Thati kallu: తాటి కల్లు మంచిదా, ఈత కల్లు మంచిదా.? ఇంతకీ రెండింటి మధ్య తేడా ఏంటి.?
ఎన్నో వందల ఏళ్ల నుంచి కల్లును పానీయంగా స్వీకరిస్తున్నారు. చెట్ల నుంచి సహజంగా లభించే ఈ పానీయాన్ని ప్రజలు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కల్లు బాగా డిమాండ్ ఉంటుంది. ఇటీవల యువత కూడా కల్లుపై ఆసక్తి చూపిస్తున్నారు.

Thati kallu, Etha Kallu
చెట్టు కల్లును చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన చెట్టు కల్లును ఇటీవల పట్టణాల ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. అందులోనూ చెట్టు కల్లు ఆరోగ్యానికి మంచిదని సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది కల్లును ఇష్టంగా తీసుకుంటున్నారు. ఇక చెట్టు కల్లు అనగానే తాటి కల్లు, ఈత కల్లు రెండూ గుర్తొస్తాయి. ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి.? ఆరోగ్యంపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి కల్లు:
తాటి చెట్టు నుంచి తీసే కల్లును తాటి కల్లుగా చెబుతుంటారు. సాధారణంగా తాటి చెట్లు చాలా పొడుగ్గా ఉంటాయి. తాటి కల్లు రుచి విషయంలో పుల్లగా ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఈ కల్లు రుచి వగరుగా మారుతుంటుంది. అలాగే తాటి కల్లును తీసుకుంటే మత్తు కలిగిన భావన ఎక్కువగా ఉంటుంది.
లాభాలు:
తాటి కల్లును మితంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని అంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాటి కల్లు శరీర ఉష్ణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అంటారు. తాటి కల్లులో గ్లూకోజ్, కొంతమేర కార్బోహైడ్రేట్స్ ఉండటంతో శక్తిని అందిస్తుంది. తాటి కల్లు మూత్ర నాళాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని అంటారు. అందుకే కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి ఉపశమనం కలిగించేలా చేస్తుందని చెబుతుంటారు.
నష్టాలు:
తాటి కల్లును ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కల్లు సమయం గడిచినా కొద్దీ ఫర్మెంటేషన్ అయ్యి ఇంచుమించుగా మద్యంలాగా మారుతుంది. ఇది లివర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అలవాటు ఉంటుంది. కొందరిలో తాటి కల్లు జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది.
ఈత కల్లు:
ఈత చెట్లు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటికి కట్టే కుండలు నేరుగా చేతికి అందుతాయి. ఈత చెట్టు నుంచి తీసే ఈ కల్లు రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. తాటి కల్లుతో పోల్చితే మత్తు భావన తక్కువగా ఉంటుంది.
లాభాలు:
ఈత కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు. ఇందులో సహజంగా గ్లూకోజ్, సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఈత కల్లు ఉపయోగపడుతుంది. ఈత కల్లులో విటమిన్ B సమూహాలు, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి కాపాడడంలో ఉపయోగపడతాయని చెబుతుంటారు.
నష్టాలు:
ఈత కల్లును కూడా అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే మితంగా తీసుకుంటే మాత్రం ఈత కల్లుతో లాభాలు ఉంటాయని అంటున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

