`భలే ఉన్నాడే` మూవీ రివ్యూ, రేటింగ్
వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. `భలే ఉన్నాడే` అనే చిత్రంలో నటించాడు. నేడు ఈ మూవీ విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
హీరో రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఆరోపిస్తుంది. తనని వదిలేసి మరో హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. ఇటీవల ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఓ వైపు ఈ వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
మరోవైపు ఆయన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. ఇటీవలే రెండు సినిమాలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు `భలే ఉన్నాడే` అనే సినిమాతో వచ్చాడు రాజ్ తరుణ్. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం కావడం విశేషం. మనీషా కందుకూర్ ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. శివ సాయి వర్థన్ దర్శకత్వం వహించారు.
ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా నేడు శుక్రవారం(సెప్టెంబర్ 13)న విడుదలైంది. మరి ఈ సారైనా రాజ్ తరుణ్‌కి హిట్ పడిందా? హ్యాట్రిక్ ఫ్లాప్ చవిచూడాల్సి వచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 8 మైక్రో సైట్‌ః ఒక క్యారెక్టర్ లో ఇన్ని షేడ్షా! అంతలోనే బ్రేకప్ అండ్ లింకప్!
కథః
రాధా(రాజ్ తరుణ్)కి సింగిల్ మదర్. అమ్మతోనే ఉంటాడు. తండ్రి లేరు. అమ్మ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటుంది. రాధా శారీ డ్రేపర్‌గా వర్క్ చేస్తుంటాడు. విశాఖలో అతను చాలా ఫేమస్. రాధా పెళ్లి కూతురుకి చీరకట్టాడంటే అదిరిపోవాల్సిందే. అయితే అతని విషయంలో అందరిలోనూ ఒకటే కన్‌ఫ్యూజన్. పేరు రాధా కావడంతో అంతా అమ్మాయేమో అనుకుంటారు.
ఆయన కూడా చీరలు కట్టుకుంటూ ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే మనోడిలో మ్యాటర్ లేదని భావిస్తుంటారు. అంతేకాదు వంటలు కూడా టేస్టీగా చేస్తాడు. ఆయన కర్రీస్‌కి అమ్మ పని చేసే బ్యాంక్‌లో కృష్ణ(మనీషా కందుకూర్) అనే అమ్మాయి ఫిదా అయిపోతుంది. వంటలను చూసే ప్రేమలో పడిపోతుంది.
మరోవైపు ఓ పెద్దింటి అమ్మాయి పెళ్లికి సంబంధించి షాపింగ్ అన్ని రాధానే చూసుకోవాల్సి వస్తుంది. ఆ పెళ్లి కూతురు తన ఫ్రెండ్ కృష్ణ సాయం తీసుకుంటుంది. ఈ ముగ్గురు కలిసి షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో రాధా, కృష్ణల మధ్య గొడవలు అవుతుంటాయి. కృష్ణ సెలెక్షన్‌ని ఆమె ఫ్రెండ్ నో చెబుతూ, రాధా సెలెక్షన్‌ని ఓకే చేయడంతో రగిలిపోతుంది.
దీంతో ఇద్దరికి పడదు. అయితే రాధా తన బ్యాంక్ కొలిగ్ కొడుకు అని కృష్ణకి తెలియదు. ఆ విషయం తెలియకుండానే టిఫిన్ బాక్సుల ద్వారా ప్రేమ రాయబారాలు నడుస్తుంటాయి. మొత్తానికి బ్యాంక్ యానివల్ ఈవెంట్‌లో ఇద్దరు కలుసుకుంటారు. తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. ప్రేమని ఇంట్లో కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటారు.
కానీ అప్పటికే పెళ్లైన కృష్ణ ఫ్రెండ్ తన భర్తకి మ్యాటర్ లేదని, ఫస్ట్ నైట్‌రోజే తేలిపోయిందని చెప్పి ట్విస్ట్ ఇస్తుంది. దీంతో రాధా ప్రవర్తన కూడా అలానే ఉండటంతో అతనిపై అనుమానం వస్తుంది. ముద్దు పెట్టుకునేందుకు ఒప్పుకోడు, హగ్ చేసుకోడు, దగ్గరికి వస్తే దూరం పెడుతుంటాడు. దీంతో రాధాపై కృష్ణకి అనుమానం వస్తుంది.
