- Home
- Entertainment
- Movie Reviews
- `బన్ బట్టర్ జామ్` మూవీ రివ్యూ, రేటింగ్.. ట్రెండీ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
`బన్ బట్టర్ జామ్` మూవీ రివ్యూ, రేటింగ్.. ట్రెండీ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
తమిళంలో మంచి ఆదరణ పొందుతున్న `బన్ బట్టర్ జామ్` అనే సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేశారు. నేడు శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

`బన్ బట్టర్ జామ్` మూవీ రివ్యూ
ఇతర భాషల్లో సక్సెస్ అయిన చిత్రాలు చాలా వరకు మన వద్ద కూడా ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా చిత్రాలు అలా సక్సెస్ అయ్యాయి. ఆ కోవలోనే ఇప్పుడు `బన్ బట్టర్ జామ్` అనే మూవీ వచ్చింది. తమిళంలో గత నెలలో విడుదలైన ఈ మూవీ అక్కడ పాజిటివ్ టాక్‌తో రన్ అయ్యింది. డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు శుక్రవారం(ఆగస్ట్ 22)న తెలుగులో విడుదలయ్యింది. ఇందులో రాజు జయమోహన్, ఆధ్య, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించారు. సురేష్ సుబ్రమణ్యన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని విగ్నేశ్వర ఎంటర్‌టైన్స్ మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్ కుమార్ విడుదల చేశారు. రిలీజ్‌కి ముందుగానే మీడియాకి ప్రదర్శించారు. మరి తమిళంలో ఆకట్టుకున్న ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని అలరించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`బన్ బట్టర్ జామ్` మూవీ కథః
ఓ పెళ్లిలో లలిత(శరణ్య), ఉమ(దేవ దర్శిని) కలుసుకుంటారు. కుటుంబాల్లో ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు నిలవడం లేదని, మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకే విడిపోతున్నారని చర్చించుకుంటారు. దీంతో ఈ ఇద్దరు తమ కొడుకు, కూతురికి లవ్ కమ్ అరెంజ్ మ్యారేజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. లలిత ఇంటికి పక్కనే ఉమ ఫ్యామిలీ అద్దెకు దిగుతుంది. ఇక లలిత కొడుకు చంద్రు(రాజు జయమోహన్) బిటెక్‌లో చేరతాడు. ఉమ కూతురు మధుమిత(ఆధ్య ప్రసాద్) మరో కాలేజీలో చదువుకుంటుంది. ఎక్కువగా రీల్స్ చేస్తూ వైరల్‌గా మారుతుంటుంది. కాలేజీలో నందిని(భవ్య త్రిఖా)తో ప్రేమలో పడతాడు చంద్రు. ఈ ఇద్దరు ప్రేమలో చాలా దూరం వెళ్తారు. కానీ చంద్రు, మధు మదర్స్ మాత్రం వీరిద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తారు. ప్రారంభంలోనే ఈ ఇద్దరికి పడదు. ఆ తర్వాత పేరెంట్స్ ఒత్తిడి మేరకు కలుస్తారు. ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇంతలోనే ఫ్రెండ్‌తో చంద్రుకి కొడవ అవుతుంది. ఆ తర్వాత తన లవ్ బ్రేకప్ అవుతుంది. మరోవైపు మధుమిత సైతం మరో అబ్బాయి ఆకాష్(వీజే పప్పు)తో ప్రేమలో ఉంటుంది. ఆమె కూడా ప్రేమలో చాలా దూరం వెళ్తుంది. అది స్వయంగా చంద్రు చూస్తాడు. చంద్రు లవ్ ట్రాక్ కూడా మధు చూస్తుంది. ఇలా విచిత్రంగా సాగే ఈ లవ్ స్టోరీలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? తమ గత ప్రేమలకు గుడ్‌బై చెప్పి ఈ ఇద్దరు ఎలా కలిశారనేది ఈ చిత్ర కథ.
`బన్ బట్టర్ జామ్` మూవీ విశ్లేషణ
`బన్ బట్టర్ జామ్` ఇదొక ట్రెండీ లవ్ స్టోరీ. నేటి యువతరం ఎలా ఉందనేది స్పష్టంగా కళ్లకి కట్టినట్టు చూపించిన మూవీ. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. అదే సమయంలో మంచి ఫ్యామిలీ అంశాలను మేళవిస్తూ తెరకెక్కించడం విశేషం. ఇప్పుడు ప్రేమ విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ఉన్నారనేది ఇందులో స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. మొదట లలిత, ఉమల ఫ్యామిలీ రిలేషన్, వారు తమ పిల్లల పెళ్లిళ్ల గురించి చర్చించుకోవడం, తమ పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవడం చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వీరి పిల్లలు చేసే ఎదవ పనులను పరిచయం చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరు తల్లులు కాస్త తమ పిల్లలకు పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకోవడం వంటి సీన్లతో సినిమా ప్రారంభించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లని కామెడీగా నడిపించారు. వీరి సీన్లు ఆద్యంతం నవ్వుకునేలా ఉంటాయి. మరోవైపు చంద్రు కాలేజీ లైఫ్, ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేయడం, సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేయడం వంటివి చూపించి, అనంతరం లవ్ ట్రాక్‌ల వైపు కథని తిప్పారు. ఇంజనీరింగ్ కాలేజీకి బిక్కుబిక్కు మంటూ భయపడుతూ వెళ్లిన చంద్రు ఫస్ట్ డేనే ఓ అమ్మాయిని ఫిదా చేస్తాడు. ఆమెతో లవ్ సీన్లు కొత్తగా అనిపిస్తాయి. యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. అందులో కొన్ని బోల్ద్ సీన్లు కూడా ఉన్నాయి. మొదటి భాగం అంతా పేరెంట్స్ ఫన్నీ సీన్లు, పిల్లల బోల్డ్ లవ్ సీన్లతో సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా ఉంటుంది. లవ్ బ్రేకప్‌లతో ఎమోషనల్‌గా మారుతుంది. ఆ తర్వాత హీరో కెరీర్ పై ఫోకస్ పెట్టడంతో సాగుతూ చివర్లో ప్రేమకి ట్రెండీగా ముగింపు పలకడం ఆకట్టుకుంది. పెళ్లికి ముందు ప్రేమకథలు ఎన్ని ఉన్నా, గతం గతః అనుకొని వెళ్లిపోవడమే అని చెప్పిన తీరు నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది.
