వైరల్ ఫీవర్, డెెంగ్యూ జ్వరాలకు.. గుండె పోటుకు మధ్య సంబంధం ఉందా?
Heart Attack: వానాకాలం, శీతాకాలంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్ అధికంగా వస్తూ ఉంటాయి. ఈ జ్వరాలను తేలికగా తీసుకోకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ జ్వరాలు గుండెపై కూడా ప్రభావం చూపుతాయి. గుండె పోటు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.

ఈ జ్వరాలు డేంజర్
వర్షాలు జోరుగా పడుతున్నాయి. మరో పక్క శీతాకాలం కూడా వచ్చేసింది. ఇలా వాతావారణంలోనే జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి దాడి చేస్తాయి. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన ఎక్కువ మంది పడుతూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ జ్వరాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. కొంతమంది జ్వరం వస్తే సాధారణమేనని వదిలేస్తారు. ఒక్కోసారి డెంగ్యూ వచ్చినా గుర్తించలేరు. అప్పుడే.. డెంగ్యూ ముదిరిపోయాక బయటపడుతుంది.
గుండె పై ప్రభావం
డెంగ్యూ జ్వరం ప్రమాదకరమైనది. ఇది వచ్చిందంటే దీని ప్రభావం కాలేయంపైనే అధికంగా ఉంటుంది. అయితే డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని తేలికగా తీసుకోకూడదు. అవి నేరుగా గుండెపైనే ప్రభావం చూపుతాయి. డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటివి గుండెను ఎలా బలహీనంగా మారుస్తాయో వైద్యులు వివరిస్తున్నారు.
వీరు జాగ్రత్తగా ఉండాల్సిందే
డెంగ్యూ, వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ ప్రభావం కేవలం శరీరం మీదే కాదు గుండెపై కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ అనేది వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ నేరుగా గుండె కండరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. అప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి డెంగ్యూ, వైరల్ జ్వరాలు ఎంతో హాని చేస్తాయి.
గుండెపై డెంగ్యూ ప్రభావం
- డెంగ్యూ వైరస్ అనేది గుండె కండరాలను దెబ్బతీస్తుంది.
- డెంగ్యూ వైరస్ వల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. గుండె లయ దెబ్బతింటుంది.
- పరిస్థితి తీవ్రంగా మారితే డెంగ్యూ గుండెపోటుకు కూడా కారణం అవుతుంది.
వైరల్ ఫీవర్ వల్ల ప్రభావం
- వైరల్ ఫీవర్ ను చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
- శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వైరల్ జ్వరం, ఇన్ ఫ్లమ్మేషన్ అనేవి గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి.
- వైరల్ ఇన్ఫెక్షన్లు గుండె కండరాలు, దాని విద్యుత్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఈ జాగ్రత్తలు తప్పవు
మీకు డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్ వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. గుండె సమస్యలు ఉంటే కచ్చితంగా వైద్యులకు ఆ విషయాన్ని చెప్పి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.