Bhama Kalapam : ప్రియమణి 'భామాకలాపం' రివ్యూ
ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు బి నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Bhama Kalapam
క్రైమ్ కామెడీ సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. దొంగతనం , వాటి చుట్టూ తిరిగే పోలీసుల చేజింగ్‌లు ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటాయి. అయితే అవి అప్పుడప్పుడూ మాత్రమే మన తెలుగులో పలకరిస్తూంటాయి. అయితే ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులది ఓ విభిన్నమైన పంథా. కమర్షియల్ కథల జోలికి వెళ్లకుండా కాన్సెప్ట్ ని నమ్ముకుంటున్నారు. దర్శకులుగా తమని నిరూపించుకునే కథల కోసం అన్వేషిస్తున్నారు. ఆ ప్రయాణంలో వాళ్లకు మంచి విజయాలు కూడా దక్కుతుంటాయి. అప్పట్లో వర్మ తీసిన అనగనగా ఓ రోజు చిత్రం, సుధీర్ వర్మ స్వామీ రారా... రీసెంట్ గా తెలుగులోనూ బ్రోచేవారెవరురా, `రాజ రాజ చోర` వంటి తో కాన్సెప్ట్ కూడిన క్రైమ్ కామెడీ కథలు వచ్చి కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాంబినేషన్ తోనే.. `భామాకలాపం` చేశారు. ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ మొత్తం వైవిధ్యంగా సాగింది. అదే కొత్తదనం… `భామాకలాపం`లో కనిపించిందా? ఈ క్రైమ్ కామెడీ మరోసారి కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిందా, లేదా? చూద్దాం.
Bhama Kalapam
కథేంటి?
మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అనుపమ (ప్రియమణి) తెలివైంది...మోడ్నర్న్ గా ఉంటుంది. యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఆమెకు ఓ వీక్నెస్ లాంటి అలవాటు లాంటి ఆసక్తి. అది ప్రక్కింట్లోకి తొంగి చూడటం. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకోవటం. తన కిటీకినుంచి అన్ని అబ్జర్వ్ చేసే ఆమె ..పనిమనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) సాయింతో కూపీలు లాగగలదు. ఈ సరదాతో ఓ సారి ప్రక్కింట్లో మొగడు పెళ్ళాల గొడవ మ్యాటర్ తేలుద్దామని వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతుంది. అనుకోకండా మర్డర్ కేసులో ఇరుక్కుపోతుంది. అంతేకాదు... నాయర్ (జాన్ విజయ్) అనే విలన్ తో లేని పోని తలనొప్పి తెచ్చుకుంటుంది. నాయర్ ఫోన్ చేసి… రెండు వందల కోట్ల విలువ చేసే కోడుగుడ్డు గురించి అనుపమను హెరాస్ చేస్తాడు. అసలు ఈ నాయర్ ఎవరు ..కోడిగుడ్డు మ్యాటర్ ఏంటి.. ? అనుపమ ఈ చిక్కుల్లో ఎలా బయట పడింది? డేనియల్ బాబు (కిశోర్ కుమార్) ఎవరు? ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పల్లవి (శాంతి రావ్) ఈ కేసులో ఏం తెలుసుకుంటుంది? వంటి విషయాలు తెలియాలంటే ఆహాలోకి వెళ్లి ‘భామా కలాపం’ చూడాల్సిందే.
Bhama Kalapam
విశ్లేషణ
ఇప్పటి తరం కొత్త దర్శకులు..వాస్తవ జీవితాలను పట్టుకుని,వాటిలోని కొత్త కోణాల్ని స్పృశిస్తూ ఫిక్షన్ కథల్ని సిద్ధం చేస్తున్నారడనంలో ఏమాత్రం సందేహం లేదు. వాటిని నమ్మి భుజాన మోసేందుకు ప్రియమణి వంటి హీరోయిన్స్ కూడా ఇప్పుడుండటం కలిసొచ్చే విషయం. ఇలాంటి సినిమాకి కథ,కథనం ఎంత ముఖ్యమో యువ దర్శకులకి బాగా తెలుసు. అందుకు తగ్గట్టే కసరత్తులు చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. అభిమన్యు కూడా రైటింగ్ టేబుల్‌పైనే బలంగా సినిమాని సిద్ధం చేసుకున్నాడనే చెప్పాలి. అయితే సినిమాని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో కాస్త తడబడినా మొత్తంగా పర్వాలేదనిపిస్తాడు. బాగుందనిపిస్తాడు.
