- Home
- Entertainment
- Movie Reviews
- AOT Movie Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ మరోసారి మ్యాజిక్ చేశాడా?
AOT Movie Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ మరోసారి మ్యాజిక్ చేశాడా?
దుల్కర్ సల్మాన్, కొత్త అమ్మాయి సాత్విక వీరవల్లి జంటగా, శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించిన `ఆకాశంలో ఒక తార` మూవీ నేడు విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?

ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ
కంటెంట్ ప్రధానమైన చిత్రాలు చేస్తూ, తెలుగులో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'ఆకాశంలో ఒక తార'. కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లిని పరిచయం చేస్తూ, దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రుతి హాసన్, గౌతమ్ మీనన్, మురళీ శర్మ, ప్రవీణ్, స్వాసిక ఇతర పాత్రలు పోషించారు.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పతాకంపై రమ్య గుణ్ణం, సందీప్ గుణ్ణం నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 20)న విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఆకాశంలో ఒక తార మూవీ కథ ఇదే
పాలలంక అనే మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) చిన్నప్పటి నుంచే ఆకాశం వైపు చూస్తూ పెరుగుతుంది. ఆమెకు చదువంటే ఇష్టం. ముఖ్యంగా అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. భవిష్యత్తులో ఆస్ట్రోనాట్ కావాలనేది ఆమె లక్ష్యం. కానీ ఆడపిల్లలకు చదువులు ఎందుకంటూ భావించే తండ్రి శివయ్య (కోట జయరాం) ఆమె కలలకు అడ్డుపడుతుంటాడు.
కల్పన ఇష్టానికి వ్యతిరేకంగా చిన్న వయసులోనే కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో పెళ్లి జరుగుతుంది. కానీ కృష్ణ మాత్రం ఆమె ఆశయాలను అర్థం చేసుకుంటాడు. తన భార్య కలను నిజం చేసేందుకు అండగా నిలుస్తాడు. ఈ ప్రయాణంలో కల్పనకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. చదువు, కుటుంబ పరిస్థితులు, సామాజిక ఆంక్షలు ఆమెను వెనక్కి లాగుతుంటాయి.
అయినా కల్పన తన ప్రయత్నాలను ఆపదు. ఈ క్రమంలో రాకెట్ సైన్స్‌కు సంబంధించిన ప్రయోగం విఫలమై ఆమెకు మరో సమస్య ఎదురవుతుంది. అసలు కల్పన ఆస్ట్రోనాట్ కావాలనే తన కలను నెరవేర్చుకుందా? కృష్ణ ఆమెకు ఎలా సహకరించాడు? రోహిణి (శ్రుతి హాసన్) పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.
ఆకాశంలో ఒక తార మూవీ ఎలా ఉందంటే?
సినిమా విశ్లేషణ
ఒక చిన్న విలేజ్‌లో పుట్టిన అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనడం, ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అవమానాలు, అడ్డంకులు, కుటుంబ సమస్యలు.. వీటి చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఇది మెయిన్‌గా మహిళల ఆశయాలు, మహిళా సాధికారత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫ్యామిలీ సపోర్ట్ వంటి అంశాలను ఆవిష్కరించే చిత్రమవుతుంది. ఒక అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనుకోవడం, అందుకు సమాజం నుంచి ఎదురయ్యే వ్యతిరేకత అనే పాయింట్ కొత్తది కాకపోయినా, దాన్ని భావోద్వేగాలతో చెప్పడంలో దర్శకుడు పవన్ సాధినేని మంచి ప్రయత్నం చేశారు.
సినిమా ప్రారంభం నుంచి కల్పన పాత్రని ఇంట్రెస్టింగ్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఒక మహిళ కలను భర్త అర్థం చేసుకుని ప్రోత్సహించడం, ఆమె విజయాన్ని తన విజయంగా భావించడం వంటి అంశాలు బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని అందంగా చూపించారు. కల్పన ఎదుర్కొనే అవమానాలు, వైఫల్యాలు, అలాగే సొంత తండ్రినే తనకు అడ్డుగా నిలవడమనే అంశం భావోద్వేగంగా ఉంటుంది.
ఇంట్లో నాన్న, పెళ్లైయ్యాక వదిన, ఆ తర్వాత కాలేజీలో, అట్నుంచి కంపెనీలో వరుసగా ఆమెకి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటిని దాటుకొని ఆమె తన డ్రీమ్‌ని చూడటం, దానికోసం ధైర్యంతో ముందుకెళ్లడం, ఎవరు ఏమనుకున్నా లెక్కచేయకుండా సాగే మనస్తత్వం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. నేటి యువతకు కావాల్సిన స్ఫూర్తినిస్తుంది.
