- Home
- Entertainment
- Movie Reviews
- 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ, రేటింగ్.. అల్లరి నరేష్‌కి ఈ సారైనా హిట్ పడిందా?
12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ, రేటింగ్.. అల్లరి నరేష్‌కి ఈ సారైనా హిట్ పడిందా?
12A Railway Colony Movie Review: అల్లరి నరేష్ సక్సెస్ కోసం కామెడీని దూరం పెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు `12A రైల్వే కాలనీ` చిత్రంలో నటించాడు. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే?

`12A రైల్వే కాలనీ` మూవీ రివ్యూ
అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. వరుస విజయాలు అందుకున్నారు. కానీ చాలా రోజులుగా ఆయనకు సక్సెస్ దోబూచులాడుతుంది. `నాంది` చిత్రంతో మళ్లీ హిట్ అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. సీరియస్ ఫిల్మ్స్ చేసినా, కామెడీ చిత్రాలు చేసినా ఆడియెన్స్ పెద్దగా ఆదరించడం లేదు. దీంతో ఆయన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కామెడీ జోనర్ కాకుండా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో `12ఏ రైల్వే కాలనీ` మూవీ చేశారు. ఇందులో అల్లరి నరేష్‌కి జోడీగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించగా, నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేశారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయడం విశేషం. ఇది నేడు శుక్రవారం(నవంబర్ 21న) విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా అల్లరి నరేష్ హిట్ కొట్టాడా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
`12A రైల్వే కాలనీ` మూవీ కథ ఏంటంటే?
కార్తీక్ (అల్లరి నరేష్) వరంగల్‌లోని స్థానిక లీడర్ కిట్టు(జీవన్) వద్ద పని చేస్తుంటాడు. ఆయనకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటాడు. కిట్టు ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో బిజీగా ఉంటాడు. దీనికి సంబంధించిన పనుల్లో ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు కార్తీక్. కిట్టు కోరిక మేరకు యూత్‌కి గేమ్స్ పెట్టిస్తారు. అందులో భాగంగా తాను ఇష్టపడే అమ్మాయి ఆరాధన (కామాక్షి భాస్కర్ల) కూడా అందులో పాల్గొంటుంది. అయితే ఆ అమ్మాయికి చాలా రోజులుగా లైనేస్తుంటాడు కార్తీక్. కానీ చెప్పు చూపిస్తూ బెదిరిస్తుంది. అయినా తన వెంటపడతాడు. ఆమె బాడ్మింటన్‌లో నేషనల్ కి ఆడాలని తపిస్తుంటుంది. అందుకు మూడు లక్షల డబ్బులు అవసరం అవుతుంది. ఆ డబ్బు తాను అరెంజ్ చేయాలని ప్లాన్ చేస్తాడు కార్తీక్. ఈ క్రమంలో కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తాడు. కిట్టు అన్న ని అడగ్గా, ఆయన ఓ పార్సెల్ ఇచ్చి పంపిస్తాడు. అది తీసుకొని ఆరాధన ఇంటికి వెళ్లగా, ఆరాధన టెన్షన్‌లో ఉంటుంది. తనని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లు అంటుంది. కానీ కార్తీక్ అక్కడే ఉంటాడు. పైన ఏదో శబ్దం వస్తుంటే వెళ్లి చూడగా, ఆరాధన, వాళ్ల అమ్మ చనిపోయి ఉంటారు. అది చూసి షాక్ అయి స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే ఆసుపత్రిలో ఉంటాడు. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ రానా ప్రతాప్(సాయి కుమార్) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అయితే ఆరాధన మరణం వెనుక చాలా మిస్టరీలుంటాయి. ఆ మిస్టరీలు ఏంటి? ఆరాధన, వాళ్ల అమ్మ చావుకు కారణం ఎవరు? డాక్టర్ షిండే(అనిష్ కురువిల్లా)కి, ఆరాధనకి ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన ఆరాధన కార్తీక్‌కి ఎందుకు కనిపించింది. కిట్టుకి ఈ కేసుకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఎమ్మెల్యే కావడం కోసం ఏం చేశాడు? వీటన్నింటికి ఉన్న లింకేంటి అనేది ఈ సినిమా కథ.
`12A రైల్వే కాలనీ` మూవీ విశేషణ
అల్లరి నరేష్ కామెడీ సినిమాలు వర్కౌట్ కావడం లేదని, థ్రిల్లర్ చేస్తున్నారు. సీరియస్ యాక్షన్ చిత్రాలు కూడా చేస్తున్నారు. సక్సెస్ కోసం చాలా జోనర్స్ మారుస్తున్నారు. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పుడు `12A రైల్వే కాలనీ` తో చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. ఈ మూవీ సరదాగా కామెడీ వేలో ప్రారంభమవుతుంది. అట్నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుంది. అట్నుంచి హార్రర్ జోనర్‌లోకి వెళ్తుంది. అది కాస్త మర్డర్ మిస్టరీగా టర్న్ తీసుకుంటుంది. దీనికి పారా నార్మల్ స్పిరిట్స్, క్షుద్రపూజల ఎపిసోడ్ యాడ్ చేస్తారు. ఇంతకి ఏ జోనర్ అనేది క్లారిటీ లేకుండా సాగుతుంది. కొంత యాక్షన్ టచ్ కూడా ఉంటుంది. ఇలా విభిన్నమైన జోనర్స్ మేళవింపుతో ఈ సినిమాని రూపొందించారు మేకర్స్. ప్రారంభమే చాలా రొటీన్‌గా, రెగ్యూలర్‌గా ఉంటుంది. అల్లరి నరేష్, ఆయన ఫ్రెండ్స్ వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్ధాం వంటి వారు చేసే కామెడీ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ కొన్ని చోట్ల ఫర్వాలేదు. కానీ అందులో ఫీల్ లేదు. ఇక హీరోయిన్ పాత్రలో ఏదో సస్పెన్స్ రన్ అవుతుంది. మరోవైపు కిట్టు పాత్రకి సంబంధించిన సస్పెన్స్ సైతం రన్ అవుతుంది. వీటన్నింటికి ఏదో ముడి ఉంటుందనేది చూసే ఆడియెన్స్ కి ముందే అర్థమవుతుంది. అయితే ఆ సస్పెన్స్ ని జనరేట్ చేయడంలో, ఆడియెన్స్ ఫీలయ్యేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ కాలేకపోయారు.