ఓ ఆశ్రమానికి కూడా తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించాలనుకుంటుంది. కానీ రాధా సహకరించడు. అక్కడ ఓ రోజు కొందరు కుర్రాళ్లు కృష్ణని ఎత్తుకుపోయి రేప్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి వాళ్ల నుంచి తన కృష్ణని కాపాడుకున్నాడా? అసలు రాధాలో మ్యాటర్ ఉందా? ఆయన మగాడేనా? రాధా అలా ఉండటానికి కారణమేంటి? ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. లావణ్య మ్యాటర్ పెద్ద రచ్చ అవుతుంది. దీనికితోడు మరో హీరోయిన్‌తో ఆయన సహజీవనం చేస్తున్నాడనేది చర్చనీయాంశం అవుతుంది. ఇలా ఈ కేసులో రాజ్ తరుణ్ చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. కానీ ఆయన్నుంచి వస్తున్న సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి.
రొటీన్ కథలు, సాహసోపేతమైన కథలతో సినిమాలు చేస్తూ విజయం కోసం దండయాత్ర చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు `భలే ఉన్నాడే` చిత్రంతోనూ అలాంటి ప్రయోగమే చేశాడు రాజ్ తరుణ్. అయితే కథ పరంగా ఇది ట్రెండీ స్టోరీనే. నేటి సమాజంలో చాలా మంది మగాళ్లు ఇలానే ఉంటున్నారనేది వాస్తవం. ఇలాంటి మంచి కంటెంట్‌ని ఎంపిక చేసుకోవడమనేది పెద్ద సాహసం.
ఓ వైపు తన చుట్టూ ఇన్ని వివాదాలు, అనేక ఆరోపణల మధ్య ఇలాంటి కథ చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఆ విషయంలో రాజ్ తరుణ్ డేర్‌కి అభినందించాల్సిందే.
ఈ సినిమా ద్వారా ఓ బలమైన పాయింట్‌ని టచ్ చేశాడు దర్శకుడు. ఇంకా చెప్పాలంటే ఇందులో రెండు మూడు పాయింట్లు ఉన్నాయి. ఒకటి ప్రస్తుతం చాలా మంది మగాళ్లల్లో మ్యాటర్ ఉండటం లేదనే సున్నితమైన సబ్జెక్ట్ ని టచ్ చేయడం, రెండోది తన వృత్తి రీత్యా ప్రవర్తనని రియల్ లైఫ్‌కి ఆపాదించే సమాజం ఉండటం, మూడోది పెళ్లికి ముందే లవర్స్ కలవడం, ఆ తర్వాత పరిణామాలు ఎంతటి దారుణంగా ఉంటాయో ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు శివసాయి వర్థన్.
సినిమాలో ప్రారంభం నుంచి రాజ్ తరుణ్ పాత్రని అమ్మాయిలా ప్రవర్తించే అబ్బాయిలానే చూపించాడు. అతని మాట, వ్యవహారం, ప్రవర్తన అన్నీ ఏదో తేడాలాగే ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు తను చీరకడుతుంటే పడిపోవడం, ఆయనతో రొమాన్స్ కి సిద్దమవడం, కానీ తను మాత్రం దూరం పెట్టడం, ఈ క్రమంలో పుట్టే ఫన్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంటాయి.
ఆ తర్వాత హీరోయిన్ తో గొడవలు సైతం అంతే ఫన్నీగా ఉంటాయి. ప్రేమని వ్యక్తం చేసుకున్నాక హీరోయిన్ రాజ్ తరుణ్‌తో ముద్దులు, హగ్గులు, రొమాన్స్ ఆశిస్తుంది. ఆయన తిరస్కరిస్తుంటాడు. ఈ సన్నివేశాలకు సంబంధించిన సీన్లు కామెడీగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ఇలా సరదాగనే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు పట్టు తప్పాడు.
కథని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాడు. ఓ ట్రాక్ మీదకు తిప్పలేదు, అనేక మలుపులు తిప్పించి కన్‌ఫ్యూజ్ చేశాడు. తానూ కన్ ఫ్యూజ్ అయ్యాడు. మొత్తంగా తికమక చేసి వదిలేశాడు. ఫైనల్‌గా ఎమోషనల్ ట్రాక్ ఎంచుకున్నాడు. రాజ్ తరుణ్ తండ్రికి సంబంధించిన బ్యాక్ స్టోరీ చెబుతూ, తాను ఎందుకు అలా ఉంటున్నాడో చెప్పిన విధానం ఎమోషనల్‌గా ఉంది. కానీ కన్విన్సింగ్‌గా లేదు. ఇదే ఈ సినిమాలో పెద్ద మైనస్.
ఫస్టాఫ్‌లో ఫన్ ఓకే, కానీ ఈ సినిమా ద్వారా అసలు ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. రెండు మూడు అంశాలను ఇందులో జోడించారు. కానీ ఏది బలంగా చూపించలేదు. సెకండాఫ్‌లో ఎక్కడికెక్కిడో తిప్పడంతో అసలేం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. హీరో అలా మారడానికి కారణం బలంగా చెప్పలేదు.
