మంగళసూత్రాల్లో నల్లపూసలు ఎందుకు వాడతారో తెలుసా?
శుభానికి చిహ్నమైన మాంగళ్యంలో నలుపును వాడడం... మంగళసూత్రాల్లో నల్ల పూసలను చేర్చడం, నల్లపూసల గొలుసులు వివాహితలు ధరించాలని చెప్పడం. చెడుకు మారుపేరుగా నిర్వచించే నలుపును శుభానికి చిహ్నంగా ఇంతగా ఎలా కనెక్ట్ చేశారు.
నలుపు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలు, విశ్వాసాల్లో ఈ రంగును చాలా దూరం పెడతాం. అశుభంగా భావిస్తాం. ఎందుకు? నలుపు అందమైనది కాదా? అంటే మిగతా అన్ని రంగుల కంటే అందమైనది, విస్తృత సంకేత అర్థాన్ని కలిగి ఉండే రంగు నలుపు మాత్రమే. అంతేకాదు నలుపు రంగు శక్తి, బలం, మిస్టరీ, భయం, చెడులకు సంకేతంగా చూస్తారు. నలుపు అంత ఆకర్షణీయమైనదిగా భావించరు.
అందుకే నలుపును చెడు దృష్టికి సంకేతంగా చెబుతారు. నల్ల బట్టలు, నల్ల వస్తువులు ధరించడం అశుభంగా భావిస్తారు. శుభకార్యాల్లో నలుపును దగ్గరికి రానివ్వరు. ఇంతగా నలుపు చుట్టూ పేరుకుపోయిన భావజాలంలోనూ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..
శుభానికి చిహ్నమైన మాంగళ్యంలో నలుపును వాడడం. మంగళసూత్రాల్లో నల్ల పూసలను చేర్చడం, నల్లపూసల గొలుసులు వివాహితలు ధరించాలని చెప్పడం. చెడుకు మారుపేరుగా నిర్వచించే నలుపును శుభానికి చిహ్నంగా ఇంతగా ఎలా కనెక్ట్ చేశారు.
ప్రతి సంప్రదాయం కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. పూర్వకాలంలో మన పెద్దలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటివి కనిపెట్టారు. వీటిల్లోనూ కొన్ని ఆచారాలు ఇప్పటికీ యధాతథంగా అంగీకరించబడుతున్నాయి. ఇక కొన్ని విషయాలు తెలియని వారు చేసే ప్రచారం వల్ల మూఢనమ్మకాలుగా భావించబడుతున్నాయి. ఏదెలా ఉన్నా.. తర్కాలకు సంబంధం లేకుండా కొన్ని ఆచారాలు అలా అనుసరిస్తూనే ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటే మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించడం. అందులో నల్లపూసలు మరింత పవిత్రంగా చేర్చడం.
నల్ల పూసలు : దేశవ్యాప్తంగా మంగళ సూత్రాలు లేదా తాళి రకరకాల రూపాల్లో ఉంటుంది. బంగారు గొలుసుకు ఆ ప్రాంతపు నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల ప్రాతిపదికన.. ఒకటి లేదా రెండు సూత్రాలను నల్లపూసలు, పగడాలు, ముత్యాలతో కలిపి కుచ్చుతారు. ఇది కొన్ని చోట్ల ఒకటే సూత్రంగా కూడా కనిపిస్తుంది. అయితే మంగళసూత్రంలో కనిపించే నల్లపూసల్ని కేవలం పూసలుగా మాత్రమే చూడకూడదు.
జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు సౌందర్య లహరి అనే ప్రసిద్ధ పుస్తకంలో మంగళ సూత్రం ధరించే భావనను పునశ్చరణ చేశారు. స్త్రీ వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలిపే ఒక ఆభరణం మంగళసూత్రం, నల్లపూసలు.
మంగళ సూత్రంలో ఉండే నల్ల పూసల వల్ల స్త్రీ చుట్టూ ఉన్న పరిసర వాతావరణంలోని దుష్టశక్తులను గ్రహించి వాటిని పారద్రోలడానికి నల్లపూసలు సాయపడతాయి.
ఇక రెండో అంశం.. నల్ల పూసలు భూమి, నీటి మూలకాల శక్తిని కలిగి ఉన్నందున రక్షక కవచంగా భావించబడుతుంది. ఇదే సమయంలో బంగారాన్ని గాలి, అగ్ని కి చిహ్నంగా భావిస్తారు. వీటివల్ల చెడుదృష్టి పడకుండా ఉంటుంది.
ఇక మూడో విషయం... బంగారం, నల్లపూసల్లోని క్రియాశీలత కారణంగా స్త్రీ శరీరంలోని దైవిక శక్తి మేల్కొంటుంది. దీనివల్ల ఆమె ప్రవర్తనలోనూ నెమ్మదితనం వస్తుంది.
నిజానికి నల్ల పూసల అసలు రూపం ఏంటంటే.. చారిత్రాత్మకంగా, ఈ పూసలను జెట్, గాజు లేదా ఒనిక్స్గా భావించబడతాయి. ఒనిక్స్ అంటే నల్ల పూసలు చేయడానికి ఉపయోగించే మామూలు రాయి. అయితే ప్రస్తుతం ఈ పూసలను బ్లాక్ స్పినెల్, బ్లాక్ టూర్మాలిన్స్, అబ్సిడియన్, బ్లాక్ పెర్ల్స్, సింథటిక్ బ్లాక్ క్రిస్టల్స్‌తో తయారు చేస్తున్నారు. ఏదేమైనా, నల్ల గాజు పూసలు పెద్ద మొత్తంలో మాంగనీస్, కోబాల్ట్‌లతో ఐరన్ కలిపి.. లేకుండా కూడా చేస్తున్నారు. దీనివల్లే ఇవి నల్లగా కనిపిస్తాయి.
వేద కాలంలో దాదాపు 36 రకాల ఆభరణాలు వాడేవారని మీకు తెలుసా? ఈ ప్రతీ ఒక్క ఆభరణానికి మానవ శరీర యంత్రాంగాన్ని సూచిస్తుంది. వీటిని వేసుకున్న వారిలో దైవిక చైతన్యాన్ని నింపడానికి, ప్రతికూల శక్తులను తగ్గించడానికి లేదా వాటినుంచి రక్షించడానికి వీలవుతుంది. ఇక ఈ పూసల్ని ఎక్కువగా వాడే సంప్రదాయానికి పెట్టింది పేరు ఘనా. గత 4000 సంవత్సరాల క్రితం నాటినుంచి ఇక్కడ ఈ పూసల సంస్కృతి ఉంది. వీరి సంప్రదాయాలలో ఇది ఒకటిగా చేరిపోయింది. అయితే కేవలం నల్లపూసలే కాదు.. రంగురంగులు పూసలు వాడడం, వాటిని అత్యంత విలువైనవిగా భావించడం ఇక్కడ కనిపిస్తుంది.