ఓ నాలుగు నెలల క్రితం హాలీవుడ్ స్టార్స్ డ‍్వేన్ జాన్సన్, ర్యాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్ తో 'రెడ్ నోటీస్' అనే సినిమా వచ్చింది. అందులోనూ ఫాబెర్జ్ ఎగ్స్(Faberge Egg) దొంగతనం చుట్టూ కథ తిరుగుతుంది. యాక్షన్స్, అడ్వెంచర్స్‌తో పాటు వచ్చే ట్విస్ట్‌లతో ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అది హాలీవుడ్ ఆలోచన అయితే భామా కలాపం లోకల్ థాట్. చాలా వరకూ కామెడీ తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేసారు. సినిమా ప్రారంభం ఎగ్ ఇంపార్టెన్స్ గురించే ఎపిసోడ్ చూసి అమెచ్యూర్ గా ఉందేమో అని కాస్త కంగారుపడతాము. అయితే ప్రియమణి పాత్ర పరచయం, ఆమె ప్రపంచంలోకి వచ్చాక లీనమైపోతాము.
Bhama Kalapam
చాలా సహజంగా ఆ సీన్స్ డీల్ చేయటంతో ఆ కథేదో మన ఇంటి ప్రక్కనే జరుగుతుందేమో అనిపిస్తుంది. అసలు కథ అయిన ప్రియమణి పాత్ర ఓ మర్డర్ మిస్టరీ లో ఇన్వాల్వ్ అవటం, పోలీస్ ఇన్విస్టిగేషన్ తో మొదలు కావటంతో ఇంట్రస్టింగ్ గా మారుతుంది. అలా ఎక్కడికక్కడ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ని ఎంచుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గా , ప్లాట్ గా ఉండటం మాత్రం ఇబ్బంది పెడుతుంది. అందుకు లాజిక్స్ వదిలేసి సినిమాటెక్ లిబర్టీస్ తీసుకోవటం కూడా కొంతవరకూ కారణం కావచ్చు. చిత్రాన్ని కేవలం యాక్షన్, క్రైమ్ సీన్స్‌తోనే కాకుండా కామెడీ ఎంటర్‌టైనర్‌గా కూడా రూపొందించటమే కలిసి వచ్చింది.
తొలి సగంలో అసలు కథే కనిపించదు..కేవలం సెపట్ ,ప్రధాన పాత్రల పరిచయం, వాటి పరిణామ క్రమంలో జరిగే సంఘటనలతో ముందుకు వెళ్తుంది. అయితే… ప్రతీ సన్నివేశంలోనూ కామెడీ టచ్ ఉండటం ప్లస్ అయ్యింది. మరీ పగలబడి నవ్వేయలేం కానీ.. ఆయా సీన్స్ సరదాగా సాగుతూ.. జోష్ ఇస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ మాత్రం చాలా బాగుంది. అలాగే క్లైమాక్స్ కూడా ను. దర్శకుడు సెకండాఫ్ లో డ్రామాపైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ పండినా…ఫన్ చెడలేదు.
Bhama Kalapam
టెక్నికల్ గా....
దర్శకుడుగా అభిమన్యు ప్రతీ ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా సూపర్ ఫైన్ గా ఉండేలా చూసుకున్నాడు. ఆర్టిస్ట్ ల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ తీసుకున్నారు. నటిగా ప్రారంభ రోజుల్లోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రియమణిని ఈ పాత్రకు ఎంచుకోవటమే అతను చేసిన మొదట తెలివైన పని. అలాగే చిత్రంలోని విజువల్స్ చాలా బాగున‍్నాయి.
టెక్నికల్ టీమ్ చిన్న సినిమాకు పెద్ద వాళ్ళను తీసుకున్నారు. టీమ్ మొత్తం మంచి పనితీరుని కనబరిచింది. కెమెరా, సంగీతం విభాగాలు కథకి ప్రాణం పోశాయి. దర్శకుడు రాసుకున్న డైలాగులు బాగున్నాయి.
Bhama Kalapam
నటీనటుల్లో ...
ప్రియమణి తన నటనతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. పాత్రకు తనదైన ఎక్సప్రెషన్స్ తో intensity ని క్రియేట్ చేసి డ్రామా పండించటం ప్లస్ అయ్యింది. హౌస్ వైఫ్ గా...చిన్న సైజ్ డిటెక్టివ్ గా ఆమె తనదైన శైలిలో చేసుకుంటూ పోయింది. సినీ కెరీర్ పరంగా దాదాపు ఫేడవుట్ అయిన ప్రియమణికి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది. తిరిగి తన సినీ ప్రయాణం మొదలెట్టేందుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రియమణిపై అంచనాలతో చూస్తే తను మిమ్మల్ని కచ్చితంగా నిరాశపరచదు.
Bhama Kalapam
ఫైనల్ థాట్
'ఆహా'లో అదిరిపోయే మళయాళ సినిమాలే కాదు చూడదగ్గ తెలుగు సినిమాలు అప్పుడప్పుడు వస్తున్నాయి.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.75
Bhama Kalapam
ఎవరెవరు..
నటీనటులు: ప్రియమణి, శాంతిరావు, జాన్ విజయ్, శరణ్య తదితరులు
ఎడిటర్: విప్లవ్
సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరగార
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్
నిర్మాతలు: బాపినీడు, సుధీర్
దర్శకత్వం: అభిమన్యు తడిమేటి
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022 (ఆహా ఓటీటీలో)