- Home
- Life
- World Breast Feeding Week 2022: బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..
World Breast Feeding Week 2022: బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..
World Breast Feeding Week 2022: తల్లిపాలతోనే తల్లికి బిడ్డకు మధ్య బంధం మరింత బలపడుతుంది. అంతేకాదు తల్లిపాలతోనే బిడ్డ ఆయురారోగ్యాలతో జీవిస్తాడు.

తల్లి అవడం ఓ వరం అంటారు పెద్దలు. అందులోనూ పెళ్లైన ప్రతి మహిళ తొలి కళ కూడా తల్లి కావడమే. తల్లికావాలని ఎన్నో నోములు, వ్రతాలు చేసేవారు కాడా చాలా మందే ఉన్నారు. ఇక ఒక బిడ్డకు తల్లి అయ్యాక ఆమె ఆనందానికి అవదులు ఉండవేమో. ఈ సంగతి పక్కన పెడితే.. గర్భిణులుగా ఉన్నప్పుడు తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. తల్లులు సరైన పోషకాహారం తీసుకుంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారు. తల్లిపాలు పిల్లలకు సంజీవని లాంటిది. తల్లిపాల వల్ల పిల్లలకు ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయి. అన్నింటికీ మంచి బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికీ బిడ్డకు మధ్య బంధం మరింత బలపడుతుంది. డబ్ల్యూహెచ్ ఓ, యునిసెఫ్ లతో కూడిన వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ విధంగా తెలియజేస్తుంది.
బిడ్డ ఎదుగుదలలో తల్లిపాల ప్రాముఖ్యత :
నవజాత శిశువులు, శిశువులకు తల్లిపాలే సరైన పోషకాహారం. తల్లిపాలు శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. తల్లిపాలలో .. శ్వాస సమస్యలు, డయేరియా, చెవి సంక్రామ్యతలు, ఆస్తమా, న్యుమోనియా, తామరతో సహా సాధారణ జబ్బుల నుంచి పిల్లలను సంరక్షించే నిర్ధిష్ట యాంటీబాడీలు ఉంటాయి.
తల్లిపాలు తాగే పిల్లలకు ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ (SIDS), టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలతోనే బిడ్డ బ్రెయిన్ బాగా అభివృద్ధి చెందుతుంది. తల్లిపాలు తాగే పిల్లలకు ఐక్యూ అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
తల్లిపాలు చాలా తొందరగా జీర్ణం అవుతాయి. అంతేకాదు తల్లిపాలు తాగే పిల్లల్లో క్యాన్సర్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పాలిచ్చే తల్లుల్లో Postpartum depression, ప్రసవానంతర రక్తస్రావం వంటి ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. అంతేకాదు ఫ్యూచర్ లో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
బిడ్డకు తల్లిపాలు వల్ల బిడ్డకే కాదు.. తల్లికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లులకు టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లులు 500 కేలరీలను బర్న్ చేస్తారు. పాలివ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించే రిలాక్సింగ్ హార్మోన్ ఆక్సిటోసిన్ కూడా విడుదలవుతుంది. ఇది తల్లి తన బిడ్డతో మంచి బంధాన్ని అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.