Chandra Grahanam: గర్భిణులు చంద్రగ్రహణం రోజు ఈ పనులు చేయకూడదట, ఎందుకంటే..
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో చంద్రగ్రహణం రాబోతోంది. ఆరోజు కొన్ని పనులు చేయకూడదని అంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. చంద్రగ్రహణం రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.

చంద్రగ్రహణం ప్రాముఖ్యత
జ్యోతిష్యశాస్త్రంలో చంద్రగ్రహణం ముఖ్యమైనది. గ్రహణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఎన్నో సాంప్రదాయాలు, పద్దతులు కూడా గ్రహణం సమయంలో పాటిస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్ర గ్రహణం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పట్నించి ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు. వారు గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇక్కడ ఇచ్చాము.
చంద్రగ్రహణం ఎప్పుడు?
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం రాబోతోంది. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 గంటలకు గ్రహణం ప్రారంభమై, సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్యుల ప్రకారం, ఈ చంద్రగ్రహణం 'రక్త చంద్రుడి'లా కనిపిస్తుంది. దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు. చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాచీన కాలం నుంచి నమ్మకాలు ఉన్నాయి. ఇతరులతో పోలిస్తే గర్భిణులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం రోజు చేసే పనులు గర్భిణీ స్త్రీలకు సమస్యలు తెచ్చిపెడతాయని అంటారు.
బయటకు రావద్దు
చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం అధికంగా ఉంటుందని అంటారు. కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకూడదు. చంద్రడిని చూడకూడదు. చంద్రుని కాంతి మీపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
పదునైన వస్తువులకు దూరంగా
గ్రహణం సమయంలో భూమిపై పడే చంద్ర కిరణాలు ఏమాత్రం శుభప్రదమైనవి కాదు. ఆ కిరణాలు గర్భాశయంపై పడకూడదు అంటారు. అవి చెడు ప్రభావాన్ని చూపిస్తాయంటారు. ఈ సమయంలో గర్భిణులు సూదులు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను చేతితో పట్టుకోకూడదు. ఈ వస్తువుల వాడడం వల్ల పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలకు కారణం కావచ్చు. గ్రహణం మొర్రి వంటివి వచ్చే అవకాశం ఉంది.
ఈ మంత్రాలు జపించండి
ఈ సమయంలో మీకు ఇష్టమైన దేవుని మంత్రాలు జపిస్తూ ఉండాలి. ముఖ్యంగా చంద్ర మంత్రాలు జపించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దేవుడిని స్తుతిస్తూ, మంత్రాలు జపిస్తూ ఉండండి. గ్రహణం దాదాపు నిద్రలోనే గడిచిపోతుంది ఈసారి. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
దారంతో పరిహారం
గర్భిణులు చంద్రగ్రహణం రోజు ఒక పరిహారాన్ని చేస్తే మంచిది. గర్భిణీ స్త్రీ తన శరీరం ఎత్తుకు సమానమైన దారం తీసుకొని, దానిని ఇంట్లో ఎక్కడైనా ఒక చోట ఉంచాలి. గ్రహణం అయిపోయాక దానిని ప్రవహించే నదిలో లేదా చెరువులో వదిలేయాలి. దీనివల్ల గ్రహణ ప్రభావం వారిపై పడకుండా తగ్గుతుందని అంటారు.