Temple: ఈ ఆలయం మొత్తం ఎలుకలే.. వాటినే దైవంగా భావించే గుడి మన దేశంలో ఎక్కడ ఉందంటే..
Temple: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 వేల ఎలుకలు అన్నీ ఒకేచోట ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా ఒక గుడి అయితే.. వినడానికి వింతగా ఉన్నా.. ఇలా ఎలుకలతో నిండిన ఆలయం ఒకటి మన దేశంలో ఉందని తెలుసా?
ఎలుకని దైవంగా చూసే ఆలయం..
సాధారణంగా మన దేశంలోని ఆలయాలు వాటి శిల్పకళ, చరిత్ర, మహిమలకు ప్రసిద్ధి చెందుతాయి. కానీ, రాజస్థాన్ లోని ఒక ఆలయం మాత్రం ఎలుకలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నార్మల్ గా మన ఇంట్లో ఎలుక కనిపించింది అంటే.. దానిని తరిమికొట్టే వరకు నిద్రపోం. కానీ, ఈ గుడిలో మాత్రం ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 వేలకు పైగా ఎలుకలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా వాటిని చూసి భయపడకుండా.. ఎంతో పవిత్రంగా, దైవంతో సమానంగా చూస్తారు.
కర్ణి మాతా ఆలయం..
రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలోని దేశ్ నోక్ లో ఉన్న కర్ణి మాతా ఆలయంలో మనకు భక్తుల కంటే కూడా ఎక్కువగా ఎలుకలు కనిపిస్తాయి. 14వ శతాబ్దానికి చెందిన కర్ణిమాతను భక్తులు దుర్గాదేవి అవతారంగా కొలుస్తారు. ఈ ఆలయ పాలరాతి నేలపై ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ, భక్తులు పెట్టే పాలు, స్వీట్లు తింటూ కనిపిస్తాయి. స్థానికంగా ఈ ఎలుకలను కాబా అని పిలుస్తారు. ఇవి చీడపురుగులు కాదని, ఆలయ సంప్రదాయంలో కీలక భాగంగా అక్కడి భక్తులు నమ్ముతారు.
ఎలుకలను ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు..?
దీని వెనక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. కర్ణి మాత సవతి కుమారుడు లక్ష్మణ్ నీట మునిగి మరణించినప్పుడు, అతడిని తిరిగి బతికించమని యమధర్మరాజును ఆమె వేడుకున్నారట. దానికి అంగీకరించిన యముడు.. కర్ణి మాత వంశానికి చెందిన మగ సంతానం ఎలుకల రూపంలో పునర్జన్మ ఎత్తేలా వరం ఇచ్చాడని స్థానికులు నమ్ముతారు. అందుకే, ఈ ఎలుకలను తమ పూర్వీకులుగా భావించి భక్తులు పూజిస్తారు. ఎలుకలు కొరికిన ప్రసాదాన్ని తినడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
తెల్ల ఎలుక కనిపిస్తే పంట పండినట్లే...
ఈ వేలాది ఎలుకల్లో తెల్ల ఎలుక కనిపించడం ఎంతో శుభ సూచికంగా భావిస్తారు. అవి కర్ణి మాత, ఆమె కుమారుల ప్రతి రూపాలని భక్తులు నమ్ముతారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఎలుకలకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. పొరపాటున ఎలుకకు ఏదైనా హాని జరిగితే, ప్రాయశ్చిత్తంగా బంగారు ఎలుకను సమర్పించాలి.
ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి?
రైలు, రోడ్డు మార్గం: బికనీర్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ ఉంది. ఆలయానికి కిలోమీటర్ దూరంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది.
విమాన మార్గం: సమీప విమానాశ్రయం బికనీర్‌లోని నాల్ ఎయిర్పోర్ట్ (సుమారు 42 కిలోమీటర్ల దూరం).
ప్రవేశ రుసుము: ఆలయం ప్రతిరోజూ తెరిచి ఉంటుంది, ఎలాంటి ప్రవేశ రుసుము (Entry fee) లేదు.












