- Home
- Entertainment
- Movie Reviews
- Lockdown Review: `లాక్‌డౌన్` మూవీ రివ్యూ.. అనుపమా పరమేశ్వరన్ భయపెట్టిందా?
Lockdown Review: `లాక్‌డౌన్` మూవీ రివ్యూ.. అనుపమా పరమేశ్వరన్ భయపెట్టిందా?
Lockdown Review: ఏ.ఆర్. జీవా దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ నటించిన 'లాక్‌డౌన్' సినిమా శుక్రవారం(జనవరి 30న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

లాక్ డౌన్ మూవీ రివ్యూ
కరోనా కాలం మనుషుల జీవితాలను ఎలా తలకిందులు చేసిందో తెరపై మళ్లీ చూపించే ప్రయత్నమే దర్శకుడు ఏ.ఆర్. జీవా తీసిన 'లాక్‌డౌన్' సినిమా. ఆ కాలాన్ని ఒక డాక్యుమెంటరీలా చూపించాలనే ఆయన ఆలోచన సినిమా మొదట్లోనే స్పష్టంగా తెలుస్తుంది.
కథ ప్రకారం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు స్నేహితులతో పార్టీలో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. ఆ తర్వాత గర్భం దాల్చడం, దాన్ని దాచడానికి ప్రయత్నించడం, అదే సమయంలో లాక్‌డౌన్ వల్ల వైద్య సహాయం అందక ఇబ్బంది పడటం.. ఇవన్నీ ఒక ఆధునిక సామాజిక సమస్యను చూపించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ కోణం లోతుగా వెళ్లకుండా, పైపైన మాత్రమే చూపించారు. అనుపమా పాత్ర మానసిక సంఘర్షణ ప్రేక్షకులకు పూర్తిగా చేరకముందే సీన్లు మారిపోతాయి.
లాక్ డౌన్ మూవీ ఎలా ఉందంటే?
ఒక్క కథతోనే ఆగిపోకుండా, ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికుడు, ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే వైద్యులు, ఒంటరితనంతో బాధపడే యువత, విరహ వేదనలో ఉన్న ప్రేమ జంటలు.. ఇలా చాలా జీవితాలను ఈ సినిమా ఒకేసారి చూపిస్తుంది. ఈ ఆలోచన మంచిదే. కానీ ఎక్కువ కథలను ఒకే సినిమాలో ఇరికించడంతో, ఏ ఒక్క కథ కూడా పూర్తిగా డెవలప్ అవ్వకుండా, చిన్న చిన్న సంఘటనలుగానే సాగిపోతుంది.
లాక్ డౌన్ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే
సినిమాటోగ్రాఫర్ కే.ఏ.శక్తివేల్, నిర్మానుష్యంగా ఉన్న నగరాలు, తాళాలు వేసిన ఇళ్లు, మసక వెలుతురు లాంటి సీన్లతో లాక్‌డౌన్ నాటి ఒంటరితనాన్ని బాగా చూపించారు. కొన్ని షాట్లు ఆ కాలం నాటి మానసిక స్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. అయినా, విజువల్స్ ఇంకా బలంగా ఉండుంటే, దాని ప్రభావం పెరిగేది. ఎడిటర్ వీజే సాబు జోసెఫ్ సినిమా ఫ్లోను కంట్రోల్‌లో ఉంచినా, చాలా కథలు కలిసే చోట గ్యాప్ కనిపిస్తుంది. కొన్నిచోట్ల స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడంతో, సినిమా వేగం తగ్గుతుంది. సిద్ధార్థ్ విపిన్, ఎన్.ఆర్. రఘునందన్ సంగీతం ఓకే అనిపిస్తుంది. సీన్లను ఎమోషనల్‌గా ఎలివేట్ చేసేంత బలంగా సంగీతం లేకపోవడంతో, కొన్ని ముఖ్యమైన సందర్భాలు గుర్తుండిపోకుండా వెళ్లిపోతాయి.
ఫైనల్‌గా
మొత్తం మీద, 'లాక్‌డౌన్' ఒక కాలం నాటి బాధను నిజాయితీగా చూపించడానికి ప్రయత్నించిన సినిమా. కానీ ఆ బాధను ప్రేక్షకుల మనసులో బలంగా నాటేంతలా స్క్రీన్‌ప్లే, విజువల్స్ కలవలేదు. వాస్తవిక సామాజిక చిత్రంగా దీన్ని చూడొచ్చు; కానీ ఒక తీవ్రమైన, ప్రభావం చూపే మూవీగా ఇది మారలేకపోవడమే ఈ సినిమాకు మైనస్. మొత్తంగా అనుపమా ఆడియెన్స్ ని భయపెట్టించడంలో విఫలమయ్యింది.

