Yoga Day 2022: మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ యోగాసనాలు ప్రయత్నించండి!
Yoga Day 2022: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతో పాటు పరుగులు పెడుతూ ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే అధిక ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇలా కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు అంటూ పలు రకాల ఒత్తిడి కారణంగా చాలా మంది మానసిక ప్రశాంతతకు దూరంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే వారు మానసిక ప్రశాంతత కోసం ఈ క్రింది తెలిపిన యోగాసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ యోగాసనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...
కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్య విషయం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో పనులలో ఉన్నప్పటికీ తమ ఆరోగ్య రక్షణ కోసం కొంత సమయం కేటాయించి యోగ చేయడం జిమ్ కి వెళ్లడం వంటివి చేస్తున్నారు. అయితే కొందరు అధిక మానసిక సమస్యలతో బాధపడే వారు ఈ క్రింది తెలిపిన యోగాసనాలను తరచూ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి తమ పనులలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. మరి ఆ నాలుగు యోగాసనాలు ఏమిటి అనే విషయానికి వస్తే..
Pranayama: అధిక ఒత్తిడికి, మానసిక ఆందోళనతో బాధపడేవారికి ప్రాణాయామం ఎంతో అద్భుతమైన యోగాసనం అని చెప్పాలి. ఈ యోగాసనం ద్వారా ఊపిరి ఎలా పీల్చాలి మన శరీరంలోని ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ ఎలా పంపాలో తెలుసుకోవచ్చు. ఈ ఆసనం చేయడం ద్వారా రక్తనాళాలకు ఆక్సిజన్ శాతం అధికంగా అంది ఆస్తమా వంటి లక్షణాలు తగ్గుతాయి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన, వంటివి తగ్గి పోయి మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు.
Bridge pose: బ్రిడ్జి పోజ్ ఈ ఆసనాన్ని సేతు బంధాసనం అని అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్రుత, టెన్షన్, ఆందోళన పూర్తిగా తగ్గిపోవడమేకాకుండా కాళ్లు వెనుకభాగం మరింత చక్కగా సాగి ప్రశాంతమైన నిద్రను కూడా కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో బ్రిడ్జి పోజ్ ఆసనం ఎంతో కీలకమైనది.
Camel pose: ఒంటె ఆసనం వేసినప్పుడు మన శరీరంలో కలిగిన ఒత్తిడి తగ్గి పోవడమే కాకుండా మన శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా జరుగుతుంది. శరీరంలోని అన్ని భాగాలలో పాటు మన మెదడు కూడా ఆక్సిజన్ సరైన మోతాదులో అందడం వల్ల మనలో ఉన్నటువంటి ఒత్తిడి మొత్తం తొలగిపోయి, పూర్తిగా ప్రశాంతత కలుగుతుంది.
Child’s Pose: బాలాసనం అనేది మనలో నాడీవ్యవస్థను ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా మన శరీరంలో శోషరసం క్రమబద్ధీకరించినట్లు అవుతుంది. ఈ బాలాసనం వేయడం వల్ల నరాల పనితీరు మెరుగ్గా ఉండడమే కాకుండా అధిక ఒత్తిడి ఆందోళన తగ్గిపోతాయి. దీంతో మానసికంగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది.ఇలా మానసిక ఇబ్బందులతో బాధపడే వారు ఈ నాలుగు ఆసనాలను వేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చు.