`భజే వాయు వేగం` మూవీ రివ్యూ, రేటింగ్..
హీరో కార్తికేయ హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. `ఆర్‌ఎక్స్100` లాంటి బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు `భజే వాయు వేగం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. మరి ఇది హిట్ ఇచ్చిందా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
హీరో కార్తికేయకి `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఆ స్థాయి హిట్ పడటం లేదు. నాలుగైదు సినిమాలు చేసినా ప్రయోజనం లేదు. విలన్‌గా మారినా హిట్ పడలేదు. గతేడాది `బెదురులంక`తో ఫర్వాలేదనిపించాడు. నెక్ట్స్ లెవల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఇప్పుడు `భజే వాయు వేగం` చిత్రంతో వస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటించింది. `హ్యాపీడేస్` ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటించాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా రూపొందింది. నేడు శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
వెంకట్(కార్తికేయ) తన స్నేహితుడు చనిపోవడంతో అతని కొడుకు వెంకట్(కార్తికేయ)ని చేరదీస్తాడు. తన కొడుకు రాజా(రాహుల్ టైసన్)తోపాటుగా వెంకట్‌ని చిన్న కొడుకుగా భావించి పెంచి పెద్ద చేస్తాడు. లక్ష్మయ్య భార్య కూడా చనిపోవడంతో ఈ ఇద్దరు పిల్లలకు తనేకి అమ్మా నాన్న అవుతాడు. వెంకట్‌లో క్రికెట్‌లో ఉన్న టాలెంట్ చూసి ఆ దిశగా ఎంకరేజ్ చేస్తాడు. మరోవైపు రాజా చదువుపైనే ఫోకస్ పెడతారు. పెద్దయ్యాక వీరిని హైదరాబాద్ పంపిస్తాడు. అందుకోసం ఉన్న పొలంలో కొంత అమ్ముకోవాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో వెంకట్, రాజా బాగా సెటిల్ అయినట్టుగా తండ్రి వద్ద కవరింగ్ చేస్తారు. కానీ వెంకట్ క్రికెట్‌లో సెలక్ట్ కాలేదు. సెలక్ట్ కావాలంటే పది లక్షలు అడుగుతారు సెలెక్టర్లు. మరోవైపు రాజా తెలుగు మీడియం కావడంతో జాబ్ కష్టమవుతుంది. జాబ్ కావాలంటే ఐదు లక్షలు కావాలంటాడు మేనేజర్. దీంతో ఐదు లక్షల కట్టి జాబ్ తెచ్చుకున్నా, ఫేక్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిసి జాబ్ నుంచి తొలగిస్తారు. దీంతో ఓ పెద్ద హోటల్‌లో సర్వెంట్‌గా పనిచేస్తుంటాడు రాజా. ఈ ఇద్దరు పైసా పైసా కూడబెట్టి తమ కోసం అమ్మిన పొలాన్ని మళ్లీ నాన్నకి ఇవ్వాలని భావిస్తుంటారు. అయితే వెంకట్ డబ్బుల కోసం క్రికెట్ బెట్టింగ్ అడుగుంటుంది. ఇంతలో వాళ్ల నాన్న అనారోగ్యానికి గురవుతాడు. పొలంలో వాడే పురుగుల మందుల కారణంగా ఆయన లంగ్స్ దెబ్బతిన్నాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతారు. ఆ డబ్బు కోసం తాను పోగు చేసిన నాలుగు లక్షలు బెట్టింగ్‌లో పెడతాడు వెంకట్. అందులో నలభై లక్షలు గెలుస్తాడు. కానీ ఆ బెట్టింగ్ హోనర్ తమపై రివర్స్ అయి బెట్టింగ్‌లో ఓడిపోయాడని తిరిగి తమకే నలభై లక్షల కట్టాలని బెదిరిస్తాడు. ఆ డబ్బు కోసం తమ హోటల్‌కి వచ్చే కస్టమర్ డానియల్‌ని కలుస్తాడు రాజా. డేనియల్(రవిశంకర్) సిటీలో పేరుమోసిన రౌడీ. మేయర్ తమ్ముడు. అతనిదే ఆ పబ్ అని తెలుస్తుంది. మరోవైపు మేయర్ కొడుకుతో వెంకట్ గొడవపడతాడు. ఇలా