భర్త బరువూ ముఖ్యమే.. పిల్లలు పుట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణమే మరి..!
అధిక బరువు, ఆహారపు అలవాట్లు, నిద్రలేకపోవడం, ఊబకాయం వంటివి కూడా పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

భారతీయుల్లో రోజు రోజుకు వంధ్యత్వ సమస్య పెరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్య కేవలం ఆడవారిలోనే కాదు మగవారిలో కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పురుషుల వయసు పెరుగుతున్న కొద్దీ సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వయసుతో పాటు వీర్యం నాణ్యత క్షీణిస్తుంది. కానీ ప్రస్తుతం పెళ్లైన యువకులు కూడా సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వయసులో ఉన్నా స్పెర్మ్ సంఖ్య తగ్గడం, నాణ్యత లేకుండా ఉండటం వంటి సమస్యలను ఎదురవుతున్నాయి. ఇలా జరగకూడదంటే పెళ్లైన పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
Infertility
మగ వంధ్యత్వం (Male infertility) అంటే ఏమిటి ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. మిల్లీలీటర్ వీర్యం కు 15 మిలియన్ స్పెర్మ్ ను కలిగి ఉంటే.. మీ Sperm count సాధారణం కంటే తక్కువగా పరిగణించబడుతుంది. స్పెర్మ్ కౌంట్ ఈ పరిమితికి తక్కువగా ఉంటే దాన్ని ఒలిగోస్పెర్మియా (Oligospermia)అంటారు. అంటే మగ వంధ్యత్వం అని అర్థం.
మగ వంధ్యత్వానికి కారణాలు
పురుషుల్లో వంధ్యత్వానికి ఎన్నో కారణాలున్నాయి. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు వీర్యకణాల మొత్తాన్ని తగ్గిస్తాయి. కొన్ని మందులు, రక్తపోటు వంటి యాంటీబయాటిక్స్ స్ఖలన సమస్యలను కలిగిస్తాయి. అలాగే స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. మెదడుతో పాటుగా వృషణాలు స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడే అనేక హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు అసమతుల్యంగా మారితే స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. అలాగే మితిమీరిన మద్యపానం కూడా వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. సిగరేట్లు కాల్చని వారితో పోల్చితే కాల్చే వారిలోనే స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. వీటన్నింటితో పాటుగా పురుషుల్లో కనిపించే ఊబకాయం కూడా వంధ్యత్వానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయం
ప్రస్తుత కాలంలో ఊబకాయం సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. తమను తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించుకున్నప్పటికీ ఊబకాయులు హెల్తీగా అస్సలు ఉండరు. ఎందుకంటే ఊబకాయం గుండెపోటు, అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు బరువు వల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే అధిక బరువు వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందట. ముఖ్యంగా 40 శాతం మంది వీర్యకణాలు స్ఖలనంలో ఉండవని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఊబకాయం పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఊబకాయం ఉన్న పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ ను, తక్కువ స్పెర్మ్ కౌంట్ ను, పేలవమైన స్పెర్మ్ మార్ఫాలజీ ని, తక్కువ స్పెర్మ్ చలనశీలతను కలిగి ఉంటారు. వీటిలో ప్రతి ఒక్కటి కూడా వంధ్యత్వానికి దారితీస్తుంది. అందుకే బరువు తగ్గాలని ఆరోగ్య నిపుణులు పురుషులకు సలహానిస్తుంటారు.
పురుష సంతానోత్పత్తిని ఎలా మెరుగుపరచాలి?
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఊబకాయం నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవాలి. అలాగే నిద్రనియమాలను పాటించాలి. కొన్ని రకాల మందులు కూడా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ మీ శరీర బరువును పెంచడమే కాదు వంధ్యత్వానికి కూడా దారితీస్తాయి. అందుకే పురుషులు ఈ అలవాట్లను మానుకోవాలి.