- Home
- Entertainment
- Movie Reviews
- BMW Movie Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ రివ్యూ, రేటింగ్.. రవితేజ ఈ సారైనా హిట్ కొట్టాడా?
BMW Movie Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ రివ్యూ, రేటింగ్.. రవితేజ ఈ సారైనా హిట్ కొట్టాడా?
రవితేజ హీరోగా డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ మంగళవారం విడుదలైంది. మరి రవితేజకి ఎట్టకేలకు హిట్ పడిందా?

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒకప్పుడు టాప్‌లో ఉన్నారు కానీ ఇటీవల కాలంలో ఆయన గ్రాఫ్ తగ్గుతుంది. సినిమాలు వరుసగా పరాజయం చెందడంతో మార్కెట్ తగ్గిపోతుంది. ఆ జోరు లేదు. కథల ఎంపికలో జరుగుతున్న మిస్టేక్ ఆయన కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తన రూట్ మార్చాడు. ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చి `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే చిత్రంలో నటించారు. దీనికి కిశోర్ తిరుమల దర్శకుడు కావడం విశేషం. ఇందులో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎల్‌వీ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ నేడు మంగళవారం (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? రవితేజకి ఇప్పుడైనా హిట్ పడిందా? సంక్రాంతి పోటీలో విన్నర్‌గా నిలిచిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కథ ఏంటంటే?
రామ సత్యనారాయణ(రవితేజ) అనార్కలి అనే వైన్ బిజినెస్ చేస్తుంటాడు. స్పెయిల్‌లోని మానస(ఆషికా రంగనాథ్)కి చెందిన వైన్ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావాలనుకున్నాడు. కానీ రిజెక్ట్ అవుతుంది. దీంతో సమస్య ఏంటి కనుక్కోవడానికి స్పెయిన్ వెళ్తాడు. అక్కడ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఆమెకి దగ్గరై అనార్కలి వైన్ టేస్ట్ ని పరిచయం చేస్తాడు. దాన్ని ప్రమోట్ చేయాలని చెబుతాడు. కానీ అది తనదే అనే విషయాన్ని దాస్తాడు. అంతేకాదు అక్కడ మానస అసిస్టెంట్(సత్య) మోసం కూడా ఆమెకి తెలిసేలా చేస్తాడు. దీంతో రామ సత్యనారాయణతో మానస కనెక్ట్ అవుతుంది. ఇద్దరు ఫిజికల్‌గా కలుస్తారు. ఆ టైమ్‌లో కూడా తనకు బాలామణి(డింపుల్ హయతి)తో పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాస్తాడు. తిరిగి హైదరాబాద్ వచ్చాక తన భార్యతో రెగ్యూలర్ లైఫ్‌లో కొనసాగుతున్న క్రమంలో అనుకోకుండా ఓ రోజు మానస హైదరాబాద్ వస్తుంది. వైన్ ఫెస్టివల్‌లో ఇద్దరు కలుస్తారు. ఈ విషయం తన భార్యకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని మ్యానేజ్ చేస్తూ వస్తుంటాడు రామ్. కానీ మానస రెగ్యూలర్‌గా కలవాలని ఫోర్స్ చేస్తుంటుంది. అంతేకాదు అనార్కలి వైన్ హోనర్ ని కలవాలని చెబుతుంది. దీంతో దొరికిపోతామని భావించిన రామ సత్యనారాయణ మానసకి నిజం చెబుతాడు. దీంతో ఆమె రియాక్షన్ ఏంటి? మానస బాలామణిని ఎందుకు కలిసింది?. మానస విషయం భార్యకి తెలియకుండా ఎలా మ్యానేజ్ చేశాడు ? ఇద్దరి మధ్య ఎలా నలిగిపోయాడు అనేది మిగిలిన సినిమా.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విశ్లేషణ
సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలే ఆడతాయని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. ఇటీవల వరుసగా ఫ్యామిలీ ఎలిమెంట్లతోనే సినిమాలు చేస్తున్నారు. అందులోనూ భార్యాభర్తల మధ్య గొడవలు, లవర్స్ తో ఇష్యూ, వారిని మ్యానేజ్ చేసే క్రమంలో మగాడు పడే పాట్లు, ఈ క్రమంలో కామెడీని జనరేట్ చేస్తూ వస్తూ మెప్పిస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ అలానే ఉండబోతున్నాయి. అందులోనూ ఇప్పుడు రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` కూడా అదే జోనర్ మూవీ కావడం విశేషం. అయితే ఎలాంటి కథ లేకుండా వినోదాన్ని, అందులోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే క్రమంలో జనరేట్ అయ్యే కామెడీని నమ్ముకుని ఈ మూవీని తీశారు. ఇందులో కథ లేకపోవడం గమనార్హం. బలమైన కథని రాసుకుని మరింత బలమైన స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపిస్తే బాగుండేది. అయితే సందర్భానుసారంగా కామెడీని జనరేట్ చేయడంలో మాత్రం ఈ చిత్ర దర్శకుడు కిశోర్ తిరుమల సక్సెస్ అయ్యాడు. పండక్కి కావాల్సిన ఎలిమెంట్లని జోడించి మూవీని తెరకెక్కించాడు. అదిరిపోయే పాటలు, కామెడీ ఎలిమెంట్లు, ఫ్యామిలీ ఎలిమెంట్లు, గ్లామర్ ఇలా అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. ఎంటర్‌టైన్‌మెంట్ బాగానే వర్కౌట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక సినిమాగా చూసినప్పుడు ఫస్టాఫ్‌లో తనకు ఎదురైన సందర్భాన్ని చెబుతూ, బ్యాక్ వెళ్తాడు హీరో. రవితేజ తన వైన్ ప్రమోషన్ కోసం స్పెయిన్ వెళ్లడం, అక్కడ మానసని కలిసేందుకు డ్రామా ప్లేయడం ఆకట్టుకుంది. అదే సమయంలో సత్య కామెడీ కూడా నవ్వులు పూయించింది. అలా మానసకి దగ్గర కావడం, ఆమెతో కలవడం సరదాగా సాగిపోతాయి. హీరోయిన్ అందాలను బాగా చూపించి యూత్‌ని ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌కి వచ్చాక భార్య డింపుల్ రవితేజని డామినేట్ చేయడం, తన వ్యవహారాలు తెలియకుండా రవితేజ మ్యానేజ్ చేయడం నవ్వుకునేలా ఉన్నాయి. ఈ క్రమంలో వెన్నెల కిశోర్, రవితేజ మధ్య కామెడీ బాగానే ఉంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ చిన్న ట్విస్ట్ తో ముంగించడం ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం భార్యతో, అటు లవర్‌తో హీరో నలిగిపోవడం చుట్టూనే సాగుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు, తన అసిస్టెంట్ వెన్నెల కిశోర్, ఫ్రెండ్ సునీల్ తో ఆడే డ్రామా ఆద్యంతం ఆకట్టుకుంది. సునీల్ సీన్లు కూడా నవ్వించేలా ఉంటాయి. దీనికితోడు రోహన్ కామెడీ కూడా కొంత వరకు మెప్పించింది. క్లైమాక్స్ రెగ్యూలర్‌గానే ముగించారు. మగాళ్ల మనస్తత్వాలను చెప్పిన తీరుఆకట్టుకుంటుంది. భర్తలకు సంబంధించిన సందేశం బాగుంది. అదే సమయంలో డబ్బింగ్ సినిమాలపై వేసిన డైలాగ్‌లు అదిరిపోయాయి. దీనికితోడు కార్తీక దీపం సాంగ్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ప్లస్ లు, మైనస్ లు
సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు చూస్తే, కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. డ్రామా పండింది. సత్య కామెడీ, ఇటు వెన్నెల కిశోర్‌తో రవితేజ ఫన్, ఆయనలోని మరో రవితేజ బయటకు రావడం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోయే సీన్లు కూడా ఆకట్టుకున్నాయి. పాటలు బాగున్నాయి. ఫ్యామిలీ డ్రామా ఫర్వాలేదనిపించింది. బీజీఎం కూడా మెప్పించింది. చివర్లో ఇచ్చే సందేశంలో ఆడవారికి బాగా నచ్చుతుంది.