డేనియల్ మనుషులు వీరిని వెతుకుంటారు. మరోవైపు తండ్రిని కాపాడుకోవడానికి ఇరవై లక్షలు కావాలి. అంతలోనే కోట్ల రూపాయలు విలువ చేసే కారులో పారిపోతారు? మరి ఆ కారు ఎవరిది? అందులో ఏముంది? డేనియల్ వీరిని ఏం చేశాడు? అటు డేనియల్ మనుషుల నుంచి ఎలా తప్పించుకున్నారు, తన తండ్రిని ఎలా కాపాడుకున్నారు. ఇందులో వెంకట్ లవ్ స్టోరీ ఏంటి? చివరికి కథ ఎన్నిమలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌లో థ్రిల్లర్ ఎలిమెంట్, ట్విస్ట్ లు, రేసీగా సాగే స్క్రీన్ ప్లే ముఖ్యం. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయంటే సినిమా హిట్టే. `భజే వాయు వేగం` చిత్రంలో విషయంలో దర్శకుడు కొంత పంథాని ఎంచుకున్నాడు. దీన్ని ఎమోషనల్ మూవీగా మార్చేశాడు. తండ్రి సెంటిమెంట్‌ని మెయిన్‌గా తీసుకున్నారు. దీంతో రొటీన్‌కి భిన్నంగా మారింది. తండ్రిని కాపాడుకోవడం కోసం ఇద్దరు కొడుకులు పడే తపన, తండ్రిలో ఆనందం కోసం వారి పడే స్ట్రగుల్స్ హైలైట్‌గా ఈ మూవీని రూపొందించారు. ఎమోషనల్ యాంగిల్‌లో సినిమాని తీసుకెళ్లారు. అదే ఈ మూవీకి పెద్ద ప్లస్. అదే సినిమాని నడిపిస్తుంది. ప్రారంభంలో కొడుకుల ఆనందం కోసం తండ్రి ఏమైనా చేస్తాడనేది చూపించారు. వారి కెరీర్ కోసం ప్రాణంగా భావించే పొలం కూడా అమ్ముకోవడం చూపిస్తే, ఆ తర్వాత తండ్రి తమ పరిస్థితిని చూసి బాధ పడకుడదని కొడుకులు బాగా సెట్ అయినట్టుగా చూపించి తండ్రిని ఖుషి చేయడం ఎమోషనల్‌గా హార్ట్ టచ్చింగ్‌గా అనిపిస్తుంది. జనరల్‌గా ఇలాంటి కంటెంట్ చాలా ఏళ్ల క్రితమే తెలుగు సినిమాల్లో చూశాం. వాటితో కంపేర్ చేస్తే ఇది కొత్త కంటెంట్ ఏం కాదు, కానీ దాని ట్రీట్‌మెంట్, స్క్రీన్‌ప్లేనే ఈ సినిమాలో హైలైట్. ఆ ఎమోషనల్ యాంగిల్‌ని ప్రారంభం నుంచి తీసుకెళ్లాడు దర్శకుడు. దాన్ని తరచూ టచ్ చేస్తూనే సినిమాని నడిపించడంతో ఎక్కడ రొటీన్, బోరింగ్ అనే ఫీలింగ్ రాదు.
అయితే ప్రారంభంలో పాత్రలను పరిచయం చేయడానికి, కథని ఎస్లాబ్లిష్ చేయడానికి బాగా టైమ్ తీసుకున్నారు. దాదాపు అరగంట సినిమా బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తోనే నడుస్తుంది. ఓ వైపు వెంకట్, రాజాల చిన్ననాటి స్టోరీని, వాళ్లు పెరిగిన కథని, వారికోసం తండ్రి పడే బాధలను చూపించారు. మరోవైపు సిటీలోకి వచ్చిన ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన రౌడీల కథలను చెప్పాడు. నాన్‌లోకల్ నుంచి అవమానాలు పద్ద ఆ ఇద్దరు డేనియల్, జార్జ్ లు మేయర్‌గా, రాష్ట్ర రాజకీయాలను శాషించే నాయకులుగా ఎలా ఎదిగారో చూపించే సన్నివేశాల కోసం బాగా టైమ్ తీసుకున్నారు. దీంతో ఫస్టాఫ్ అంతా పెద్దగా కిక్ ఇచ్చేలా, ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఏదో నడుస్తుందంటే నడుస్తున్నట్టుగానే చూపించారు. దీనికితోడు వెంకట్, రాజా పాత్రలకు సంబంధించిన బాధలు ఓవర్ డోస్‌లో చూపించడంతో ఆ మోతాడు పెరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. కష్టాలకు కేరాఫ్‌గా వారి పాత్రలు నిలవడం కాస్త ఓవర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ ఇంటర్వెల్‌లో ఇచ్చే వచ్చే ట్విస్ట్ బాగుంది. సినిమాని ఎంగేజింగ్‌గా మారుస్తుంది.
