రాత్రుళ్లు గోళ్లు కత్తిరించకూడదని ఎందుకు చెప్తారు.? ఈ రీజన్ తెలిస్తే ఒప్పుకోవాల్సిందే..
భారతీయ సంప్రదాయాల్లో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. మన పెద్దలు కొన్ని విషయాలను మనకు చిన్ననాటి నుంచి ఒక అలవాటుగా మార్చేస్తుంటారు. అయితే వీటిని కొందరు మూఢనమ్మకంగా భావిస్తుంటారు. మరికొందరు మాత్రం వీటిలోనూ సైన్స్ దాగి ఉందని చెబుతుంటారు. అలాంటి ఒక నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్యాస్తమయం తర్వాత కొన్ని రకాల పనులు చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. వీటిలో ప్రధానమైని రాత్రుల్లు ఇంటిని ఊడ్చకూడదని చెబుతుంటారు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి పోతుందని నమ్ముతారు. అలాగే చీకట్లో విలువైన వస్తువులు ఏమైనా పడిపోతే అవి చెత్తలో వెళ్లిపోతాయనే ఉద్దేశంతో ఇలా చెప్తారని అంటారు.
ఇక రాత్రుళ్లు డబ్బులను ఎవరికీ ఇవ్వకూడదని అంటుంటారు. దీనికి ఓ సైంటిఫిక్ రీజన్ చెబుతుంటారు. ప్రాచీన కాలంలో కరెంట్ సదుపాయం ఉండేది కాదు. దీంతో చీకట్లో డబ్బులు సరిగా కనిపించ లావాదేవీల్లో పొరపాటు జరిగే అవకాశం ఉంటుందని అందుకే రాత్రి డబ్బులు ఇవ్వకూడదని చెబుతుంటారు.
nails cutting
ఇక రాత్రుళ్లు చేయకూడదని చెప్పే మరో పని వేళ్ల గోళ్లు కత్తిరించడం. రాత్రిళ్లు గోళ్లు కత్తిరించకూడదనే నమ్మకం అనేక భారతీయ సంప్రదాయాల్లో ఉంది. రాత్రుళ్లు గోళ్లను కత్తిరించడాన్ని అశుభంగా భావిస్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, రాత్రి వేళ గోళ్లు కత్తిరించడం అనారోగ్యానికి, దురదృష్టానికి దారి తీస్తుందని నమ్మకం ఉంది. కొన్ని జ్యోతిష శాస్త్ర విశ్వాసాల ప్రకారం, రాత్రి వేళ గోళ్లు, జుట్టు కత్తిరించడం పితృదేవతలకు అపచారం అని భావిస్తారు. వాస్తు, జ్యోతిష శాస్త్ర ప్రకారం, రాత్రి గోళ్లు కత్తిరించడం ఆర్థిక నష్టానికి దారి తీస్తుందనే నమ్మకం ఉంది.
సైన్స్ కూడా.?
ప్రాచీన కాలంలో విద్యుత్ సరిగ్గా ఉండేది కాదు. కొవ్వొత్తులు, దీపాల వెలుగులోనే గడిపేవారు. దీంతో రాత్రుళ్లు గోళ్లను కత్తిరిస్తే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి గోళ్లను కత్తిరించకూడదనే ఆచారం వచ్చిందని అంటారు. రాత్రివేళ గోళ్లు నేలపై పడితే అవి కనిపించక పోవచ్చు. అవి ఆహారపదార్థాలలో పడితే, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గోళ్లలో ఉండే మలినాలు మనకు తెలియకుండానే ఆహారంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా చీకట్లో గోళ్లు కింద పడితే చిన్న పిల్లలు వాటిని తీసుకొని తినే ప్రమాదం కూడా ఉంటుందనే ఉద్దేశంతో చీకట్లో గోళ్లను కత్తిరించకూడదని చెబుతుంటారు.
అయితే ప్రస్తుతం కాలం మారింది. విద్యుత్ దీపాలు అందుబాటులోకి వచ్చాయి. గోళ్లు కింద పడకుండా ఉండే సరికొత్త నెయిల్ కటర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాత్రుళ్లు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా గోళ్లను కత్తిరించుకుంటున్నారు. అయితే నమ్మకాలను విశ్వసించాలా వద్దా అనేది వారి వారి ఆలోచనలపై ఆధార పడి ఉంటుంది.