పిల్లలతో సమయం గడపలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి
పేరెంట్స్ పిల్లల సంతోషం కోసం, వారి భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతుంటారు. దీంతో వారి సమయమంతా వర్క్ ప్లేస్ లోనే కరిగిపోతుంటుంది. ఎవరికోసం అయితే కష్టపడుతున్నారో వారితోనే సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నామనే బాధ వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఉన్న కాస్త టైంలోనే పిల్లలతో ఎలా గడపాలో కొన్ని మార్గాలు మీకోసం...

ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే ఇళ్లు గడిచే పరిస్థితి. ఉద్యోగరిత్యా చాలా బిజీగా ఉండటం వల్ల పిల్లలతో క్వాలిటీ టైం గడపలేకపోతున్నారు. దీంతో పేరెంట్స్ కి, పిల్లలకు మధ్య దూరం కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది. పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. అంతేకాకుండా వారి ఫీలింగ్స్ ను ఎవరితోనూ పంచుకోలేక బాధపడుతుంటారు.
మీది కూడా ఇదే సమస్యా?
మీరు కూడా మీ పిల్లలకి సరిగ్గా సమయం ఇవ్వలేకపోతున్నారా? అయితే కొన్ని విషయాలు పాటించడం ద్వారా ఉన్న టైంలోనే మీ పిల్లలతో సంతోషంగా గడపవచ్చు.
కథలు చెప్పండి
మీ పిల్లలతో ప్రతి క్షణాన్ని మీరు ఆస్వాదించాలనుకుంటే, కొన్ని కథలు, ఏవైనా సంఘటనలను వారితో పంచుకోండి. ఇదే కాకుండా, తక్కువ సమయంలో కూడా మీ పిల్లలతో మీరు ఆడుకోవచ్చు. దీంతో మీ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మీరు కూడా మీ పిల్లలతో గడిపిన ఈ అపురూప క్షణాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు.
చిత్రలేఖనం
మీ పిల్లలతో మీరు కొంత సమయం గడపాలనుకుంటే వారితో కలిసి కొన్ని బొమ్మలు గీయవచ్చు. మీరు ఇలా చేయడం ద్వారా రోజంతా మీరు వారితో లేకపోయినా వాటిని చూసి మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు.
వంటగదిలో మీతో
మీరు పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత వంట పనులు చేస్తుంటే అప్పుడు మీ పిల్లలను కూడా మీతో ఉంచుకోండి. మీరు వంట చేస్తున్నప్పుడే మీ పిల్లలతో చాలా విషయాలు మాట్లాడవచ్చు. చెప్పాలంటే మీరు మీ పిల్లలతో చాలా సమయం గడపవచ్చు. అలాగే మీరు వస్తువులు కొనడానికి బయటకు వెళ్తుంటే, తప్పకుండా మీ పిల్లలను కూడా మీతో తీసుకెళ్లండి. దీని ద్వారా తక్కువ సమయంలో కూడా మీ పిల్లలతో మీరు మంచి క్షణాలను ఆస్వాదించవచ్చు.
ఇది కూడా చేయండి
- పడుకునే ముందు మీ పిల్లలకు కథలు చెప్పండి. అలాగే మీరు పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత సెల్‌ఫోన్‌లో సమయం గడపడానికి బదులు, మీ పిల్లల దగ్గర కొంత సమయం గడపండి. మీ పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చూపించే విధంగా వారిని హగ్ చేస్కొండి, ముద్దు పెట్టుకోండి.
- మీ పిల్లలు చేసే చిన్న చిన్న మంచి పనులను ప్రశంసించండి. దీంతో మీ పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.