అదే సమయంలో రాజ్ తరుణ్ ఆడవారిలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో క్లారిటీ లేదు. తన గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడవాళ్లకి దూరంగా ఉండటం ఓకే, అమ్మాయి ప్రవర్తన చూపించడానికి లాజిక్ ఏంటనేది సస్పెన్స్. అతనికి ట్రీట్‌మెంట్ ఇప్పించేందుకు హీరోయిన్ తీసుకెళితే ఎందుకు నో చెప్పలేదు, ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడనేది సస్పెన్స్.
అయితే అందులో ప్రేమ ఉందని చెప్పినా, సీన్లలో ఆ ఎమోషనల్ పండలేదు. రాజ్ తరుణ్ చేసే వంటల వల్ల హీరోయిన్ పడిపోవడమనేది లాజిక్ లెస్ అదే సమయంలో, ఆమెని దూరం పెడుతున్నా, అతని వెంటపడేంత ఏముందనేది అనేది డౌట్. ప్రేమలో పడే సీన్లు, అతని ప్రేమ కోసం తపించే సీన్లలో ఏమాత్రం సహజత్వం కనిపించలేదు. ముఖ్యంగా ఫీల్ లేదు. సెకండాఫ్‌ని సరిగ్గా డీల్ చేసి ఉంటే `భలే ఉన్నాడే` అనేది మంచి సినిమా అయ్యేది.
నటీనటులుః
రాధా పాత్రలో రాజ్ తరుణ్ బాగా చేశాడు. చాలా సెటిల్డ్ గా మెప్పించాడు. అదే సమయంలో మగాడిగా ఉంటూ అమ్మాయిలా ప్రవర్తించడమనేది బిగ్ టాస్క్. ఆ విషయంలో రాజ్ తరుణ్‌కి మంచి మార్కులే పడతాయి. నటుడిగా అతనిలోని మెచ్యూరిటీని ప్రతిబింబిస్తుంది. అమ్మాయిలా చీరకట్టి డాన్స్ చేసి విజిల్స్ వేయించుకున్నాడు.
ఇక కొత్త అమ్మాయి మనీషా కందుకూర్ తొలి చిత్రంతోనే మెప్పించింది. రాజ్ తరుణ్‌ని కొన్ని సీన్లలో డామినేట్ చేసింది. ఈ ఇద్దరే సినిమాకి మెయిన్ పిల్లర్స్. వీరితోపాటు రాజ్ తరుణ్ మదర్‌గా అభిరామి బాగా చేసింది. తనే హీరోయిన్‌లా ఉంటూ అమ్మలా మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి పాత్ర చేయడమే పెద్ద సాహసం.
గోపరాజు రమణ తనకు యాప్ట్ గా నిలిచే పాత్రలో అదరగొట్టాడు. సుదర్శన్ చివర్లో కామెడీ నవ్వులు పూయించింది. రచ్చ రవి కాసేపు ఓ మెరుపు మెరిశాడు. వీటీవీ గణేష్ ఫన్ కూడా బాగుంది. తనదైన స్టయిల్‌లో నవ్వించాడు. హైపర్ ఆది కామెడీ ఫస్టాఫ్‌లో మెప్పిస్తుంది. కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, సింగీతం లు కూడా అలరించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
సినిమాకి శేఖర్ చంద్ర పాటలు బాగున్నాయి. సినిమా రేంజ్‌ని పెంచాయి. వినసొంపుగానూ, కొత్తగానూ ఉన్నాయి. ఆర్‌ఆర్ సైతం ఆకట్టుకుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. సినిమా గ్రాండ్‌నెస్ ని పెంచాయి. ఎడిటింగ్ పరంగా చాలా లోపాలున్నాయి. సెకండాఫ్‌లో కన్ ఫ్యూజన్ క్రియేట్ చేసే సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు శివ సాయి వర్దన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్‌లో తడబడ్డాడు. ఫస్టాఫ్‌లా సెకండాఫ్‌ని డీల్ చేయలేకపోయాడు. మల్టీఫుల్ ఎమోషన్స్ చూపించే క్రమంలో కథ ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. మెయిన్ ఎమోషన్స్ ఇందులో మిస్ అయ్యింది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఫలితం బాగుండేది.
ఫైనల్‌గా ః `భలే ఉన్నాడే`.. భలే ఉందనిపించుకోలేకపోయింది. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం మాదిరిగానే ఆయన ఎంచుకుంటున్న సినిమాలుండటం గమనార్హం.
రేటింగ్‌ః 2