కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారు, ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి.?
మూడు రోజుల సంక్రాంతి పండుగలో కనుమను ప్రజలంగా సంతోషంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తమ కష్టాల్లో భాగమైన పశువులను రైతులు చూడ ముచ్చటగా ముస్తాబు చేసి వాటిని పూజిస్తున్నారు. ఇక కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు రథం ముగ్గు వేయడం ఆనవాయితీగా వస్తుంది, అదే విధంగా కనుమ రోజు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. ఇంటి ముందు రంగవల్లులతో అందంగా ముస్తాబు చేస్తుంటారు. అయితే ముగ్గుల వెనకాల ఎంతో శాస్త్రీయ కోణం ఉందని మీకు తెలుసా.? ముగ్గులను నక్షత్ర మండలాలకు ప్రతిరూపమని పండితులు చెబుతుంటారు. అలాగే మహాలక్ష్మీని ఇంట్లోకి ఆహ్వానం పలికేందుకు ముగ్గులు వేస్తారని పండితులు చెబుతుంటారు. అందుకే తెలుగు వారు ఏది ఏమైనా ప్రతీ రోజూ ఇంటి ముందు కచ్చితంగా ముగ్గులు వేస్తారు.
ఇక ముగ్గులు వేయడం వెనకాల ప్రకృతిలోని జీవుల పట్ల దయతో ఉండాలనే గొప్ప సందేశం కూడా దాగి ఉందని చెబుతుంటారు. సాధారణంగా ముగ్గుల్లో బియ్యపు పిండిని కూడా కలుపుతుంటారు. దీంతో ఇంట్లోని చీమలు, కొన్ని రకాల చిన్న చిన్న జీవులు వంటి వాటికి ఆహారం లభిస్తుందని అందుకే ముగ్గులు వేస్తారని శాస్త్రాలు చెబుతుంటాయి.
ముగ్గులు వేస్తే పరోక్షంగా ఆ జీవులకు ఆహారం అందించిన వారవుతాం. చుక్కలను కలుపుతూ ముగ్గులు వేస్తుంటాం, అదే విధంగా మనుషుల్ని కలుపుకుంటూ పోవాలని ముగ్గు సందేశం ఇస్తుందని అంటుంటారు.
కనుమ రోజు రథం ముగ్గు..
కనుమ రోజు రథం ముగ్గు వేయడం మనం చూసే ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇళ్ల ముందు కచ్చితంగా రథం ముగ్గును వేస్తుంటారు. రథం ముగ్గు సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మికతకు చిహ్నంగా చెబుతుంటారు. ఇక మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని విశ్వసిస్తారు.
దీనికి సూచికగానే తమను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించేందుకు రథం ముగ్గును వేస్తారని చెబుతుంటారు. అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి మూడు రోజులు ఉంటారని పురణాలు చెబుతున్నాయి. ఇలా మూడు రోజుల తర్వాత తిరిగి వెళ్లే బలిచక్రవర్తిని సాగనంపేందుకే ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారనే కథ కూడా ప్రచారంలో ఉంది.
ఎలాంటి నియమాలు పాటించాలి.?
కనుమ పండుగ రోజు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదని అంటారు. అదే విధంగా ఈరోజు గ్రామ దేవతలకు పొంగలిని నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. అలాగు కనుమ పండగ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని పండితులు సూచిస్తున్నారు.
పక్షులకు ఆహార ధాన్యాలను ఆహారంగా అందించాలని పండితులు చెబుతున్నారు. సాధారణంగా కనుమ రోజు మాంసాహారం తింటుంటారు. అయితే కనుమ రోజు నాన్ వెజ్ తినకూడదని, ఆ తర్వాతి రోజైన ముక్కనుమ రోజు తినాలని చెబుతున్నారు.