Kids Intelligence: పిల్లల తెలివితేటలు పెరగాలంటే.. పేరెంట్స్ ఇలా చేస్తే చాలు!
ఏ పేరెంట్స్ అయినా పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. కానీ అందుకోసం ఏం చేయాలో చాలామందికి తెలీదు. రోజూ ఉదయాన్నే కొన్ని మంచి అలవాట్లు నేర్పించడం ద్వారా పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయట. అవెంటో తెలుసుకోండి.

తల్లిదండ్రులు తమ పిల్లలు తెలివిగా, చురుకుగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలు తెలివిగా ఉంటేనే వారికి చదువు, స్కిల్స్ మంచిగా అబ్బుతాయి. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత కాబట్టి వారికి మంచి అలవాట్లను చిన్నప్పటి నుంచే నేర్పించడం మంచిది.
ఉదయం వ్యాయామం:
పిల్లలను ఉదయం వ్యాయామం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. దానివల్ల వారి మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంటారు. కాబట్టి పిల్లలు యోగా, జాగింగ్ వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసేలా అలవాటు చేయాలి
ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్:
పిల్లలకు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యంగా ఉంటే అది వారి మెదడుకు శక్తిని అందించడమే కాకుండా, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి పోషకమైన ఆహారంతో పిల్లల రోజును ప్రారంభించాలి. దీనికోసం వారికి ఓట్స్, గోధుమలు వంటి తృణధాన్యాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వవచ్చు. ఇది వారిని శక్తివంతంగా ఉంచుతుంది.
చదవడం:
పిల్లలకు ప్రతిరోజూ ఉదయం చదవడం అలవాటు చేయాలి. పిల్లలకు ఇష్టమైన నవల, పుస్తకం ఏదైనా సరే, చదవడం వారి దినచర్యలో భాగం చేయాలి. దీనివల్ల చదవడంపై వారికి ఇష్టం పెరుగుతుంది.
ధ్యానం:
పిల్లలను ధ్యానం చేసేలా ప్రోత్సహించాలి. ఈ వ్యాయామం పిల్లల ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల పిల్లలు రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు.
సంగీతం వినేలా:
సాధారణంగా సంగీతం వినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు ఉదయం ప్రశాంతమైన సంగీతం వినేలా ప్రోత్సహించండి. దీనివల్ల వారు రోజంతా శక్తివంతంగా ఉంటారు.
ప్రకృతితో గడపడం:
పిల్లలు ఉదయం కొంత సమయం ప్రకృతితో గడిపితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీనికోసం వారిని పార్కుకు తీసుకెళ్లవచ్చు. లేదా ఇంటి తోట చుట్టూ తిరిగేలా చూడవచ్చు. దీనివల్ల వారిలో ఆసక్తి పెరుగుతుంది. ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు.
వీటికి దూరంగా..
పిల్లల తెలివితేటలు పెంచడానికి, ఉదయాన్నే వారిని మొబైల్ ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉంచండి. ఇవి వారి దృష్టిని మళ్లిస్తాయి.