- Home
- Entertainment
- Movie Reviews
- Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Baa Baa Black Sheep Review: క్రైమ్ కామెడీ ప్రధానంగా సాగే చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే `బా బా బ్లాక్ షీప్` మూవీ రూపొందింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ
క్రైమ్, కామెడీ, సెంటిమెంట్ అంశాలను కలిపి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దర్శకుడు గుణి మంచికంటి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. కొత్త దర్శకుడి ఆలోచనపై నమ్మకంతో వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు ఓయ్, అక్షయ్ లగుసాని ప్రధాన పాత్రల్లో నటించగా, ఉపేంద్ర లిమాయె, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. మేఘాలయా అందాల మధ్య పూర్తిస్థాయి చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది చిత్రంగా ఇది గుర్తింపు పొందింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది తెలుసుకుందాం.
బా బా బ్లాక్ షీప్ మూవీ కథ
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఓ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఇద్దరు వ్యాపారవేత్తల మధ్య పోటీ మొదలవుతుంది. ఈ పోటీలో విజయం సాధించాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పెద్దాయనను తమవైపు తిప్పుకోవాలని ఒక వ్యాపారవేత్త భావిస్తాడు. ఇందుకోసం సెంటిమెంట్‌ను అస్త్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటాడు. స్వాతంత్ర్య సమయంలో కనిపించకుండా పోయిన ఓ వస్తువును సంపాదించి, ఆ పెద్దాయనకు కానుకగా ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. ఈ బాధ్యతను గ్యాంగ్‌స్టర్ జాన్ (ఉపేంద్ర లిమాయె)కు అప్పగిస్తాడు. మరోవైపు సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) తన ప్రేయసి మేరి (సమృద్ధి ఆర్యల్)ను పెళ్లి చేసుకోవడానికి మేఘాలయాలో సిద్ధమవుతుంటాడు. స్నేహితుడు సందీప్ (అక్షయ్ లగుసాని)తో కలిసి పార్టీ చేసుకునే సమయంలో పోలీసుల రాకతో పరిస్థితులు మారిపోతాయి. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో వారి కారు ప్రమాదానికి గురవుతుంది. ఈ సమయంలో కారులో ఉన్న ఓ పెట్టె సందీప్‌కు దొరుకుతుంది.
సత్తిపండు పెళ్లి జరుగుతున్న సమయంలో జాన్ వచ్చి తన పెట్టె గురించి అడగడంతో అసలు సమస్య మొదలవుతుంది. పెట్టె కనిపించకపోవడంతో సందీప్, సత్తిపండులను కిడ్నాప్ చేసి బెదిరిస్తాడు. పెట్టెను తిరిగి తీసుకురాకపోతే సత్తిపండును చంపేస్తానని హెచ్చరిస్తాడు. దీంతో స్నేహితుడిని కాపాడుకోవడానికి సత్తిపండు, జాన్వీ (విస్మయ శ్రీ)తో కలిసి పెట్టె కోసం వెతుకుతాడు. ఆ పెట్టెలో ఏముంది? దాని కోసం జరిగే అన్వేషణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? సత్తిపండు పెళ్లి ఏమైంది? అనేది మిగతా కథ.
బా బా బ్లాక్ షీప్ మూవీ విశ్లేషణ
సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని క్లిష్టమైన పనులను కూడా సాధించవచ్చనే ఆలోచనతో దర్శకుడు ఈ కథను రూపొందించారు. క్రైమ్ కామెడీకి స్నేహం, ప్రేమ, సెంటిమెంట్‌ను జోడించి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. కథ ప్రారంభం ఆసక్తికరంగా సాగుతుంది. పెట్టె చుట్టూ కథ తిరగడం, పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘటనలు కొన్ని సన్నివేశాల్లో వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే కథలో ఎక్కువ పాత్రలు ఉండటం, కొన్ని సంఘటనలు పరిచయంగా అనిపించడం వల్ల కథనం కొన్ని చోట్ల నెమ్మదిస్తుంది.
క్రైమ్ అంశాన్ని మరింత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. క్లైమాక్స్‌లో వచ్చే మలుపులు ఆసక్తిని పెంచినా, కథనం మొత్తం ఒకే స్థాయిలో సాగదు. సినిమాలో క్రైమ్, కామెడీ, స్నేహం, సెంటిమెంట్ అంశాలను కలిపి ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు. కథలోని కొన్ని మలుపులు ఆసక్తిని పెంచగా, నటీనటుల ప్రదర్శన, విజువల్స్, సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కొన్ని సన్నివేశాల్లో కథనం మరింత బలంగా ఉండాల్సిందనిపించినా, క్రైమ్ కామెడీని ఇష్టపడేవారు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. దద
ప్లస్ పాయింట్స్
మేఘాలయా అందమైన లొకేషన్లు
సినిమాటోగ్రఫీ
నటీనటుల నటన
కొన్ని కామెడీ సన్నివేశాలు
క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్
రొటీన్‌గా సాగే క్రైమ్ కామెడీ కథనం
బా బా బ్లాక్ షీప్ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
సత్తిపండు పాత్రలో విష్ణు ఓయ్ తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. కామెడీ సన్నివేశాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. సందీప్ పాత్రలో అక్షయ్ లగుసాని ఎనర్జిటిక్‌గా నటించారు. తన నటనతో పాటు డ్యాన్స్‌లతోనూ మెప్పించే ప్రయత్నం చేశారు. గ్యాంగ్‌స్టర్ జాన్‌గా ఉపేంద్ర లిమాయె తన అనుభవాన్ని చూపించారు. కథలో కీలకమైన పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోశారు. విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర, మూర్తిగా శుభలేఖ సుధాకర్ తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా కథకు అనుగుణంగా నటించారు.
టెక్నీషియన్ల పనితీరు
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మేఘాలయా ప్రకృతి అందాలు. సినిమాటోగ్రాఫర్ అజయ్ అబ్రహం జార్జ్ వాటిని తెరపై అందంగా ఆవిష్కరించారు. పరిమిత బడ్జెట్‌లో ఇలాంటి లొకేషన్లలో చిత్రీకరణ జరపడం అభినందనీయం. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) అందించిన సంగీతం కథకు అనుగుణంగా సాగింది. ‘సమయమే ఇంద్రజాలం’, ‘వే వేల’, ‘ఆజా మేరి జాన్’ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాలకు బలాన్ని అందించింది. దర్శకత్వంలో మరింత పట్టు, ఎడిటింగ్‌లో వేగం ఉంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేది.
ఫైనల్‌గా
క్రైమ్ కామెడీ, సెంటిమెంట్ కలగలిపిన వినోదాత్మక చిత్రమిది. అంచనాలు లేకుండా క్రైమ్ కామెడీ సినిమాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ : 2.75

