నటీనటులుః
ఆనంది పాత్రలో నభా నటేష్ విశ్వరూపం చూపించింది. డిఫరెంట్‌గా ప్రవర్తించే సీన్లలో ఇరగదీసింది. నటిగా ఆమెకి మంచి మార్కులు పడతాయి. గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. కానీ ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు మాత్రం టార్చర్. ఇక రాఘవ్ పాత్రలో ప్రియదర్శి జీవించాడు. తనకు యాప్ట్ అయిన పాత్ర అది. అంతే సహజంగా చేసి మెప్పించాడు. అయితే ప్రియదర్శి కథల విషయంలో సెలక్టీవ్‌గా వెళ్తాడు. నభా కొంత గ్యాప్‌తో వస్తుంది. కమ్ బ్యాక్ ఫిల్మ్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఇద్దరు ఈ స్క్రిప్ట్ ని ఎలా ఓకే చేశారనేది పెద్ద మిస్టరీ. నందిని పాత్రలో ఆనన్య నాగళ్ల కాసేపు మెరిసింది. `బలగం` మురళీధర్ గౌడ్ పాత్ర మరోసారి మెప్పించేలా ఉంది. రఘుబాబు పాత్రకూడా కాసేపు అలరిస్తుంది. బ్రహ్మానందం పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. కళ్యాణ్ రాజు, కృష్ణ తేజ, రాజేశ్వరి ముల్లపూడి, స్వప్నిక, సంజయ్ స్వరూప్ పాత్రలు ఉన్నంతలో ఫర్వాలేదనిపించాయి.
టెక్నికల్ గాః
సినిమాకి టెక్నికల్ అంశాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక్క కెమెరా వర్క్ బాగుంది. నరేష్ రామదురాయ్ సినిమాని చూపించిన తీరు బాగుంది. రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది. ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయి. సినిమాని ఎంత ట్రిమ్ చేస్తే అంత బెటర్. వివేక్ సాగర్ మ్యూజిక్ ఆకట్టుకునేలా లేదు. బీజీఎం ఏమాత్రం మెప్పించలేదు. పైగా లౌడ్ సౌండ్ మరింత చిరాకు పుట్టించింది. కథ బాగలేకపోతే ఏం చేసినా వేస్టే అనేట్టుగా ఉంది ఈ సినిమా పరిస్థితి. ఇక దర్శకుడు అశ్విన్ రామ్ అసలు ఎంచుకున్న స్క్రిప్టే లాజిక్ లెస్. దీన్ని అటు హర్రర్ సినిమాలా చూపించలేకపోయాడు, ఇటు కామెడీ సినిమాగానూ చూపించలేకపోయాడు. రెంటికి కాని రేగడిలా మిగిల్చాడు. ప్రతి సీన్ తోనూ చిరాకు మాత్రమే కాదు, అన్నీ రకాల ఫ్రస్టేషన్స్ తెప్పించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సినిమా ద్వారా చెప్పాలనుకున్న ఉద్దేశ్యం బాగుంది. అమ్మాయిలకు సంబంధించిన ఫ్రీడమ్, స్వాతంత్రంగా బతకడం, కోటీశ్వరులు పిల్లలను పెంచే తీరు వంటి అంశాల్లో ఆయన చెప్పాలనుకున్న సందేశం బాగుంది. కానీ చెప్పిన తీరే పెద్ద మైనస్. నిర్మాతలు సినిమాని రాజీపడకుండా నిర్మించారు. కానీ ఏం చేసిన బూడిదలో పోసిన పన్నీరే.
ఫైనల్‌గాః `డార్లింగ్` కాదు, టార్చర్.
రేటింగ్‌ః 1.5