Yoga Day 2022: అసలు మనం యోగా ఎందుకు చేయాలి? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి..?
Yoga Day 2022: ఇది 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ జీవన విధానం.. యోగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా మనశ్శాంతిని కలిగిస్తుంది. మరెన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది.

yoga day 2022
దాదాపు 6,000 సంవత్సరాల చరిత్ర కలిగిన యోగాతో శరీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యంగా కూడా బేషుగ్గా ఉంటుంది. ఇది శరీరాన్ని, మనస్సును ఆధ్యాత్మిక స్థితిని తీసుకువెళుతుంది. యోగా శరీరాన్ని, మనస్సును పునరుజ్జీవింపజేస్తుంది. యోగా చేయడం వల్ల హేతుబద్ధత (Rationality), భావోద్వేగం (Emotion), సృజనాత్మకత (Creativity) పెరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అంతర్భాగం కావాలని నిపుణులు చెబుుతున్నారు. దీనివల్ల ఎన్నోప్రయోజనాలు పొందవచ్చు.
యోగా అంటే ఏమిటి?
యోగా అనే పదం సంస్కృత పదమైన యుజ్ నుంచి ఉద్భవించింది. యుజ్ అంటే జోడించడం లేదా ఏకాగ్రత పెట్టడం అని అర్థం. అందుకే యోగా అనేది మనస్సును ఏకాగ్రతపై కేంద్రీకరించే చర్య. విలువైన యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది పతంజలి మహర్షి. యోగ సాధన సంకుచిత అహంతో నిండిన వ్యక్తిత్వాన్ని విస్తృతం చేస్తుంది. ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. మనల్ని మనం శారీరకంగా చురుకుగా ఉంచుకోవడమే కాకుండా.. ఇది నిరాశకు, మానసిక సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. అందుకే యోగాను చిత్తవృత్తి నిరోధః అంటారు. అంటే మనసును నియంత్రించే కళ అని అర్థం. యోగా పరిధి విస్తారమైనది. యోగా అంటే కేవలం ఆసనాలు లేదా ప్రాణాయామాలు మాత్రమే కాదు. భారతదేశానికి చెందిన ప్రాచీన భారతదేశంలోని ఋషులు ప్రపంచానికి ఇచ్చిన జ్ఞానం ఇది. యమ, నియమ, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యహర, ధారణ, ధ్యానం,సమాధి అనేవి అష్టాంగ యోగాలు.
యోగా ప్రధాన రకాలు
చంచలమైన మనస్సును (Fickle mind) నియంత్రించడానికి, ఏకాగ్రత (Concentration)ను తీసుకురావడానికి యోగా సహాయపడుతుంది. యోగాలో ప్రధానంగా ప్రాణాయామం, ఆసనాలు, వ్యాయామాలు ఉంటాయి.
ప్రాణాయామం (Pranayam): దీని అర్థం ప్రాణాన్ని నియంత్రించడం లేదా శ్వాసించడం. యోగాలో ప్రాణాయామం అంటే శ్వాసపై నియంత్రణ పొందడం అని అర్థం. ప్రాణాయామం ప్రధాన ఉద్దేశ్యం ఏకాగ్రతను సాధించడం. శ్వాసపై నియంత్రణ పొందడం ద్వారా మనస్సు చంచలతను నియంత్రించొచ్చు. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మానసిక ఆరోగ్యం కోసం ప్రాణాయామం చేసినట్లే శారీరక ఆరోగ్యం, ఫిట్ నెస్ కోసం ఆసనాలు వేస్తారు. మఖ్యంగా ఎక్కువ సేపు కూర్చునే సామర్థ్యం వ్యాయామాల్లో భాగం. ఆసనాలు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. శారీరక వ్యాయామాలతో పోలిస్తే శరీరాన్ని వివిధ భంగిమల్లో ఉంచడం వల్ల అవగాహన, వినడం, ఏకాగ్రత అభివృద్ధి చెందుతాయి. ఆసనాలు శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి.
వ్యాయామాలు
వ్యాయామాలు, యోగా యొక్క మరొక భాగం. శారీరక దృఢత్వం, ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే శారీరక శ్రమే వ్యాయామాలు. ఇది కండరాలను, హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు (Heart disease), మధుమేహం (Diabetes), ఊబకాయం (Obesity) వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే వ్యాయామాలు (Exercises)నిద్రలేమి (Insomnia)వంటి సమస్యను దూరం చేస్తాయి.
యోగా ప్రయోజనాలు
యోగా ఒత్తిడితో జీవితం నుంచి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు, యోగా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఏకాగ్రత పెరగడం
ప్రాణాయామం, వేరే ఆసనాలు చేసేటప్పుడు శ్వాసపై నియంత్రణను సాధించవచ్చు. కాబట్టి ఇది ఏకాగ్రతను మరింత పెంచుతుంది. యోగాలో ధ్యానం అనేది ఒక పరిస్థితి కాబట్టి, ఇది మానసిక స్పష్టతను పెంచుతుంది.
బరువు నియంత్రణ
యోగా బరువు తగ్గడానికి ప్రత్యేకంగా సహాయపడదు. కానీ శరీరం పై అవగాహన పెంచడానికి సహాయపడుతుంది. సరైన భంగిమలను ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రేగు రవాణా మెరుగుపడుతుంది. స్థిరమైన ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శరీరానికి ఆహారం, వ్యాయామం ఎలా అయితే అవసరమో.. విశ్రాంతి కూడా అంతే అవసరం. అనేక యోగాసనాలు శరీరానికి, మనస్సుకు అవసరమైన విశ్రాంతిని అందిస్తాయి. చాలా భంగిమలు నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ధ్యానం ద్వారా రోజువారీ చింతలను అధిగమించవచ్చు.
శ్వాసను మెరుగుపరుస్తుంది
ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసపై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అందువల్ల యోగా అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలదు.
ఒత్తిడి నుంచి ఉపశమనం
ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒత్తిడి ఒకటి. యోగా దీనికి చక్కటి పరిష్కారం. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా మీరు అన్ని ఉద్రిక్తతలను వదిలించుకోవచ్చు. అలాగే ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చు.