తీపి, పులుపు, కారం.. నిమ్మకాయ పచ్చడి వెరైటీలు.. ట్రై చేయండి..
నిమ్మ వాసన మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. శరీరానికి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక నిమ్మకాయ పచ్చడి వాసన రాగానే నోట్లో నీళ్లురుతాయి. కడుపులో అప్పటివరకూ లేని ఆకలి కేకలు వేస్తూ పచ్చడి నోట్లో వేసుకోమంటూ తొందరపెడుతుంది.
నిమ్మ వాసన మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. శరీరానికి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక నిమ్మకాయ పచ్చడి వాసన రాగానే నోట్లో నీళ్లురుతాయి. కడుపులో అప్పటివరకూ లేని ఆకలి కేకలు వేస్తూ పచ్చడి నోట్లో వేసుకోమంటూ తొందరపెడుతుంది.
ఆకలిని పెంచి అదే సమయంలో ఆరోగ్యానికీ సహకరించే నిమ్మకాయ పచ్చడిని ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. పిల్లలైతే రకరకాల టిఫిన్స్ లో అదరువుగా దీన్ని లొట్టలేసుకుంటూ తినేస్తారు. ముఖ్యంగా పరాఠాలాంటి టిఫిన్స్ కు నిమ్మకాయ పచ్చడి బాగా సెట్ అవుతుంది.
పరాఠా పైన నిమ్మకాయ పచ్చడిని జామ్ లా రుద్ది చుట్టి పిల్లలకు ఇస్తే క్షణాల్లో ఖాళీ చేసేస్తారు. నిమ్మకాయ పచ్చడిని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాలుగా తయారుచేస్తారు. ఎలా తయారు చేసినా నిమ్మ రుచి నిమ్మదే కదా.
తియ్యగా, కారంగా, పుల్లగా ఇలా మూడు రకాలుగా తయారుచేసుకునే నిమ్మకాయ పచ్చడి వెరైటీల గురించి చూద్దాం. ఇవి ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు.
తీపి నిమ్మ పచ్చడి :
ఈ తీపి నిమ్మ పచ్చడికి కావాల్సిన పదార్థాలు..
అరకిలో నిమ్మకాయలు, 4 నిమ్మకాయల రసం, 1 టీస్పూన్ పసుపు, 50 గ్రాముల ఉప్పు, అరకిలో చక్కెర, 5-6 లవంగాలు.
తయారు చేసే విధానం : నిమ్మకాయలను ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోండి. ఆ తరువాత నాలుగు భాగాలుగా కోసి పెద్ద గిన్నెలో వేసుకోండి. ఈ గిన్నెలో ముక్కల మీదినుండి ముందుగా తీసిపెట్టుకున్న నాలుగు నిమ్మకాయల రసం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి.
ఇప్పుడు దీన్ని మొత్తం ఒక శుభ్రమైన గాజు సీసాలో వేసి మూత గట్టిగా బిగించండి. ఈ సీసాను 7-8 రోజులు సూర్యకాంతిలో ఉంచండి. ప్రతిరోజూ ఒకట్రెండుసార్లు బాటిల్ ను కదిలిస్తూ ఉండాలి.
ఇక 8 వ రోజు, ఒక బాణాలిలోకి ఈ నిమ్మకాయ మిశ్రమాన్ని తీసుకోవాలి. దీన్ని మధ్యరకం మంట మీద వేడి చేయాలి. ఇందులో అరకిలో చక్కెర, లవంగాలు వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి.
చక్కెర కరిగిపోయి.. నిమ్మరసంతో కలిసి.. పాకంలా తయారై.. ఉడుకుపట్టగానే మంటను సిమ్ లో పెట్టి వదిలేయండి. రసం చిక్కగా అయ్యేవరకు అలాగే ఉంచండి. మధ్య మధ్య లో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి.
బాగా దగ్గరికి వచ్చాక స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లబరచాలి. ఆ తరువాత చల్లబడిన మిశ్రమాన్ని శుభ్రమైన గాజు కంటైనర్ లోకి తీసుకోవాలి. దీనికి గట్టిగా మూతను బిగించి, 15-20 రోజులపాటు మళ్లీ ఎండలో పెట్టాలి.
ఇలా చేయడం వల్ల నిమ్మకాయ ముక్కలు తీపిగా మారతాయి. లేకపోతే నిమ్మతోలులోని చేదు వదలదు. 20 రోజుల తరువాత మీ తియ్యటి నిమ్మకాయ పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని అన్నంతోగానీ, టిఫిన్స్ తో గానీ తినొచ్చు.
నిమ్మకాయ కారం పచ్చడి..
నిమ్మకాయ కారం పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు - 20 నిమ్మకాయలు, 2 టేబుల్ స్పూన్ నూనె, 3 స్పూన్ ఆవాలు, ¼ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు పొడికారం, 2 టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి తగినంత ఉప్పు.
తయారు చేసే విధానం : మొదట 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మెంతులను చక్కగా వేయించుకోవాలి. వీటిని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయలను నాలుగు భాగాలుగా కోసి పెట్టుకోవాలి.
ఒక బాణాలి తీసుకుని దీంట్లో నూనె వేడిచేసి ఒక స్పూన్ ఆవాలు, ఇంగువ వేయాలి. ఆవాలు కాస్త వేగగానే నిమ్మకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసి మళ్లీ కలపాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 7,8 నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తరువాత పొడి కారం, ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మెంతి-ఆవాలు పొడి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత స్టౌ ఆఫ్ చేస్తే సరి. కారం కారం, పుల్లపుల్లటి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.
నిమ్మకాయ పుల్లటి పచ్చడి..
నిమ్మకాయ పుల్లటి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు- 10 నిమ్మకాయలు, 3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ అమ్చూర్ పౌడర్, ½ స్పూన్ పసుపు, ½ స్పూన్ ఆవాలు, ½ స్పూన్ జీలకర్ర, ¼ స్పూన్ కలోంజి, ¼ స్పూన్ నల్ల మిరియాలు పొడి, ¼ స్పూన్ ఇంగు.
తయారు చేసే విధానం :
ఒక బాణాలిలో నీళ్ళు తీసుకొని, నిమ్మకాయలు వేసి ఒక్కసారి మరిగించాలి. ఇప్పుడు మంటను తగ్గించి, 6-8 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తరువాత నిమ్మకాయలను బైటికి తీసి, కొద్దిగా చల్లబరచాలి.
చల్లబడ్డాక నిమ్మకాయలను నాలుగు భాగాలుగా కోసి విత్తనాలు తీసేయాలి. ఈ ముక్కలను పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉప్పు, అమ్చుర్ పౌడర్, పసుపు, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
మరో బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటమనేవరకు ఉంచాలి. దీనికి కలోంజి, ఇంగువ వేసి ఒక్క నిముషం ఉంచి తీసేయాలి. దీన్ని గిన్నెలోకి తీసుకున్న నిమ్మకాయ మిశ్రమానికి కలపాలి.
ఈ ఊరగాయను శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకోవాలి. గాలి పోకుండా మూత గట్టిగా బిగించాలి. ఆ తరువాత దీన్ని 5-6 రోజులు ఎండలో ఉంచండి. ప్రతీరోజూ ఈ బాటిల్ ను కదిలిస్తూ ఉండాలి. 5,6 రోజుల్లో చిక్కటి, పుల్లటి నిమ్మకాయ పచ్చడి తినడానికి రెడీ అయిపోతుంది.