Walking Benefits: 60 ఏళ్లు దాటిన మహిళలు వాకింగ్ చేస్తే ఇంత మంచిదా?
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. పెద్ద వయసు వారు రకరకాల వ్యాయామాలు చేయడం కష్టం. కానీ వాకింగ్ చేయడం కాస్త సులువైన పని. మరీ ముఖ్యంగా 60 దాటిన మహిళలు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే షాక్ అవుతారు.

వాకింగ్ ప్రతి ఒక్కరికి అవసరమైన వ్యాయామం. రోజూ ఉదయం, సాయంత్రం కాసేపు నడిస్తే చాలు ఆరోగ్యానికి చాలా మేలు చేసినట్టే. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజూ నడవడం వల్ల వారిలో చాలా మార్పులు వస్తాయట. 60 దాటినా కూడా ఆరోగ్యాంగా ఉండాలంటే వాకింగ్ అలవాటు చేసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. వాకింగ్ మనసు, శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేలా చూస్తుందని చెబుతున్నారు.
10 వేల అడుగుల నడిస్తే..
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 10వేల అడుగులు నడిస్తే మంచిదనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. కానీ 60 ఏళ్లు దాటిన మహిళలు 10 వేల అడుగులు నడవడం చాలా కష్టం. అంత నడవాల్సిన అవసరం కూడా లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి 60 ఏళ్లు దాటిన మహిళలు ఎంత నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
60 ఏళ్లు దాటిన మహిళలపై ఇటీవల కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇందులో 63 ఏళ్లు పైబడిన 6వేల మంది మహిళలను అధ్యయనం చేశారు. వారు ఒక రోజులో సగటున 3,600 అడుగులు నడిచినట్లు నమోదు చేశారు. వారు దాదాపు 5.5 గంటలకు పైగా చురుకుగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
ఏయే కార్యకలాపాలు?
ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళలు రోజూవారి పనులే చేశారట. తల వెంట్రుకలు ఆరబెట్టుకోవడం, పాత్రలు కడగడం, ఇంటి పనులు చేయడం లాంటివి. ఒక రోజులో 10 గంటల 20 నిమిషాల వరకు కూర్చున్నారట. ఈ అధ్యయనం దాదాపు ఏడున్నర సంవత్సరాలు జరిగిందట. కాస్త చురుకుగా పనులు చేసుకున్న మహిళల కంటే తక్కువ శ్రమ కలిగిన వారి ఆరోగ్యం అస్సలు మెరుగ్గా లేదట. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేసిన మహిళలకు 16% తక్కువ వ్యాధి ప్రమాదాలు ఉన్నాయట.
ఎన్ని అడుగులు నడవాలి?
శారీరకంగా ఏమీ చేయని మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు 17% ఎక్కువట. 60 ఏళ్లు దాటిన మహిళలు ప్రతిరోజూ నెమ్మదిగా 3,600 అడుగులు నడిచినా, వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 26% తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.
గుండె ఆరోగ్యానికి
ప్రతిరోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి నడక సహాయపడుతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నడక మానసిక ఒత్తిడిని తగ్గించి.. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.