పురుషుల గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!
ప్రతి ఏడాది నవంబర్ 19 నాడు ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి అవగాహన పెంచడానికి సెలబ్రేట్ చేస్తారు. ఈ సందర్భంగా వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 40 ఏండ్ల వయసున్న పురుషులు కూడా గుండెపోటుతో మరణించిన ఘటనలు మనం ఈ మధ్యనే చాలా చూసాం.. చూస్తూనే ఉన్నాం.. ఆడవాళ్లతో పోల్చితే మగవారే గుండెపోటుతో ఎక్కువగా చనిపోతున్నారు. అసలు గుండె ఆరోగ్యంగా ఉండటానికి, గుండె జబ్బులు రాకుండా ఉండటానికి పురుషులు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ ని మానిటర్ చేయాలి
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ 20 ఏండ్ల వయస్సు గల పురుషుల్లో ప్రతి నలుగురిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అదే 75 ఏండ్ల వయసులో సుమారుగా 75 శాతం మంది పురుషులు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా అధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలను చూపించదు. కానీ ఈ రక్తపోటు ఆడవారు, మగవారు ఇద్దరిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. బరువు ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే నిరంతరం బీపీ ఎంతుందో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్, కొలెస్ట్రాల్ టెస్ట్ లను కూడా చేయించుకుంటూ ఉండాలి.
ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి
స్మోకింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా బాగా దెబ్బతింటుంది. ధూమపానం వల్ల గుండె ధమనులకు, ఇతర రక్తనాళాలకు తీవ్రమైన హాని కలుగుతుంది. దీనివల్లే గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదు ఇది గుండె, ఇతర అవయవాలల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం కూడా అంతే. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. ఈ రెండు అలవాట్లు వదులుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే మద్యం అలవాటును పూర్తిగా వదులుకోకపోతే వారానికి ఒక గ్లాస్ మాత్రమే తాగండి.
ఒత్తిడి స్థాయిలను తగ్గించండి
మనలో చాలా మందికి ఒత్తిడి దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. ఈ ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలను తినేలా ప్రేరేపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎప్పుడూ ఒత్తిడి తో ఉండే పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రొషెషనల్ సాయం తీసుకోండి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి
ఆరోగ్యకరమైన బరువు ఉంటేనే మీ గుండె అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, కొవ్వులను తీసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సంతృప్త కొవ్వులు , ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం తగ్గించండి. వీటికి బదులుగా ఆలివ్ ఆయిల్ వంటి అసంతృప్త కొవ్వులను తీసుకోవడం మంచిది.
బాగా నిద్రపోవడం
శరీరాన్ని రీపేర్ చేయడానికి, రీఛార్జ్ చేయడానికి నిద్ర చాలా అవసరం. ప్రశాంతమైన నిద్ర బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 7 నుంచి 9 గంటలు బాగా నిద్రపోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. పేలవమైన నిద్ర నాణ్యత గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిద్రసరిగ్గా పోకుంటే అధిక రక్తపోటు నుంచి గుండెపోటు వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. తగినంత నిద్రపోకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ పెరిగే బరువు పెరగడమే కాదు.. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.