సెకండాఫ్ మొత్తం సినిమా రేసీగా సాగుతుంది. రెండో భాగమే సినిమాకి మెయిన్ హైలైట్. డానియల్ పాత్ర ఎంటీ, ఆయనకు వెంకట్, రాజాలు ఇరుక్కుపోవడం, కారుని తీసుకుని పారిపోవడం, వారికోసం డేనియల్ మనుషులు, పోలీసులు వెతకడం, చివరికి వీరిని ఓ కేసులో ఇరికిండచంతో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆద్యంతం సీన్ రక్తికడుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్సుకత పెరిగేలా చేస్తుంది. క్లైమాక్స్ వరకు ఈ థ్రిల్లింగ్, రేసింగ్ ఎలిమెంట్లు ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే ఇలాంటి స్క్రీన్‌ప్లే లో ట్విస్ట్ లు బాగా ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియెన్స్. అది ఆశించిన స్థాయిలో లేదు, ఉన్నవి కూడా వాహ్ అనేలా పేలలేదు. మరోవైపు విలన్లు వీరి వెంటపడటం, వీరి పారిపోవడం వంటి సీన్లలో లాజిక్ మిస్ అయ్యింది. మరీ సిల్లీగా అనిపిస్తుంటాయి. రొటీన్‌గానూ అనిపిస్తుంటాయి. కార్తికేయ, రాహుల్ మధ్య సీన్లు కూడా అంతగా పండలేదు. కొన్ని చోట్ల ఓకే అనిపించినా, డ్రామా ఓవర్‌గా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివర్లో ఇచ్చిన ట్విస్ట్, రేసిగా కథని నడిపించిన తీరు ఆ ఫీలింగ్‌ని తగ్గిస్తాయని చెప్పొచ్చు. మొత్తంగా సినిమాకి రెండో భాగమే బలం. అదే నిలబెడుతుంది. ప్రారంభం నుంచి అలానే ఉండి, ట్విస్ట్ లు మరింత పేలేలా ప్లాన్ చేసుకుంటే సినిమా నిజంగానే అదిరిపోయేది.
నటీనటులుః
వెంకట్ పాత్రలో కార్తికేయ చాలా బాగా నటించాడు. ఎమోషన్స్ ని బాగా పలికించాడు. ఈ సినిమాలో యాక్షన్‌కి పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో ఫర్వాలేదు. కానీ పర్‌ఫెర్మెన్స్ ఓరియెంటెడ్‌గా సాగిన మూవీ. ఆ విషయంలో కార్తికేయ తన బెటర్ ఇచ్చాడని చెప్పొచ్చు. నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. కొన్ని చోట్ల `పోకిరి`లోని మహేష్ సీన్లని తలపించేలా చేశాడు. ఇక చాలా రోజుల తర్వాత `హ్యాపీడేస్` ఫేమ్ రాహుల్ టైసన్ ఇందులో మెరిశాడు. అతని పాత్ర కూడా ఎమోషనల్‌గా ఉంటుంది. బాధలకు కేరాఫ్‌గా ఉంటుంది. రాజా పాత్రలో అదరగొట్టాడు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర. ఆ విషయంలో రాహుల్ నిరూపించుకున్నాడు. అతనికి నటుడిగా ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. హైలైట్‌గా నిలిచే పాత్ర అవుతుంది. కార్తికేయ, రాహుల్ ఇద్దరూ అదరగొట్టారు. డేనియల్ పాత్రలో రవిశంకర్ తనదైన స్టయిల్‌లో చేసుకుంటూ వెళ్లాడు. తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి ఎమోషనల్‌గా అదరగొట్టాడు. ఇందు పాత్రలో ఐశ్వర్య మీనన్ మెప్పించింది. కానీ ఆమె పాత్రలో క్లారిటీ మిస్ అయ్యింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. పృథ్వీరాజ్ కూడా మెప్పించాడు.
టెక్నీషియన్లుః
సినిమాకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. రధన్ పాటలు బాగున్నాయి. మొదటి పాట లిరిక్ ఆకట్టుకుంది. కథలో భాగంగా వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. సినిమాని, సీన్లని పరిగెత్తించడంలో ఆ బీజీఎం హెల్ప్ కావడంతోపాటు ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది. బీజీఎం సినిమాని నడిపించిందని చెప్పొచ్చు. కపిల్ కుమార్‌కి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. ఆర్ డీ రాజశేఖర్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్ పరంగా కొంత క్లారిటీ మిస్ అయినా, ఫ్రేములు మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంది. కన్‌ఫ్యూజింగ్ సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాతలు రాజీపడదలేదని తెలుస్తుంది. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇది థ్రిల్లర్ కాదు, ఎమోషనల్ యాక్షన్ మూవీగా చెప్పొచ్చు. జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ టచ్ మాత్రమే ఉంటుంది. దర్శకుడు కథని మరింత బలంగా రాసుకుని ఉంటే, రౌడీ షీటర్లతో గొడవల విషయంలో క్లారిటీ మెయింటేన్ చేయాల్సి ఉంది. అది అంత బలంగా అనిపించలేదు. పైగా హీరోయిన్ పాత్రలోనూ క్లారిటీ మిస్ అయ్యింది. రవిశంకర్ పాత్రకి సంబంధించిన ప్లాన్, దాని వెనకాల ఉండే ఎమోషనల్ క్యారీ అవలేదు. దీంతో ఆయా సీన్లు తేలిపోయాయి. ప్రారంభంలో స్లో నరేషన్ కూడా ఇబ్బంది పెట్టే అంశం. ఓవరాల్‌గా ఉన్నంతలో మెప్పించే ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః వేగం తగ్గకుండా సాగే `భజే వాయు వేగం`. ఫాదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్‌గా హత్తుకునే మూవీ.
రేటింగ్‌ః 2.75
నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు.
టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) - రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు