`యావరేజ్ స్టూడెంట్ నాని` మూవీ రివ్యూ, రేటింగ్
ఈ శుక్రవారం ఐదారు చిన్న సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి `యావరేజ్ స్టూడెంట్ నాని` మూవీ ఒకటి. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సినిమా అనేది కలర్‌ఫుల్ ప్రపంచం. ఇక్కడ కొత్తవాళ్లు వస్తుంటారు. పాత వాళ్లు వెళ్లిపోతుంటారు. కొందరు సక్సెస్ అవుతారు, మరికొందరు ఫేడౌట్ అవుతుంటాయి. కానీ ఇదొక నది ప్రవాహం లాంటిది. ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. కొందరు మెరుపులు మెరిపిస్తూనే ఉంటారు. అలా కొత్త టీమ్ సినిమాపై ప్యాషన్‌తో చేసిన ప్రయత్నం `యావరేజ్ స్టూడెంట్ నాని`. ఈ సినిమాలో పవన్ కొత్తూరి, షహీబా బసిన్, స్నేహా మాల్వియా హీరోహీరోయిన్లుగా నటించగా, రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రల్లో నటించారు. హీరోనే దర్శకుడు, నిర్మాత కావడం విశేషం. ఆయనకు దర్శకత్వంలో బిషాలి గోయల్ సపోర్ట్ గా ఉన్నారు. ఈ శుక్రవారం సినిమా పండగ నడుస్తున్న నేపథ్యంలో అందులో భాగంగా `యావరేజ్ స్టూడెంట్ నాని` కూడా విడుదలైంది. మరి ఈసినిమా ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
నాని(పవన్ కొత్తూరి)కి చదువు పెద్దగా అబ్బదు. బేవార్స్ గా తిరుగుతుంటాడు. కొడుకుని ఇంజనీర్‌ని చేయాలని తండ్రి(రాజీవ్ కనకాల) భావిస్తాడు. కానీ ఆయన ఎంసెట్‌లో క్వాలిఫై కూడా కాడు. చదువుల్లో నానికి ఉన్న టాలెంట్‌ని చూసి తండ్రి ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. ఎంసెట్ కూడా పాస్ కాకపోవడంతో ఫాదర్ బాధ భరించలేక తల్లి కష్టాలు పడి ఇంజనీరింగ్ సీటు సంపాదిస్తుంది. అలా మెకానికల్ ఇంజనీర్‌లో చేరతాడు నాని. ఆ కాలేజీకి వెళ్లాక నాని.. సీనియర్ అమ్మాయి సారా(స్నేహా)ని ప్రేమిస్తాడు. ఇద్దరు ప్రేమలో మునిగితేలుతుండటంతో సీనియర్లంతా కుళ్లుకుంటారు. ఇది కాలేజీలో గొడవలకు కారణం అవుతుంది. సారా.. నానికి బ్రేకప్ చెబుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుంది. ఆ తర్వాత నాని.. మరో అమ్మాయి అను(షహీబా బాసిన్)తో ప్రేమలో పడతాడు. అప్పటికే నాని అక్కపై దాడి జరుగుతుంది. ఆమె కోమాలో ఉంటుంది. ఈ క్రమంలో మళ్లీ సారా.. నానికి ఎందుకు దగ్గరకావాలనుకుంటుంది? అనుతో నాని లవ్ ట్రాక్ ఎలాంటి మలుపులు తిరిగింది? అక్కపై దాడి చేసింది ఎవరు? నాని కోసం అక్క ఏం చేసింది? బేవార్స్ గా తిరిగే నాని.. ఎలా గొప్పవాడు అయ్యాడు, ఈ క్రమంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడనేది ఈ సినిమా మిగిలిన కథ.