`బన్ బట్టర్ జామ్` హైలైట్స్, మైనస్‌లు
అయితే కామెడీ పరంగా కొంత బలవంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు లలిత, ఉమ మధ్య సీన్లలో ఫన్ అంతగా వర్కౌట్ కాలేదు. అదే సమయంలో అసహజంగా అనిపిస్తుంది. ఇంకోవైపు సెకండాఫ్ కూడా కొంత లాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కొంత రొటీన్‌గానే ఉంటాయి. కాకపోతే బీచ్ సమీపంలో ప్రేమించుకునే సీన్లు, కాలేజీలో సీన్లు కొన్ని క్రేజీగా ఉంటాయి. బ్రేకప్ సీన్ కొంత ఎమోషనల్ గా ఉంటుంది. అయితే ప్రేమలో ఫెయిల్ అయితే బాధపడుతూ అక్కడే ఆగిపోవడం కాదు, ముందుకు సాగిపోవాలి, జీవితంలో ఏదైనా సాధించాలని ప్రాక్టికల్ చెప్పిన తీరు బాగుంది. చివరికి విచిత్రమైన ప్రేమ కథలకు ముగింపు పలికిన తీరు కూడా ఓకే అనిపించేలా ఉంది. ట్రెండీ డైలాగులు, రొమాంటిక్ సీన్లు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి కథలో కూడా ఫ్యామిలీ సీన్లు పెట్టి మెప్పించిన దర్శకుడి కి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
`బన్ బట్టర్ జామ్` మూవీ నటీనటులు ప్రదర్శన
చంద్రు పాత్రలో రాజు జయమోహన్ నేటి కుర్రాళ్లకి మాత్రం బాగా కనెక్ట్ అవుతాడు. అతను అంతే సహజంగా నటించి మెప్పించాడు. అమాయకంగా కనిపిస్తూనే అదరగొట్టేశాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా మెప్పించాల్సింది. మధుమిత పాత్రలో ఆధ్య ప్రసాద్ సైతం సహజంగా చేసింది. పాత్రకి ప్రాణం పోసింది. సెటిల్డ్ గా చేసి మెప్పించింది. ఇంకోవైపు నందినిగా భవ్య త్రిఖా కూడా ఆకట్టుకుంది. రొమాంటిక్‌గా కనిపించి మెప్పించింది. చంద్రు తల్లిగా శరణ్య అదరగొట్టింది. షాక్‌లతో కూడిన ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నవ్వించే ప్రయత్నం చేసింది. అలాగే ఉమగా దేర్శిని సైతం అంతే బాగా చేసింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. చాలా వరకు సహజంగా కనిపించి కథకి యాడ్ అయ్యారు.
`బన్ బట్టర్ జామ్` మూవీ టెక్నీషియన్ల పనితీరు
నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ బాగుంది. బీజీఎం కూడా ఆకట్టుకుంది. కొన్ని లవ్ సీన్లలో క్రేజీగా ఉంది. ఎడిటింగ్ పరంగా కొంత కేర్ తీసుకోవాల్సింది. అలాగే విజువల్స్ బాగున్నాయి. నేచురల్‌గా ఉన్నాయి. దర్శకుడు రాఘవ ఎంచుకున్న కథ బాగుంది. ట్రెండీగా ఉంది. అయితే కొంత అరవ ఛాయలు కనిపిస్తాయి. అవి మన తెలుగు ఆడియెన్స్ కి ఇబ్బంది పెడతాయి. కాకపోతే ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా తెరకెక్కిన తీరు బాగుంది. అదే సమయంలో ప్రేమ విషయంలో, బ్రేకప్‌ల విషయంలో ఇచ్చిన సందేశం కూడా బాగుంది. ఫన్, లవ్, ఫ్యామిలీ, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలను మేళశించడం విశేషం. డబ్బింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. ఓవరాల్‌గా యూత్‌కి కనెక్ట్ అయ్యే మూవీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఫైనల్‌గాః ట్రెండీ లవ్ స్టోరీ `బన్ బట్టన్ జామ్`
రేటింగ్‌ః 2.75