12ఏ రైల్వే కాలనీ మూవీ ప్లస్ లు, మైనస్‌లు
తాను ప్రేమించిన అమ్మాయి శవమై కనిపించడంతో హీరో షాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విట్ట్ మాత్రం బాగుంది. ఇక సెకండాఫ్ అంతా మర్డర్ మిస్టరీగా వెళ్తుంది. దీన్ని పోలీస్ ఆఫీసర్‌తోపాటు హీరో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఇది ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. ప్రేమించిన అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నా అని చెబుతాడు హీరో, కానీ వాళ్ల మధ్య అసలు లవ్ ఎపిసోడే లేదు. కథలోని అనేక మలుపులు కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఏమాత్రం ఎంగేజ్ చేసేలా లేవు కదా, బోరింగ్‌గా అనిపిస్తాయి. అయితే మధ్య మధ్య లో కొన్ని ట్విస్ట్ లు మాత్రం ఫర్వాలేదు. ట్విస్ట్ లు, పెట్టి సస్పెన్స్ తో లాగిన తీరు కూడా విసిగిత్తేలా ఉంటుంది. కొత్త కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. వచ్చే కొద్ది ఆడియెన్స్ సహనంతో పరీక్షలాగా ఉంటాయి. ఏ ఒక్క పాత్ర కూడా ఎంగేజ్ చేయలేకపోయాయి. డ్రామా ఏమాత్రం పండలేదు. ఎమోషన్స్ లేవు. భయపెట్టేలానూ లేదు. ట్విస్ట్ లలో కాస్త థ్రిల్ అనిపించినా, అది లైటర్‌వేలోనే ఉంది. ఇక సినిమా టైటిల్‌కి, ఈ కథకి అసలు సంబంధమే లేదు. క్లైమాక్స్ కూడా చాలా దారుణంగా ఉంది. ఏమాత్రం లాజిక్ లెస్‌గానూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకున్నారు? ఏం తీయాలనుకున్నారనేది క్లారిటీ మిస్ అయినట్టుగా ఉంటుంది. మొత్తంగా అల్లరి నరేష్ విఫలప్రయత్నమని చెప్పొచ్చు. దీనికి ఇంకా సీక్వెల్‌ని ప్రకటించడం గమనార్హం.
`12A రైల్వే కాలనీ` నటీనటుల పర్‌ఫెర్మెన్స్
కార్తీక్ పాత్రలో అల్లరి నరేష్ బాగానే నటించాడు. ఆయన రోల్ కామెడీగా కంటే సీరియస్‌గానే ఉంటుంది. నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడు. కానీ ఆయనకు సూట్ కాని సబ్జెక్ట్ ఇది. కామాక్షి భాస్కర్ల పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. ఆమె కూడా సెటిల్డ్ గా బాగానే చేసింది. ఇక టిల్లుగా జీవన్ అదరగొట్టాడు. డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సాయికుమార్ యాప్ట్ గా నిలిచారు. హీరో ఫ్రెండ్స్ గా వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్ధాంలు కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. డాక్టర్‌గా అనిష్ కురువిల్లా ఉన్నంతలో మెప్పించాడు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.
`12A రైల్వే కాలనీ` మూవీ టెక్నీషియన్ల పనితీరు
సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం ఫర్వాలేదు. పాటలు మెప్పిస్తాయి. బీజీఎం కూడా మాస్ సినిమాల రేంజ్‌లో ఇచ్చాడు. కానీ కొంత రొటీన్ అనిపిస్తుంది. కుషేందర్ రమేష్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ పరంగా రిచ్‌గా ఉంది. సినిమా నిడివి రెండు గంటలే. అయినా చాలా లెన్తీగా, బోరింగ్‌గా ఉండటం గమనార్హం. దర్శకుడు నాని కాసరగడ్డ టేకింగ్ పరంగా ఫర్వాలేదు. కానీ మేకింగ్ లో తేడా కొట్టింది. అలాగే అనిల్ విశ్వనాథ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అవే ఈ మూవీకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. చాలా రిచ్‌గా తీశారు.
ఫైనల్‌గా: డిజప్పాయింట్ చేసే `12A రైల్వే కాలనీ`
రేటింగ్: 1.75

