`బిగ్ బ్రదర్` మూవీ రివ్యూ, రేటింగ్..
నటుడు శివ కంఠమనేని హీరోగా మెప్పిస్తున్నాడు. కంటెంట్ మెయిన్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఇప్పుడు `బిగ్ బ్రదర్`తో వచ్చాడు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
నటుడు శివ కంఠమనేని హీరోగా వరుస చిత్రాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. విభిన్నమైన పాయింట్ ని ఎంచుకుని కమర్షియల్ అంశాలను జోడించి సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. `మణిశంకర్`, `రాఘవరెడ్డి` చిత్రాలతో మెప్పించారు. చివరగా ఆయన `మధురపూడి గ్రామం అనే నేను` మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు `బిగ్ బ్రదర్` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గోసంగి సుబ్బారావు చాలా విరామం తర్వాత తెలుగులో డైరెక్టర్‌గా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం(మే 24)న ఈ మూవీ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? శివ కంఠమనేనికి హిట్ పడిందా?, సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
శివ (శివ కంఠమనేని), గౌరి (ప్రియ హెగ్డే)లు ఒకే ఇంట్లో ఉంటారు. ఎంగేజ్మెంట్ జరిగి పదేళ్లు అయినా పెళ్లి మాత్రం చేసుకోరు. శివ సోదరుడు సూర్య (శ్రీ సూర్య) కాలేజ్ నుంచి హైద్రాబాద్‌లోని ఇంటికి వస్తుండగా అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ నుంచి తమ్ముడ్ని కాపాడుకుంటాడు శివ. బయటకు వెళ్లకు.. వెళ్తే ప్రమాదం అని చెప్పినా కూడా సూర్య వినడు. అన్న మాటను పట్టించుకోడు. వదినకు కాకమ్మ కబుర్లు చెబుతూ బయటకు వెళ్తుంటాడు. అలా బయటకు వెళ్లిన సూర్య.. పూజ (ప్రీతి)ను చూసి ఇష్టపడతాడు. ఇక పూజ సైతం సూర్యను ఇష్టపడుతుంది. ఒకసారి సూర్య, పూజల మీద అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ సూర్య మీద జరిగిందని శివ అనుకుంటాడు. కానీ పూజ కోసం అటాక్ జరుగుతుంది. సూర్య, శివలు ఆ అటాక్‌ను తిప్పి కొడతారు. అసలు పూజ ఎవరు? పూజ మీద అటాక్ చేసింది ఎవరు? సూర్యకు పూజకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? శివ గతం ఏంటి? శివ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు? సినిమా అంతిమంగా ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల నుంచి యాక్షన్ మూవీస్‌ని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అంతా యాక్షన్ వైపు వెళ్తున్నారు. అవే భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు హీరో శివ కంఠమనేని. అయితే యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్లు, కమర్షియల్ అంశాలను జోడించి ఇప్పుడు `బిగ్ బ్రదర్` అనే సినిమా చేశాడు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా దర్శకుడు గోసంగి సుబ్బారావు దీన్ని తీర్చిదిద్దడం విశేషం. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకునే విషయంలో మాత్రం కొంత వరకు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ కథను దర్శకుడు రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అన్న, తమ్ముళ్ల రిలేషన్, వదిన ప్రేమ, నానమ్మ అల్లరి ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను జోడించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. కామెడీ కూడా బాగానే పండింది. ఫైట్స్, పాటలకు కరెక్ట్ ప్లేస్ మెంట్ దొరికింది. ఇంటర్వెల్ హీరోలిద్దరూ కలిసి చేసే ఫైట్ బాగుంటుంది. ఫస్టాఫ్ ఆడియెన్స్ కి అన్ని అంశాలను వడ్డించినట్టుగా ఉంటుంది. అదే సమయంలో కొన్ని సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి.
సెకండాఫ్‌లో సినిమా ఫ్లాష్ బ్యాగ్‌లోకి వెళ్తుంది. అక్కడ కాలేజ్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య గిల్లికజ్జాలు, ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకోవడం, ప్రేమ సన్నివేశాలు, హీరోయిన్ తండ్రి నుంచి వచ్చిన సమస్యలు ఇలా ప్రీ క్లైమాక్స్ వరకు ఫర్వాలేదనిపిస్తుంది. ఈ క్రమంలో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. కొత్తదనం మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ కాలేజ్ ఫ్లాష్ బ్యాక్‌తో పాటుగా ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఎందుకు శివ అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందనే పాయింట్ చక్కగా, ఎమోషనల్‌గా చూపించారు. క్లైమాక్స్‌లో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న చేసే పోరాటం, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అయితే సినిమా పరంగా కొంత రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ జస్ట్ టైమ్ పాస్లా చూసే మూవీ అవుతుంది.
నటీనటులుః
శివ కంఠమనేని శివ పాత్రలో కనిపించిమెప్పించాడు. యాక్టింగ్, యాక్షన్‌తో అదరగొట్టాడు. ప్రేమ, కోపం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మంచి ఎనర్జీ కనిపిస్తుంది. ఆ తర్వాత సూర్య పాత్రే హైలెట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో భయస్తుడిలా, సెకండాఫ్‌లో కాలేజీ కుర్రాడిలా, అల్లరి పాత్రలో మెప్పించాడు. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే అందంగా ఉంది. పూజ కారెక్టర్లో ప్రీతి గ్లామరస్‌గా ఆకట్టుకుంది. భవానీ, దేవ్, మంత్రి పాత్రలు విలనిజాన్ని చూపించాయి. నానమ్మ పాత్ర అక్కడక్కడా నవ్వులు పూయించింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపిస్తారు.
టెక్నీకల్‌గాః
`బిగ్ బ్రదర్` మూవీకి సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు చూడటానికి బాగుంటాయి. కెమెరామెన్ ప్రకాష్ కెమెరా వర్క్ ఉన్నంతలో బాగుంది. రిచ్‌గా కనిపిస్తుంది. నిడివి తక్కువగానే ఉండటం వల్ల అంత బోరింగ్‌గా అనిపించదు. నిర్మాత పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం వచ్చినట్టుగా అనిసిస్తుంది. దర్శకుడు గోసంగి సుబ్బారావు సినిమాని కమర్షియల్ వేలో రూపొందించారు. ఆ విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు. కొంత రొటీన్‌గా అనిపించినా, ఫర్వాలేదనిపించేలా ఉంటుంది.
రేటింగ్ః 2.5
నటీనటులుః
శివ కంఠమనేని, శ్రీసూర్య, ప్రియా హెగ్డే, ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ తదితరులు.
టెక్నీషియన్లుః
రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు
డాన్స్: రాజు పైడి,
స్టంట్స్: రామకృష్ణ,
ఎడిటింగ్: సంతోష్,
కెమెరా: ప్రకాష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు,
సమర్పణ: జి.రాంబాబు యాదవ్,
నిర్మాతలు: కె.ఎస్.శంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు.