చంద్రుడు లక్ష్మీదేవికి ఏమవుతాడు? వారి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి?
సంపదను ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుందని అంటారు. అయితే లక్ష్మీదేవికి, చంద్రుడికి మధ్య ఉన్న అనుబంధం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు
హిందూ పురాణాలలో లక్ష్మీదేవి సంపదకు అధిదేవత. ప్రతి ఇంట్లోనూ ఆ మహాలక్ష్మికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. విష్ణువుతో కలిసి ఆమె పాలసముద్రంలో కొలువుదీరి ఉంటుందని చెప్పుకుంటారు. ఈ లక్ష్మీనారాయణ కృప ఉంటే చాలు.. ఆ వ్యక్తికి జీవితంలో తిరిగే ఉండదని సకల సంపదలు, విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. లక్ష్మీనారాయణులు ఒకరిని ఒకరు ఎంతో ప్రభావితం చేసుకుంటారు. ఒకరి శక్తి మరొకరికి బలాన్నిస్తుంది. అందుకే వీరిద్దరూ ఒక్కరిగానే చెప్పుకోవాలి. అయితే ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి ఆకాశంలో మెరిసే చంద్రుడికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుసా?
చంద్రుడు ఏమవుతాడు?
మహాలక్ష్మి దేవి పుట్టుక గురించి భక్తులకు తెలిసే ఉంటుంది. పాలసముద్రంలో పుట్టిన దేవత ఆమె. దూర్వాస మహర్షి శాపం వల్ల ఆమె వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలోకి వెళ్లిపోయిందని చెబుతారు. క్షీరసాగర మధనం చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన వస్తువులతో పాటు శ్రీ మహాలక్ష్మి కూడా జన్మించిందని అంటారు. అదే పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి తర్వాత చంద్రుడు జన్మించాడు. అలా లక్ష్మీదేవి, చంద్రుడు ఒకరికొకరు అక్క తమ్ముళ్లుగా మారారని అంటారు. లక్ష్మీదేవి సోదరుడిగా చంద్రుడిని చెప్పుకుంటారు.
భర్త వెంటే భార్య
లక్ష్మీదేవి తన భర్తను ప్రతి అవతారంలోనూ అనుసరిస్తూనే వెళ్ళింది. శ్రీమహావిష్ణువు రాముడి అవతారం ఎత్తినప్పుడు ఆమె సీతగా మారింది. ద్వాపర యుగంలో కృష్ణుడిగా విష్ణువు భూమి మీదకు చేరితే ఆమె రుక్మిణిగా వచ్చింది. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామిగా విష్ణువు, అలివేలు మంగగా లక్ష్మీదేవి ఉద్భవించారు. లక్ష్మీదేవి లేని విష్ణువును సంపూర్ణమైన దేవుడిగా భావించలేము. లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నప్పుడే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది. చేతుల్లో పద్మాలతో, ధన కుంభంతో, కలువ పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రతిమ ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారికి సుఖసంపదలు కలుగుతాయి.
అష్టలక్ష్ములుగా...
లక్ష్మీదేవిని పూజించడం వల్ల కేవలం సంపద మాత్రమే కాదు.. ధైర్యం, సంతానం, ధాన్యం, విజయం, జ్ఞానం.. ఇలా ఎన్నో శుభాలు కలుగుతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా మారి అందరి కోరికలను తీరుస్తుంది. ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మీ, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి... ఇలా ఎనిమిది రూపాయల్లో భక్తుల కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటుంది.
లక్ష్మీదేవి కూర్చున్న ఫోటోనే
మీ ఇంట్లో ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఉన్న పటాన్ని ఉంచుకోవాలి. ఆమె నిల్చున్నట్టు ఉన్న విగ్రహాలను లేదా చిత్రాలను ఇంట్లో పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి కలువ పువ్వుపై కూర్చున్నట్టు ఉంటే మీ ఇంట్లో ఆమె తిష్ట వేసుకొని ఉంటుందని అర్థం. అదే నిలుచుని ఉంటే ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్లే అవకాశం ఉందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని ఎప్పుడూ కూర్చున్నా తీరులోనే చిత్రాలను లేదా విగ్రహాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.