విశ్లేషణః
ప్రస్తుతం లవ్ స్టోరీలు బోల్డ్ గా ఉంటేనే ఆడియెన్స్ కి నచ్చుతున్నాయి. `బేబీ`, `టిల్లు స్వ్కేర్` లాంటి సినిమాలు అటు ఇటుగా అలాంటి కాన్సెప్ట్ తో వచ్చినవే. ట్రెండ్‌కి తగ్గట్టుగా వాటిని తెరకెక్కిస్తే కచ్చితంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు `యావరేజ్ స్టూడెంట్ నాని` కూడా అలాంటి జోనర్ చిత్రమే. ఇందులోనూ లవ్, బోల్డ్ నెస్ మేళవింపుగా తెరకెక్కించాడు. ప్రారంభంలో కాస్త ఫ్యామిలీ ఎలిమెంట్లతో నీట్‌గా నడిపించారు. ఫన్నీ ఎపిసోడ్లతో సరదాగా నడిపించాడు. చదువులో వీక్‌గా ఉన్న కొడుకుని తండ్రి తిట్టే తిట్ల దండకంతో సినిమాని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలో చేరడం,ర్యాగింగ్ ఎపిసోడ్స్, సీనియర్ హీరోయిన్‌తో ప్రేమాయణం, గొడవలు లాంటి సీన్స్‌తో ఫస్టాఫ్ అంతా సరదాగా, ఫన్నీగానే సాగుతుంది. ఈ క్రమంలో మధ్య మధ్యలో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ని బోల్డ్ గా, లిప్‌లాక్‌లతో చూపించాడు. నేటి యూత్‌కి కావాల్సిన ఎలిమెంట్లని గట్టిగా దట్టించి మరింత రంజుగా మార్చేశాడు.
ఇక సెకండాఫ్ అంతా ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. కాలేజీలో గొడవలు, లవర్‌తో గొడవ, మనస్పర్థాలు, బ్రేకప్ చెప్పుకోవడం, మరో అమ్మాయిని ఇష్టపడటం వంటి సీన్లతో సాగుతుంది. ఇంకోవైపు హీరో అక్కపై దాడి చేయడం, ఆమె కోమాలోకి వెళ్లడం, ఆతర్వాత కథ కాస్త సీరియస్ టోన్‌లోకి మారిపోతుంది. ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది. రొమాంటిక్ సన్నివేశాలను, అలాగే ఎమోషనల్ సీన్లని బ్యాలెన్స్ చేస్తూ చూపించిన విధానం కొత్తగా ఉంది. దీంతోపాటు హీరో అక్కని కాపాడుకునే సీన్లలో సెంటిమెంట్, కొడుకు గొప్ప వాడైన తర్వాత తండ్రి గర్వపడే సీన్లు, ఫ్యామిలీ బాండింగ్, ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌తో ముగింపు పలికిన తీరు బాగుంది. కాకపోతే సినిమా అంతా ఒకే టోన్‌తో రొమాంటిక్ కంటెంట్ ఎక్కువ కావడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామాకు ఎక్కువ స్కోప్ తీసుకొన్నప్పటికీ దాన్ని సరిగా వాడుకోలేదు. స్టోరీ కూడా కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ అంతగా పేలలేదు. నానిలో వచ్చే మార్పు, ఆయన గొప్పగా ఎదిగిన తీరుని మరింత బలంగా చూపించాల్సింది.
నటీనటులు, టెక్నీషియన్లు పనితీరుః
ఈ సినిమాకి హీరోనే దర్శకుడు, నిర్మాత. దర్శకుడిగా పవన్ మెప్పించాడు. తన ప్రతిభని చూపించాడు. రొటీన్ స్టోరీని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ హీరోగా మాత్రం అంతగా మెప్పించలేదని చెప్పొచ్చు. నటుడిగా ఆయన ఇంకా బెటల్ కావాలి. లుక్ వైజ్‌గానూ చాలా హోంవర్క్ చేయాల్సింది. హీరోయిన్లు ఇద్దరు అందంతో, అభినయంతో అలరించారు. గ్లామర్ ట్రీట్ బాగుంది. హీరో పేరెంట్స్ గా రాజీవ్ కనకాల, ఝాన్సీ తమకి సెట్ అయ్యే పాత్రల్లో ఒదిగిపోయి ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.
ఇక టెక్నీకల్‌గా సాజీష్ రాజేంద్రన్ కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేము కలర్‌ఫుల్‌గా నీట్‌గా ఉంది. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ బాగుంది. సినిమాకి పెద్ద అసెట్గా నిలిచింది. ఆర్‌ఆర్ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇంకా కోత పెట్టాల్సింది. నిర్మాణ పరంగా రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది. ఓవరాల్‌గా ఈ సినిమాని ఎమోషనల్‌గా సాగే యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ అని చెప్పొచ్చు.
రేటింగ్‌ః 2.5