దాంపత్యంలో మీది వన్ సైడ్ లవ్వా? ఇలా తెలుసుకోండి..
వన్ సైడ్ లవ్ చాలా బాధాకరంగా ఉంటుంది. అవతలివాళ్లనుంచి ఎలాంటి స్పందన లేకుండా.. ఒకవైపునుంచే ప్రేమను కురిపించడం.. వారినుంచి కూడా ప్రేమను ఆశించడం.. అది వర్ణించలేని బాధ. ఇది ఎప్పుడూ బాలెన్స్ డ్ గా ఉండే సంబంధం కాదు. నిరాశ, అభద్రతలు తలెత్తుతాయి. మరి మీ రిలేషన్ ఎలా ఉంది?
ఇద్దరూ కలిసి జీవిస్తున్నా ప్రేమ విషయానికి వచ్చేసరికి ఒకరివైపునుంచే వ్యక్తమవుతుండడం.. వన్ సైడ్ లవ్ గా మీ బంధం మిగిలిపోవడం.. కొన్నిసార్లు జరుగుతుంటుంది. దీనికి కారణం ఏదైనా కావచ్చు. కానీ అది చాలాసార్లు తెలియకుండా బాధపెడుతుంటుంది. అలా మీ ప్రేమ వన్ సైడ్ లవ్ గా మారిపోతోంది.. మీ బంధం ప్రమాదంలో పడబోతోంది అని తెలిపే కొన్ని అంశాలుంటాయి. సరైన సమయంలో వీటిని గుర్తించడం వల్ల సరిదిద్దుకోవడం.. లేదా మరింత దిగజారకుండా ప్రయత్నాలు చేసే వీలుంటుంది. అవేంటో చూడండి.
మీకు అవసరమైనప్పుడు తోడూ-నీడగా..
మీకు అవసరమైనప్పుడు, అవసరమైన సమయంలో మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటున్నారా? అని ప్రశ్నించుకుంటే.. మీరు చూపినంత శ్రద్ధ.. పట్టించుకోవడం అటువైపు నుంచి ఉండదు. ఒక బంధం సరిగ్గా నడవాలంటే.. ఇద్దరిమధ్య ఇలాంటి అవగాహన, అవసరం, మద్దతు తప్పనిసరి.
బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు..
మీ భాగస్వామి మీ బంధాన్ని నిత్యనూతనంగా ఉంచడానికి లేదా బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం... ఇది వారు మిమ్మల్ని ఇకపై ప్రేమించడం లేదనే అర్థాన్ని ఇస్తుంది. ఇద్దరికీ బంధం మీద విశ్వాసం, ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉంటే.. ఇద్దరి వైపునుంచి ఒకేరకమైన ప్రయత్నంఉంటుంది. లేనప్పుడు మీ వైపు నుంచి మాత్రమే ప్రయత్నం జరుగుతుంది. అది మీ బాధ్యతగా ఎదుటివారు భావిస్తారు. అది సరికాదు.
సాకులు చెప్పడం..
ప్రతీసారి మీ భాగస్వామి మీతో లేకపోవడం గురించి, తన మద్దతు లోపించడం గురించి మీరు కవర్ చేస్తున్నారంటే.. అలా చేయడం తరచుగా జరుగుతుందంటే... ఇకపై మీ బంధంలో మీరొక్కరే ఉన్నారని అర్థం.
క్షమాపణలు మీ వైపే...
మీ బంధంలో ఏ సమస్య వచ్చినా.. మీదే తప్పుగా, మీరే క్షమాపణలు చెప్పే వ్యక్తిగా మిగిలిపోతున్నారంటే ఆ బంధం వన్ సైడెడ్ అనేది గుర్తించుకోవాలి. మీరే తప్పూ చేయకపోయినా.. మీరే దోషి అవుతుంటే... అపరాధ భావన ఒత్తిని మీరు తట్టుకుని ముందుకు వెళ్లడం కుదరని పని..
వేరేవారితో సమస్యలు పంచుకోవడం...
మీ మనసులోని మాటలు, సమస్యలు మీ భాగస్వామితో కాకుండా బంధువులు, స్నేహితులో ఎక్కువగా చర్చిస్తున్నారంటే మీ బంధం బలహీనపడినట్టే. వన్ సైడెడ్ అయినట్టే..