Motivational story: ఈ బండరాయి కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే.. కష్టం ఇష్టంగా మారిపోతుంది.
Motivational story: కథలు వాస్తవలకు దూరంగా ఉన్నా.. జీవితానికి సరిపడ సందేశాన్ని అందిస్తాయి. చిన్న కథల్లోనే ఎంతో పెద్ద సందేశం దాగి ఉంటుంది. అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..

Motivational story
మనలో చాలా మంది కష్టం అంటే భయపడతారు. వీలైనంత వరకు కష్టాలకు దూరంగా ఉండాలని ఆశిస్తుంటారు. అయితే కష్టాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే గొప్ప సందేశాన్ని అందించే ఓ కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం.
ఒక శిల్పకారుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ సమయంలో అతనికి ఒక బండ రాయి కనిపిస్తుంది. రాయి చూడ్డానికి బాగా ఉండడంతో వెంటనే తన చేతిలోని ఉలిని తీసుకొని రాయితో ఏదైనా చెక్కుదామని ప్రయత్నిస్తాడు. ఒక దెబ్బ వేసే సరికి ఆ రాయి స్పందిస్తుంది. నాకు చాలా నొప్పిగా ఉంది. దయచేసి నన్ను వదిలేయ్ కావాలంటే వేరే రాయిని చూసుకో అని చెబుతుంది.
దీంతో ఆ శిల్పకారుడు కొంత ముందుకు వెళ్తాడు. అక్కడ మరో రాయి కనిపిస్తుంది. దీంతో ఆ రాయిని చెక్కుదామని ఫిక్స్ అవుతాడు. అయితే ఆ రాయికి కూడా నొప్పి పుడుతుంది. కానీ ఓర్పుగా నొప్పిని భరిస్తుంది. కాసేపటికే ఆ బండరాయి కాస్త వినాయకుడి విగ్రహంగా మారుతుంది. తర్వాత శిల్పాకారుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ సాధువు వినాయకుడి విగ్రహాన్ని చూసి రోజూ పూజ చేస్తాడు. దీంతో గ్రామస్తులంతా ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెడతారు. ఇదే సమయంలో కొబ్బరి కాయ కొట్టాలని అనుకుంటారు. కొబ్బరి కొట్టేందుకు బండ కోసం వెతుకుతారు. శిల్పకారుడు మొదట చూసిన రాయినే తీసుకొచ్చి కొబ్బరి కాయ కొట్టేందుకు ఉపయోగిస్తారు. దీంతో ప్రతీ క్షణం కొబ్బరి దెబ్బలతో ఆ రాయికి చుక్కలు కనిపిస్తుంది. 'ఉలి దెబ్బలకు ఒక్కరోజు ఓర్చుకుని ఉంటే, జీవితాంతం ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు' అని ఆ రాయి బాధపడుతుంది.
నీతి:
పైన కథలోని మొదటి రాయిలాగే మనలో కూడా చాలా మంది కష్టాలను తప్పించుకోవాలని చూస్తుంటారు. ఈజీ లైఫ్ కోసం చూస్తుంటారు. అయితే కష్టాలను తట్టుకుంటేనే సంతోషం వస్తుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. కొన్ని రోజులు ఓపికగా కష్టాన్ని భరిస్తే రెండో రాయిలాగా జీవితాంతం సంతోషంగా ఉంటుంది.