కానీ సినిమాలో అసలు కథ లేదు. సీన్ల మీద సినిమాని నడిపించారు. డింపుల్‌తో సీన్లు కొన్ని ఓవర్‌గా అనిపిస్తాయి. రొటీన్ కామెడీ సీన్లు, ఊహించేలా కథ ఉండటం. ఫైట్‌సీన్లు కూడా ఇరికించినట్టుగానే ఉన్నాయి. క్లైమాక్స్ లో సంక్రాంతి డ్రామా. రెగ్యూలర్ ముగింపు వంటివి మైనస్‌గా చెప్పొచ్చు. తారక్ పొన్నప్ప ఎపిసోడ్ కూడా తేలిపోయింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
రామ సత్యనారాయణగా రవితేజ ఇరగదీశాడు. తనలోని వింటేజ్ రవిని బయటకు తీశాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోయే సీన్లలో రవితేజ నటన అదిరిపోయింది. డాన్సులతోనూ మెప్పించాడు. మగాళ్లకి సంబంధించి ఆయన చెప్పిన నిజాలు ఆకట్టుకుంటాయి. బాలామణి పాత్రలో డింపుల్ ఫర్వాలేదు. కాకపోతే ఒకే ఎక్స్ ప్రెషన్ తోనే కనిపించింది. ఇక ఆషికా రంగనాథ్ లోని కొత్త యాంగిల్ చూడొచ్చు. గ్లామర్‌తో కట్టిపడేసింది. నటన పరంగానూ మెప్పించింది. ఆషికా అసిస్టెంట్‌గా సత్య ఫస్టాఫ్‌లో నవ్వించాడు. క్లైమాక్స్ లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రవితేజ అసిస్టెంట్‌గా వెన్నెల కిశోర్ ఎప్పటిలాగే నవ్వించాడు. సైకాలజిస్ట్ గా మధుసూధన్ గౌడ్ కామెడీ నవ్విస్తుంది. అలాగే రోహన్ కూడా తనదైన కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు. తారక్ పొన్నప్ప ఫర్వాలేదనిపించాడు. సునీల్ చాలా రోజుల తర్వాత తన కామెడీతో అలరించాడు. తన వింటేజ్‌ని చూపించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టెక్నీషియన్ల పనితీరు
భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. వినేలాగా, డాన్సులు వేసేలా ఉంది. సినిమాకి పాటల ప్లస్‌అయ్యాయి. బీజీఎం కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా వర్క్ అదిరిపోయింది. విజువల్స్ ఫ్రెష్‌గా, కనువిందుగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సినిమాని షార్ట్ అండ్ స్వీట్‌గా కట్ చేశారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ కూడా ఆకట్టుకుంది. దర్శకుడు కిశోర్ తిరుమల బలం ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఎమోషన్స్. వాటిని దాటి అటు ఇటు వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. కథకంటే కామెడీ సీన్లకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. బాగానే డీల్ చేశాడు. కాకపోతే బలమైన కథ రాసుకుని ఇంకా బాగా చేయాల్సింది. ఫ్యామిలీ ఎమోషన్స్ లేకపోవడం పెద్ద మైనస్. కామెడీ సీన్లు కూడా కొన్ని ఇరికించినట్టుగా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే సరదాగా నవ్వుకునే సినిమా తీశాడని చెప్పొచ్చు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫైనల్ నోట్
ఈ సంక్రాంతికి జస్ట్ టైమ్ పాస్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నవ్వుకోవచ్చు.
రేటింగ్ 2.75