అదే సమయంలో భార్యకి భర్త సపోర్ట్ అనేది, భర్త సపోర్ట్ తో భార్య తన డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడం, వారికి గొప్ప పేరుని తీసుకురావడమనేది ఇందులో అభినందనీయమైన అంశంగా చెప్పొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ తో `రాజా`, `సూర్యవంశం` వంటి కొన్ని సినిమాలు మనం ఇప్పటికే చూశాం. అదే సమయంలో ఒక లక్ష్యాన్ని సాధించే అంశాలు, క్రీడా నేపథ్యంలో, స్టడీస్ నేపథ్యంలో కూడా చాలా సినిమాలు చూశాం. ఇది కూడా ఆ కోవకు చెందినదే. అందులో కొత్తదనం ఏం లేదు. కాకపోతే సినిమాని నడిపించిన తీరు బాగుంది. ఎమోషనల్‌గా, నటకీయంగా దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది.
ప్లస్, మైనస్‌లు
అయితే సినిమా కథనం ఫస్టాఫ్‌లో నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. పెద్దగా హై మూమెంట్స్ లేవు. చాలా సన్నివేశాలు ముందుగానే ఊహించే విధంగా ఉన్నాయి. కల్పన తెలివికి సంబంధించిన సీన్లు పెద్దగా లేవు, ప్లాస్మా కాన్సెప్ట్ తప్ప ఆమె గొప్ప అని చూపించే సీన్ ఒక్కటి కూడా లేదు. చాలా సింపుల్‌గా ఆ విషయాలను చూపించడం అంతగా కనెక్టింగ్‌గా అనిపించలేదు. ఏదో కట్ కట్ అనేలా ఆమె పాత్రని చూపించారు. ఆమె టాలెంట్‌ని, ఘనత బలంగా ఆవిష్కరించలేకపోయారు.
ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్, కొన్ని కుటుంబ సన్నివేశాల్లో వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ముఖ్యంగా కల్పన తన తండ్రితో మాట్లాడే సన్నివేశం, భర్తని మళ్లీ కలుసుకునే సీన్ హృదయాన్ని కదిలిస్తుంది. అదే సమయంలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇది రొటీన్ ఇన్ స్పైరింగ్ స్టోరీనే అయినా యువతకు మంచి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు.
ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పనితీరు
నటీనటుల పనితీరు
స్టార్ హీరోయిన్ హీరోయిన్ పాత్రకి ప్రయారిటీ ఇస్తూ ఈ మూవీ చేయడం గొప్ప విషయం. ఆ విషయంలో దుల్కర్ సల్మాన్‌ని అభినందించాల్సిందే. తన భార్యని ఎంకరేజ్ చేస్తూ, తాను స్ట్రగుల్ అవుతూ తన నటన అదిరిపోయింది. సెటిల్డ్ గా చేసి మెప్పించారు. ఎమోషనల్ సీన్లలోనూ కదిలించాడు.
ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సాత్విక వీరవల్లి. కల్పన పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. అమాయకత్వం, పట్టుదల, ఆవేదన, లక్ష్యాన్ని సాధించాలనే తపన వంటి భావాలను బాగా చూపించింది. తొలి చిత్రమే అయినా అనుభవం ఉన్న నటిలా కనిపించింది. ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే అదరగొట్టింది. వాహ్ అనిపించింది. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు.
శ్రుతి హాసన్ రోహిణి పాత్రలో తనదైన ముద్ర వేసింది. కథలో ఆమె పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. రుహానీ శర్మ, స్వాసిక, మురళీ శర్మ, నాజర్, ప్రవీణ్, కోట జయరాం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
టెక్నీషియన్ల పనితీరు
టెక్నీకల్‌గా మూవీ బాగుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. గ్రామీణ వాతావరణాన్ని, అంతరిక్షానికి సంబంధించిన విజువల్స్‌ను చక్కగా చూపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఆర్‌ఆర్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్లలో అదిరిపోయింది.
గుణ్ణం గంగరాజు రచన, స్క్రీన్‌ప్లే సినిమాకు మరో బలం. రొటీన్‌గానే సాగినా ఆకట్టుకుంది. ఎంగేజ్ చేసేలా ఉంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి, ఆలోచింప చేస్తాయి. ముఖ్యంగా కలలకు సంబంధించిన మాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు పవన్ సాధినేని మూవీ ఎంచుకున్న కాన్సెప్ట్ వేరుగానీ, కథనం మాత్రం రొటీన్ అనే చెప్పాలి. ప్రతిదీ ఊహించినట్టుగానే సాగుతుంది. అందులో కొత్తదనం లేదు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్లని బాగానే డీల్ చేశాడు.
ఫైనల్‌గా..
'ఆకాశంలో ఒక తార' కేవలం ఒక అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే కథ మాత్రమే కాదు. ఆడపిల్లలు కూడా పెద్ద కలలు కనవచ్చని, వాటిని నిజం చేసుకునేందుకు కుటుంబం తోడుగా నిలిస్తే అద్భుతాలు సాధ్యమవుతాయని చెప్పే మంచి ప్రయత్నం. రెగ్యూలర్ ఇన్‌స్పైరింగ్ స్టోరీనే. కాకపోతే యువత, చదువుకునే పిల్లలు చూడాల్సిన మూవీ. కమర్షియల్ కోణంలో మెప్పించడం కష్టమే.
రేటింగ్: 3














